BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్
ABN, First Publish Date - 2023-07-17T18:10:35+05:30
బీఆర్ఎస్‌ను ఢీ అంటే ఢీ అనే ఏకైక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే. ఓ వైపు చేరికలు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగడుతుండటంతో బీఆర్ఎస్‌కు అస్సలు రుచించట్లేదు. దీంతో రేవంత్ రెడ్డిని ప్రతిసారీ టార్గెట్ చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. మంత్రులు కేటీఆర్, హరీష్, జగదీశ్వర్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి అక్కసు వెల్లగక్కుతున్నారు...
తెలంగాణ రాజకీయాల్లో ‘పవర్’పై (Power Politics) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) టార్గెట్‌గా బీఆర్ఎస్ (BRS) రాజకీయాలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన తర్వాత రాష్ట్రంలో హస్తం పార్టీకి మునుపెన్నడూలేని జోష్ వచ్చింది. దీంతో అధికార బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్‌ను ఢీ అంటే ఢీ అనే ఏకైక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే. ఓ వైపు చేరికలు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగడుతుండటంతో బీఆర్ఎస్‌కు అస్సలు రుచించట్లేదు. దీంతో రేవంత్ రెడ్డిని ప్రతిసారీ టార్గెట్ చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. మంత్రులు కేటీఆర్, హరీష్, జగదీశ్వర్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి అక్కసు వెల్లగక్కుతున్నారు.
త్రీ కాదు సింగిల్ మాత్రమే..!
ఆదివారం నాడు మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) మీడియా మీట్‌లో రేవంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఒకింత సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌కు స్పందిస్తూ గాంధీ భవన్‌లో ఇవాళ రేవంత్ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటరిచ్చారు. ‘24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదని నేను నిరూపిస్తాను. కేటీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను. మూడు ఫేజ్‌ల కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సింగిల్ ఫేజ్ మాత్రమే 24 గంటలు ఇస్తున్నారు. విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారు. దొంగ లెక్కలు చూపించి 8 నుంచి 9వేల కోట్లు దోచుకుంటున్నారు.. ఈ డబ్బులు ఎక్కడికెళ్తున్నాయ్..? దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..?. ఉచిత విద్యుత్‌ను అనుచితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంటోంది’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎక్కడికి రమ్మంటావ్ కేటీఆర్..?
‘ఉచిత విద్యుత్‌ను, ప్రజల సెంటిమెంట్‌ను స్వార్థం కోసం కేసీఆర్ (CM KCR) వాడుకోకూడదని తానా వేదికగా నేను స్పష్టంగా చెప్పాను. దాన్ని తప్పుడు ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఉచిత కరెంట్ అనేది పేటెంట్ కాంగ్రెస్‌ది అయితే.. అసలు కాంగ్రెస్సే కరెంట్ ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడి.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఇలా కేటీఆర్ ఒకటే గంతులేస్తున్నారు. మూడు గంటలు కావాలా.. మూడు పంటలు కావాలా అని రచ్చ చేస్తున్నారు. ఆరు పెగ్గులు కావాలా.. లేకుంటే ఫుల్ బాటిల్ కావాలా..? . రైతు వేదికల్లో చర్చ పెడదాం.. కేటీఆర్ ఎక్కడ చర్చ పెట్టినా సరే.. నేను కూడా వస్తాను. ఉచిత కరెంట్ ఇవ్వలేదన్నది నిరూపించాం.. ఇప్పుడు కూడా ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 3,500 సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్కులను సీజ్ చేసింది. తెల్ల కాగితాలపై రాసుకునే దివాళా పరిస్థితి వచ్చిందంటే.. ప్రభుత్వం కరెంట్‌ను ఏవిధంగా అవినీతికి వాడుకుంటోందో ప్రజలకు గమనించాలి. రైతు వేదికల్లో చర్చ జరగాలని పిలుపిచ్చినావో.. సిరిసిల్లలో రైతు వేదికకు రావాలా..? సిద్ధిపేటలో చింతమడకలో మీ నాయన కేసీఆర్ పుట్టిన ఊరిలోకి రావాలా..?. సీఎం ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని రైతు వేదికకు రావాలో.. విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే తుంగుతర్తికి రావాలా.. లేకుంటే మంత్రి ఉండే నాగారం గ్రామానికి రావాలా..? కేటీఆర్ స్పష్టంగా చెప్పాలి. మీరు సవాల్ చేశారు.. చర్చ పెట్టమన్నారు.. చర్చకు మేం రెడీగా ఉన్నాం. 24 గంటలు పవర్ ఇస్తున్నామని మీరు చెబుతున్నారు.. ఇస్తలేరు అని మేం చెబుతున్నాం.. ఆధారాలతో సహా వస్తాం.. తేల్చుకుందాం’ అని కేటీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.
Updated Date - 2023-07-17T18:15:44+05:30 IST