Yellendu MLA: ఇల్లెందు ఎమ్మెల్యేకి అసమ్మతి సెగ.. టిక్కెట్ ఇవ్వొద్దంటూ నేతలంతా రహస్యంగా...
ABN, First Publish Date - 2023-08-20T12:15:08+05:30
భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ(Yellendu MLA Banothu Haripriya)కు అసమ్మతి సెగ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో
ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ(Yellendu MLA Banothu Haripriya)కు అసమ్మతి సెగ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇవ్వొదంటూ ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో ఇల్లెందు నియోజకవర్గ బీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు శనివారం రాత్రి సమావేశమై అధిష్టానానికి పలు డిమాండ్లు వినిపించారు. ఇల్లెందు నియోజవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్‌లు తమ ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ బీఆర్‌ఎస్(BRS) పార్టీని భ్రష్టుపట్టించారని, పార్టీ మనుగడ కష్టసాధ్యంగా ఉందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బయ్యారం సింగిల్‌విండో చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు పులిగండ్ల మాధవరావులు మాట్లాడుతూ ఎమ్మెల్యే హరిప్రియపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నియోజక వర్గంలో అభివృద్ధి పనుల్లో ఎవ్వరికి సంబంధం లేకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ స్వలాభాల కోసమే పనులు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు, నాయకులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేయడంతో నియోజకవర్గంలో పార్టీ అభాసుపాలవుతుందని పేర్కొన్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ(Yellendu Municipality)లో పాలకవర్గానికి సంబంధం లేకుండా రూ.20కోట్లు డీఎంఎఫ్‌టీ నిధులను సంబంధంలేని పంచాయతీరాజ్ విభాగానికి బదలాయించారని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీని బతికించాలంటే ఎమ్మెల్యే హరిప్రియకు పార్టీ టిక్కెట్ ఇవ్వొద్దని, వేరే ఎవ్వరికిచ్చినా పార్టీని గెలిపించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR)పై పూర్తిగా నమ్మకముందని ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోని పార్టీని కాపాడాలని కోరారు. సమావేశంలో ఇల్లెందు ఎంపీపీ భర్త జానీ, పీఏసీఎస్ చైర్మన్ మెట్టెల కృష్ణ, టేకులపల్లి మండల నాయకులు నల్లమాసు రాజన్న, బయ్యారం నాయకులు, జడ్పీ చైర్మన్ ఆంగోతు తండ్రి అంగోతు శ్రీకాంత్, కామేపల్లి మండల నాయకులు మూడు కృష్ణప్రసాద్, బయ్యారం ఎంపీటీసీలు ఏనుగుల రాకేష్, జర్పుల శ్రీను, కామేపల్లి ఎంపీపీ భర్త సునీత రాందాసు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-20T12:15:08+05:30 IST