BRS: గందరగోళంగా బీఆర్‌ఎస్ ఆత్మీయ సభ
ABN, First Publish Date - 2023-04-10T20:24:53+05:30
నిర్మల్ జిల్లా (Nirmal District) ముథోల్‌లో గల డీలక్స్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళన సభ గందరగోళానికి దారి తీసింది.
నిర్మల్: నిర్మల్ జిల్లా (Nirmal District) ముథోల్‌లో గల డీలక్స్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళన సభ గందరగోళానికి దారి తీసింది. సభలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ఓ కార్యకర్త నిల్చుని ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు పార్టీ నాయకులు.. ఆ కార్యకర్తను బయటికి గెంటేశారు. దీన్ని చూసిన మిగతా కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురయ్యారు. మరోవైపు సభలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (MLA Vithal Reddy) మాట్లాడుతుండగానే కార్యకర్తలు లేచి వెళ్లిపోవడంతో సభలో వేసిన కుర్చీలు ఖాళీ అయ్యాయి. భోజనం ఏర్పాట్లు చేస్తుండగా కార్యకర్తలు ప్లేట్ల కోసం ఒకరికొకరు లాక్కున్నారు. దీంతో కొద్దిసేపు ప్లేట్ల కోసం కార్యకర్తల మధ్య కుమ్ములాట సాగింది.
కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం
బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం అందేలా చూశారన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రానున్న ఆరు నెలల్లో ముథోల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో ఇల్లుకు రూ.3లక్షలు ఇవ్వనున్నామని చెప్పారు. అలాగే దళితబంధు కూడా అందజేస్తున్నామని విఠల్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-04-10T20:24:53+05:30 IST