జాతీయపతాక రూపశిల్పికి సముచిత గౌరవం
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:44 AM
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు కూటమి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. సీఎం చంద్రబాబు చొరవతో మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు 132ను సోమవారం జారీ చేసింది. ఈ నెల 2న మచిలీపట్నం వచ్చిన ముఖ్యమంత్రిని బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కలిసి మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు జాతీయ నేతకు సముచిత స్థానం లభించింది.
-మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు
- జీవో ఎంఎస్ నంబరు 132ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-బందరు జాతీయ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసి పింగళి
-మహాత్మాగాంధీ సూచనలతో జాతీయ పతాకానికి రూపకల్పన
-ఇటీవల బందరు వచ్చిన సీఎం దృష్టికి పింగళి విషయం తీసుకెళ్లిన ఎంపీ బాలశౌరి
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు కూటమి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. సీఎం చంద్రబాబు చొరవతో మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు 132ను సోమవారం జారీ చేసింది. ఈ నెల 2న మచిలీపట్నం వచ్చిన ముఖ్యమంత్రిని బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి కలిసి మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు జాతీయ నేతకు సముచిత స్థానం లభించింది.
(మచిలీపట్నం - ఆంధ్రజ్యోతి)
పింగళి హనుమంతరాయుడు, వెంకటరత్నం దంపతులకు 1878 ఆగస్టు 2న భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మించారు. చల్లపల్లి మండలం యార్లగడ్డ, మొవ్వ మండలం భట్లపెనుమర్రు, మోపిదేవి మండలం పెదకళ్ల్లేపల్లిలో ఆయన బాల్యం, విద్యాభ్యాసం కొనసాగింది. భట్లపెనుమర్రులో ప్రాథమిక విద్యను, మచిలీపట్నం హిందూ హైస్కూలులో ప్రాథమికోన్నత విద్యను పింగళి అభ్యసించారు. పామర్రు గ్రామ కరణం కుమార్తె రుక్మిణమ్మను పింగళి వివాహం చేసుకున్నారు. ఉన్నతవిద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పింగళి 19వ ఏట సైన్యంలో చేరేందుకు ముంబై వెళ్లారు. అప్పట్లో జరిగిన బోయర్ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీని కలుసుకున్నారు. చదువుకోవాలనే ఆభిలాషతో ఆయన లాహోర్‌లోని డీఏవీ కళాశాలలో చేరారు. అక్కడ ఇంగ్లీష్, జపాన్, సంస్కృతం, ఉర్ధూ భాషలను నేర్చుకుని వాటిపై పట్టు సాధించారు. జపాన్ భాషలో ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. తనకు జపాన్ భాష నేర్పిన ఫ్రొఫెసర్ గోటేకు తెలుగుభాషను వెంకయ్య నేర్పించారు. మచిలీపట్నంలోని ఆంధ్రా జాతీయ కళాశాలలో వెంకయ్య అధ్యాపకుడిగా ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేశారు. వ్యవసాయంపైనా పింగళికి మక్కువ ఎక్కువ. 1909లో ఏలూరులో జరిగిన వ్యవసాయ పరిశోధనా ప్రదర్శనలో పింగళి ప్రతిభను గుర్తించి ఆయనకు బంగారు పతకాన్ని బహూకరించారు. పింగళి వ్యవసాయంలో చేసిన పరిశోధనలు గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో ఆయనకు సభ్యత్వమిచ్చి గౌరవించింది.
మహాత్మాగాంధీకి జాతీయ పతాకం ఆవశ్యకత తెలిపి మరీ..
మహాత్మాగాంధీ పిలుపు మేరకు జాతీయ స్వాతంత్య్ర ఉద్యమంలో పింగళి పాల్గొన్నారు. బాలగంగాధరతిలక్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఆయనకు రాజకీయ గురువులు. 1906లో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాల ప్రారంభంలో బ్రిటీష్‌వారి జాతీయ జెండాను, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించడం చూసి పింగళి ఎంతో కలత చెందేవారు. మన దేశానికి ఒక జాతీయజెండా ఉండాలని సన్నిహితుల వద్ద తరచూ అంటూ ఉండేవారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని పింగళి రచించారు. 1921 మార్చిలో కృష్ణాజిల్లా విజయవాడలో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మాగాంధీకి జాతీయ జెండా ఆవశ్యకతను పింగళి వివరించారు. మహాత్మాగాంధీ సూచనలతో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో రాట్నం ఉన్న జాతీయ జెండాను పింగళి వెంకయ్య మూడు గంటల్లోనే తయారు చేసి చూపారు. ఈ సమావేశంలోనే పింగళి రూపొందించిన జెండాను జాతీయ జెండాగా మహాత్మాగాంధీ ప్రకటించి, తీర్మానం కూడా చేయించారు. 1921 ఏప్రిల్ 13న యంగ్ ఇండియా పత్రికలో మహాత్మాగాంధీ మన జాతీయ పతాకం అనే శీర్షికతో ప్రత్యేకవ్యాసం రాసి జాతీయ జెండాను రూపొందించిన పింగళిని కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి రాజ్యాంగం అమలులోకి వచ్చాక త్రివర్ణపతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తించారు. జాతీయ జెండాలోని రాట్నం గుర్తుకు బదులుగా సత్యానికి, ధర్మానికి ప్రతీకగా ఉన్న అశోకచక్రాన్ని ఉంచాలని తీర్మానం చేశారు. 1963 జూలై 4న పింగళి వెంకయ్య పరమపదించారు. ప్రధాన మంత్రి లాల్ బహదూర్‌శాసి్త్ర విజయవాడ వచ్చిన సమయంలో గాంధీహిల్‌లోని గ్రంథాలయం హాలులో పింగళి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పింగళి పేరుతో స్టాంప్‌ను విడుదల చేసింది. ఇలా పలు సందర్భాల్లో పింగళిని స్మరించుకుంటూ వచ్చినా ఆయన సొంత జిల్లాలో ఆయనకు సముచిత గుర్తింపునివ్వడంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి పేరును పెట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘భోగరాజు’కు ఎప్పుడు మోక్షం!
వైసీపీ నేతలు ఆడిన రాజకీయ క్రీడలో చరిత్ర స్మరించుకోదగిన మహనీయులు కనుమరుగై పోతున్నారు. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మచిలీపట్నం ఖ్యాతిని దశదిశలా చాటిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి భవిష్యత తరాలకు తెలిపే చిన్నపాటి స్మారక భవనం కూడా ఎక్కడా లేదు. మరోవైపు ఆయన స్థాపించిన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో పట్టాభి ఆనవాళ్లు పూర్తిగా చెరిపేసినట్లయింది.
పట్టాభి స్మారకంపై రాజకీయ క్రీడ
పట్టాభి పేరు భవిష్యత్తు తరాలు మరచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం, మ్యూజియం మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి తెచ్చారు. యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉన్నతస్థాయి అధికా రులతో పలుమార్లు సంప్రదింపులు జరిపి రూ.40 కోట్ల వ్యయంతో పట్టాభి స్మారక భవనాన్ని మచిలీపట్నంలో నిర్మాణం చేసేలా ఒప్పించారు. ఈ స్మారక భవనం నిర్మాణం కోసం మచిలీపట్నంలో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ఎప్పటి నుంచో అధికారులను కోరుతున్నారు. కానీ అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని ఈ ప్రక్రియను అడ్డుకుంటూ వచ్చారు. పట్టాభి స్మారక భవనానికి స్థలం కేటాయించకుండా అదే స్థలాన్ని వైసీపీ కార్యాలయం కోసం కేటాయించడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇప్పటికీ మచిలీపట్నం కార్పొరేషన్ వైసీపీ పాలకుల చేతిలో ఉండటం.. పేర్ని నాని అడ్డుకుంటుండటంతో స్థల కేటాయింపు ప్రక్రియ కొలిక్కి రావడం లేదు.
ఒక ఆశయం నెరవేరింది
-వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ
మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పింగళి వెంకయ్య పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. గత ప్రభుత్వం హయాంలో మెడికల్ కళాశాలకు పింగళి పేరు పెట్టాలని పలుమార్లు కోరినా, అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఇటీవల మచిలీపట్నం వచ్చిన ముఖ్యమంత్రి వద్ద పింగళి పేరును మెడికల్ కళాశాలకు పెట్టాలని ప్రతిపాదన చేశా. వెంటనే స్పందించిన సీఎం ఉత్తర్వులు జారీ చేయించారు. పింగళికి అత్యున్నత గౌరవం లభించేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవడం ఆనందంగా ఉంది. ఒక ఆశయాన్ని సాధించగలిగాను. భోగరాజు స్మారక భవన నిర్మాణం చేయడం ద్వారా రెండో ఆశయ సాధనకు స్థానికంగా ఉన్న రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయి. అయినా సాధిస్తానన్న నమ్మకం ఉంది.
బాలశౌరి కృషి ప్రశంసనీయం
-ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ
మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టడం ఎంతైనా సముచితం. స్వాతంత్య్ర పోరాటంలో నిస్వార్థ సేవలు అందించిన మహనీయుడు పింగళి. ఆయన పేరును ఈ తరానికి పరిచయం చేయడానికి కృషి చేసిన బాలశౌరి ప్రశంసనీయుడు.
Updated Date - Oct 22 , 2024 | 12:44 AM