The kerala story: భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శన నిలిపివేత
ABN, First Publish Date - 2023-05-12T18:40:04+05:30
నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ (The kerala story) సినిమా ప్రదర్శనను నిలిపేశారు. శుక్రవారం నుంచి స్థానిక కమల థియేటర్‌లో చిత్ర ప్రదర్శన జరగాల్సి ఉంది...
భైంసా: నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ (The kerala story) సినిమా ప్రదర్శనను నిలిపేశారు. శుక్రవారం నుంచి స్థానిక కమల థియేటర్‌లో చిత్ర ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఉదయం ఆట ఆరంభమయ్యే సమయానికి ముందు భైంసా పట్టణ పోలీసులు ప్రదర్శన నిలిపి వేయాల్సిందిగా థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో వారు సినిమా ప్రదర్శనను నిలిపి వేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సినిమాను తిలకించేందుకు వచ్చిన యువతులు, మహిళలు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనను నిలువరించేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీ శ్రేణులతో కలిసి థియేటర్ వద్దకు చేరుకొని సినిమా ప్రదర్శనను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. హిందూవాహిని మహిళా విభాగం శ్రేణులు సైతం ఆందోళన చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని గుర్తించిన పోలీసులు.. థియేటర్ సమీపంలోని వ్యాపార సంస్థలన్నింటినీ మూసి వేయించారు. అప్పటికే థియేటర్ లోపలి భాగంలో ఉన్న బీజేపీ (BJP), హిందూవాహిని నాయకులు సినిమా ప్రదర్శన చేపట్టేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. దీంతో థియేటర్ నిర్వాహకులు జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని సినిమాను ప్రదర్శిస్తామని తెలిపారు.
Updated Date - 2023-05-12T18:40:04+05:30 IST