TS News: మోరంచపల్లి విషాదం.. బయటపడుతున్న మృతదేహాలు
ABN, First Publish Date - 2023-07-29T10:41:32+05:30
జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగిపొర్లడంతో ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయింది.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగిపొర్లడంతో ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయింది. గ్రామ ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. చివరకు సీఎం ఆదేశాలతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గ్రామ ప్రజలను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా హెలికాఫ్టర్లు, బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద బీభత్సానికి అప్పటికే పలువురు గ్రామ వాసులు గల్లంతయ్యారు. ప్రస్తుతం మోరంచవాగు వరద తగ్గడంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. మొన్న రాత్రి గల్లంతైన గొర్రె ఆదిరెడ్డి - వజ్రమ్మ మృతదేహాలు లభ్యమైంది. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు కనిపించాయి. తమ వారి మృతదేహాలు బయటపడుతుండటంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరోవైపు జిల్లాలో వరద బీభత్సానికి 11 మంది మృతి చెందారు. మరో ఏడుగురు ఆచూకీ గల్లంతయ్యారు. వరద ఉధృతితో ఊళ్లు మొత్తం తమ రూపురేఖలకు కోల్పోయాయి. పల్లెల్లో ప్రజలు సర్వం కోల్పోయి ఆగమైన పరిస్థితి. చెరువు కట్టలు తెగడంతో పంట పొలాలు నీట మునిగాయి. రైతుల ఆశలు అడియాశలయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో 40 చెరువులకు గండ్లు పడ్డాయి. పూర్తిస్థాయిలో రోడ్ల విధ్వంసమయ్యాయి. మోరంచపల్లి వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమవగా.. రవాణా స్థంభించింది. వర్షాలకు దాదాపు 13,270 ఎకరాల్లో వరి నారు నీట మునిగింది. 11,891 ఎకరాల్లో పత్తి నష్టం వాటిల్లింది. 1,800 ఎకరాల్లో ఇసుక మేటలు వచ్చిచేరాయి. మోరంచపల్లిలో 153 బర్రెలు, 753 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాదాపు 50 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
Updated Date - 2023-07-29T10:41:32+05:30 IST