BJP: కాసేపట్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్.. వరంగల్‌లో ఉద్రిక్తత వాతావరణం
ABN, First Publish Date - 2023-04-15T17:37:14+05:30
టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీతోపాటు నిరుద్యోగుల బాధలు, రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పేరిట బీజేపీ (JP) తలపెట్టిన ‘నిరుద్యోగ మార్చ్’కు రంగం సిద్ధమైంది.
వరంగల్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీతోపాటు నిరుద్యోగుల బాధలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ (BJP) తలపెట్టిన ‘నిరుద్యోగ మార్చ్’కు రంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీ వద్ద మార్చ్(ర్యాలీ) ప్రారంభమై.. హ నుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఈ మార్చ్‌కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) హాజరై నిరుద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు. అయితే బండి ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. టెన్త్ పేపర్ లీక్ కేసు (Tenth paper leak case)లో అరెస్ట్ తర్వాత తొలిసారి ఆయన వరంగల్ (Warangal)కు వచ్చారు. అరెస్ట్ సందర్భంలో వరంగల్ సీపీ రంగనాథ్ (Warangal CP Ranganath)పై సంజయ్ ఆరోపణలు చేశారు. వరంగల్ సీపీ కార్యాలయం నుంచే నిరుద్యోగ మార్చ్ సాగనుంది. ఎలాంటి ఉద్రిక్తలు చోటుచేసుకుండా భారీగా పోలీసులను మోహరించారు. ర్యాలీలో రబ్బర్ బుల్లెట్ వాహనాలు, మొబైల్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ర్యాలీని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీలో జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అటు పోలీసులు ఇటు బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో వరంగల్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసు ఆంక్షలు
బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్‌కు పోలీసులు పలు నిబంధనలు నిర్దేశించారు. ర్యాలీని శనివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల మధ్య కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వరకు కొన్ని షరతులకు కట్టుబడి నిర్వహించుకునేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అనుమతిచ్చింది. మార్చ్ రోడ్డుకు ఎడమవైపునే సాగాలని, మార్చ్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారు తమ వాహనాలను బాలసముద్రం రోడ్డులోని హయగ్రీవాచారి గ్రౌండ్ (కుడా)లో పార్కింగ్ చేయాలని, మార్చ్ సందర్భంగా డీజే స్పీకర్లను వాడరాదని, కించపరిచే నినాదాలు ఇవ్వరాదని, ప్రశాంతంగా, సామరస్యంగా నిర్వహించాలని, మార్చ్ సాగే మార్గంలో మధ్య మధ్య ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని, ఆయుధాలను ధరించినట్లయితే అనుమతి రద్దవుతుందని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించరాదని, ప్రభుత్వాన్నిగానీ, ఏ రాజకీయ పార్టీని, సంస్థను లేదా ఏ వర్గాన్నయినా విమర్శిస్తూ ప్రసంగాలు చేయరాదన్న షరతులను విధించారు.
Updated Date - 2023-04-15T17:43:25+05:30 IST