కొడుకు మృతదేహంతో 8 కి.మీ. నడక
ABN, Publish Date - Apr 10 , 2024 | 06:30 AM
రహదారి సౌకర్యం లేక కుమారుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు చేతులపై మోసుకుంటూ 8 కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి చేరిన దయనీయ పరిస్థితి అనంతగిరి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం రొంపిల్లి
రహదారి సౌకర్యం లేక చినకూనెల గ్రామస్థుడి అవస్థ
అరకులోయ, ఏప్రిల్ 9: రహదారి సౌకర్యం లేక కుమారుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు చేతులపై మోసుకుంటూ 8 కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి చేరిన దయనీయ పరిస్థితి అనంతగిరి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ శివారు శిఖర గ్రామం చినకూనెలకు చెందిన సార కొత్తయ్య, సీత దంపతులు పిల్లలతోపాటు ఉపాధి కోసం గుంటూరు జిల్లా కొల్లూరుకు వెళ్లి అక్కడ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. కాగా, వారి రెండున్నరేళ్ల కుమారుడు ఈశ్వరరావు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని చినకూనెల తరలించడానికి ఇటుక బట్టీ యజమాని, మేస్త్రీ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆ అంబులెన్స్ మంగళవారం వేకువజామున 2 గంటలకు విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనజ గ్రామం వరకు చేరుకుంది. అక్కడి నుంచి చినకూనెలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని చేతులపై వేసుకుని తండ్రి నడక సాగించాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ ఉదయం 8 గంటలకు స్వగ్రామం చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
Updated Date - Apr 10 , 2024 | 06:30 AM