Telangana Politics: తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు !
ABN, First Publish Date - 2023-08-27T11:46:59+05:30
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ (BRS) దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ థాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులను ఆయన కోరినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ (BRS) దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ థాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులను ఆయన కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ విజ్ఞప్తిపై వామపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.
ఇదిలావుండగా... మునుగోడు ఎన్నికల్లో వాడుకొని ఆ తర్వాత దూరం పెట్టడం, తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడకుండానే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి మోసగాడని, స్నేహబంధాన్ని మరిచి కమ్యూనిస్టులను దూరం పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్‌జీ-1 కమ్యూనిటీహాల్‌లో ఏఐటీయూసీ 16వ కేంద్ర మహాసభలను ఆయన జెండా ఆవిష్కరించి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. మునుగోడులో గెలవడానికి బీఆర్‌ఎస్‌కు తమ మద్దతు అవసరం అయ్యిందని, అప్పుడు కేసీఆర్ కలిసి పనిచేద్దామని చెప్పి ఇప్పుడు ద్రోహం చేశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్, బీజేపీ గెలిస్తే సింగరేణిని అమ్ముకుంటారని, సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
Updated Date - 2023-08-27T11:47:36+05:30 IST