వివస్త్రను చేసి, చెట్టుకు కట్టి, బ్లేడ్లతో కోసి, రాళ్లతో కొట్టి..
ABN, Publish Date - Jul 26 , 2024 | 03:06 AM
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లె పంచాయతీ షికారుపాలెంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం నెపంతో కొందరు ఆమెను వివస్త్రను చేసి అనంతరం చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు.
వివాహేతర సంబంధం నెపంతో మహిళపై దాడి
అన్నమయ్య జిల్లాలో అమానుషం
పోలీస్ స్టేషన్‌కు వెళితే దుర్భాషలాడిన ఎస్‌ఐ
కేసు నమోదుకు తిరస్కరణ, కుల పంచాయితీ చేసుకోవాలని సూచన
వీరబల్లి, జూలై 25: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం తాటిగుంటపల్లె పంచాయతీ షికారుపాలెంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వివాహేతర సంబంధం నెపంతో కొందరు ఆమెను వివస్త్రను చేసి అనంతరం చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి హింసించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఓ మహిళ (27) మొదటి భర్తతో విడిపోయి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతో అతని బంధువులు గురువారం ఆమెను చిత్రహింసలు పెట్టారు. వివస్త్రను చేసి కొట్టడంతో పాటు బ్లేడ్లతో కోశారు. ఆ తర్వాత ఆమెను చెట్టుకు కట్టి కోడిగుడ్లతో, టమోటాలతో, రాళ్లతో, చెప్పులతో కొట్టారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థులు వేడుక చూశారు. బంధువులు ఆమెను విడిపించడానికి ప్రయత్నించగా మిమ్మల్ని ఇదే విధంగా కొడతామని బెదిరించడంతో మిన్నకుండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను విడిపించారు. అనంతరం వీరబల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు రాగా, ఎస్‌ఐ తీసుకోకుండా మీ కుల వ్యవహారం మీరే పరిష్కరించుకోవాలని చెప్పి పంపారని బాధితురాలు వాపోయారు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను చిత్రహింసలు పెట్టారని చెప్పినా ఎస్‌ఐ ఎటువంటి చర్యలు తీసుకోకుండా పంపారని తెలిపారు. బాధితురాలిని రాయచోటి రూరల్ సీఐ తులసీరామ్ పరామర్శించి, ఆమె వాంగ్మూలం ప్రకారం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా..షికారుపాలెంలో మహిళపై దాడి చేసిన వారికి కఠినశిక్ష పడాలని జనసేన పార్టీ వీరమహిళ రెడ్డి రాణి తెలిపారు. ఘటనను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ చంద్రమోహన్‌ను వివరణ కోరగా కుటుంబానికి సంబంధించిన విషయమని తాము పంచాయితీ చేసుకుంటామని చెప్పడంతో కేసు పెట్టలేదని ఎస్‌ఐ చెప్పారు.
Updated Date - Jul 26 , 2024 | 03:06 AM