మేనమామే.. కాలయముడు
ABN, Publish Date - Nov 30 , 2024 | 03:27 AM
ఆస్తిపై ఆశ ఆ మనిషిని కిరాతకంగా మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసేలా చేసింది.
గొంతు కోసి బాలుడి దారుణ హత్య
బడి నుంచి కిడ్నాప్ చేసి ఘోరం
ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలే కారణం
పోలీసుల అదుపులో నిందితుడు
శ్రీసత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన
మడకశిర, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపై ఆశ ఆ మనిషిని కిరాతకంగా మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసేలా చేసింది. కుటుంబ తగాదాల కారణంగా వరుసకు మేనమామ.. ఆ పసివాడిని పొట్టన పెట్టుకున్నాడు. బడి నుంచి కిడ్నాప్ చేసి ఆపై గొంతు కోసి హత్య చేశాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన్ (13) హత్య జిల్లాలో కలకలం రేపింది. పాఠశాల నుంచి గురువారం మధ్యాహ్నం కిడ్నాప్ అయిన చేతన్.. పావగడ తాలూకా రాజవంతి సమీపంలోని అటవీ ప్రాంతంలో విగతజీవిగా కనిపించాడు. ఈ కేసులో అనుమానితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్పీ బి.రత్న తెలిపారు.
అమ్మతో కలిసి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ..
మడకశిర మండలం మరువపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, పుష్పలత దంపతులు విభేదాల కారణంగా పన్నెండేళ్ల క్రితం విడిపోయారు. విడాకుల అనంతరం కుమారుడు చేతన్‌తో కలిసి పుష్పలత అదే గ్రామంలోని పుట్టింట్లో ఉంటోంది. చేతన్ మూడు కిలోమీటర్ల దూరంలోని ఆమిదాలగొంది జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వెంకటేశ్వర్లు రెండో వివాహం చేసుకోగా.. పుష్పలత కియ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. ఈ క్రమంలో చేతన్ తాత శ్రీరామప్పకు గురువారం మధ్యాహ్నం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘నీ మనవడిని కిడ్నాప్ చేశాం.. బడిలో ఉన్నాడో లేదో చూసుకుని.. ఫోన్ చెయ్..’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. కంగారుపడిన శ్రీరామప్ప పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై తీసుకువెళ్లారని తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ నంబర్ ఓ మహిళదని గుర్తించి ఆమెను స్టేషన్‌కు రప్పించారు. మరోవైపు చేతన్‌ను వాళ్ల మేనమామ తీసుకెళ్లాడని విద్యార్థులు చెప్పడంతో అశోక్‌ను అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసిన అశోక్‌ని ఆ మహిళ గుర్తించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో చేతన్‌ను హత్య చేసింది తానేరని అశోక్ అంగీకరించినట్లు సమాచారం.
ఎవరీ అశోక్...?
పుష్పలత తల్లి గంగమ్మకు ఓ సోదరి ఉంది. ఆమె కొడుకే అశోక్. పుష్పలతకు తమ్ముడు.. చేతన్‌కు మేనమామ వరుస అవుతాడు. పుట్టింట్లో ఉంటున్న పుష్పలతకు భర్త నుంచి భరణం రూపంలో మూడు ఎకరాల పొలం వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు నెలకు రూ.3 వేలు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పుష్పలతకు మరికొన్ని ఆస్తులున్నాయని, వాటి విషయంలో కుటుంబంలో విభేదాలున్నాయని తెలిసింది. భర్తకు దూరమైన పుష్పలతకు చేతన్ ఒక్కడే వారసుడు. చేతన్‌ను తప్పిస్తే.. ఆస్తి మొత్తం దక్కుతుందని భావించి.. అశోక్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Updated Date - Nov 30 , 2024 | 03:27 AM