Yadadri: భక్తజనసంద్రం.. యాదగిరిక్షేత్రం
ABN, First Publish Date - 2023-03-26T19:03:02+05:30
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధి ఆదివారం భక్తజనసంద్రమైంది. వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధి ఆదివారం భక్తజనసంద్రమైంది. వారాంతపు సెలవురోజు కావడంతో భక్తులు పెదసంఖ్యలో వచ్చి ఇష్టదైవాలను దర్శించుకున్నారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లలో దేవదేవుడి దర్శనాలకోసం బారులుతీరారు. ధర్మదర్శనాలకు సుమారు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తులు (Devotees) పెద్దసంఖ్యలో రావడంతో పట్టణంలో, ఆలయ ఘాట్‌రోడ్ ప్రాంతాలు వాహనాలతో రద్దీ వాతావరణం నెలకొంది. ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల, ఆలయ తిరువీధులు భక్తుల రాకతో సందడిగా మారాయి.
సంప్రదాయ రీతిలో నిత్యపూజలు
స్వయంభు పాంచనారసింహుడికి నిత్య పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన అర్చకులు రాత్రివేళ మహానివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్భాలయంలోని స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, వసంత నవరాత్రి వేడుకలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. లక్ష్మీనృసింహుడిని హైకోర్టు న్యాయమూర్తి ఎ.అభిషేక్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, దేవస్థాన అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 30వేల మంది భక్తులు నృసింహుడిని దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.47,15,777 ఆదాయం సమకూరింది.
ఎండలో ఇబ్బందులు పడిన భక్తులు
యాదగిరీశుడి దర్శనానికి వచ్చిన భక్తులు మండే ఎండలతో ఇబ్బందులు పడ్డారు. కొండపైన సేద తీరే ప్రాంతాలు లేకపోవడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కపోతను భరించలేక విలవిలలాడారు. భక్తులు అధికసంఖ్యలో క్షేత్ర సందర్శనకు వస్తున్నా సరిపడా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి వెళ్లేందుకు సరిపడా బస్సు సర్వీలను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - 2023-03-26T19:03:02+05:30 IST