AP Police: అనకాపల్లిలో సైనికుడిపై పోలీసుల దౌర్జన్యం..
ABN, First Publish Date - 2023-11-08T12:58:55+05:30
ఫోన్‌లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో చోటు చేసుకుంది. యలమంచిలి మండలం, రేగుపాలెంకు చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్, బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు.
అనకాపల్లి: ఫోన్‌లో దిశ యాప్ (Disha App) ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడి (Soldier)పై పోలీసులు (Police) దాడి చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో చోటు చేసుకుంది. యలమంచిలి మండలం, రేగుపాలెంకు చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్, బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఈనెల 2న ఇంటికి వచ్చాడు. పరవాడ సంతబావిలివద్ద బస్సు కోసం నిరీక్షిస్తుండగా అప్పటికే అక్కడున్నవారి ఫోన్లలో పోలీసులు ముత్యాల నాయుడు, శోభారాణి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. అక్కడే ఉన్న సైనికుడు తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించాడు.
ఈ క్రమంలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ రాసుకున్నాడు. ఓటీపీతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని.. మీ బ్యాడ్జీలపై పేర్లు లేవని, తనకు అనుమానం కలుగుతోందని, గుర్తింపు కార్డులు చూపించాలని ఆయన పోలీసులను కోరాడు. వేసుకున్న పోలీస్ డ్రస్ కనిపించడంలేదా? స్టేషన్‌కు వస్తే గుర్తింపు కార్డు చూపిస్తామని పరుషంగా మాట్లాడుతూ సైనికుడి చొక్కా పట్టుకుని లాగడంతో కిందపడిపోయాడు. తర్వాత మరో పోలీస్ బూటు కాలుతో తన్నాడు. మహిళ కానిస్టేబుల్ సయ్యద్ అలీముల్లా దవడపై కొట్టారు. గుర్తింపు కార్డు అడిగినంత మాత్రాన దాడి చేస్తారా? అని పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. పురుషులకు దిశ యాప్ ఎందుకని నిలదీశారు. ఈ క్రమంలో మరో ఇద్దరు పోలీసులు అక్కడకు చేరుకుని నలుగురు కలిసి ఆ సైనికుడిని స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. బాధితుడు ప్రతిఘటించాడు. చివరికి పోలీసులు సైనికుడి ఐడీ కార్డు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు అనకాపల్లి ఎస్పీని కలిసి జరిగిన ఘటనను వివరించాడు. ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించి.. నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌కు అటాచ్ చేశారు.
Updated Date - 2023-11-08T12:58:57+05:30 IST