సర్వే రాళ్లలో.. అడ్డంగా దొరికాడు!
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:06 AM
సర్వే రాళ్ల కొనుగోళ్లపై ఏసీబీ నాలుగు రోజులుగా విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏసీఎండీసీ) కార్యాలయంలో 14 మంది కీలక అధికారులను విడివిడిగా విచారించింది.
రూ.575 కోట్ల దోపిడీకి వెంకటరెడ్డి స్కెచ్
ఏసీబీ విచారణలో బట్టబయలు
కోటి టర్నోవర్ కూడా లేని ధన్వంతరికి టెండర్ ఇవ్వడం కుదరదన్న అధికారులు
నోట్‌ఫైల్స్‌పై రాసినా లెక్కచేయని ఎండీ
10 మంది అధికారులను నెల్లూరు తీసుకెళ్లి ప్రశ్నించిన ఏసీబీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సర్వే రాళ్ల కొనుగోళ్లపై ఏసీబీ నాలుగు రోజులుగా విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏసీఎండీసీ) కార్యాలయంలో 14 మంది కీలక అధికారులను విడివిడిగా విచారించింది. వీరిలో 8 మంది గనుల శాఖకు చెందినవారు. స్టీల్ ప్లాంటు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఎస్వీ బోస్, మైనింగ్ శాఖకు చెందిన సాంకేతిక అధికారి.. ఓ ప్రముఖ కన్సల్టెన్సీకి చెందిన నలుగురు అధికారులు కూడా ఉన్నారు. వీరందరినీ సోమవారం రాత్రి వారిని నెల్లూరులోని ఏసీబీ ఆఫీసుకు తరలించారు. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వారిని ప్రశ్నించారు. బుధవారం తెల్లవారుజామున ఆ అధికారులను, కన్సల్టెన్సీకి చెందిన ఇద్దరు అధికారులను తిరిగి విజయవాడకు పంపించారు. ఆ కన్సల్టెన్సీకి చెందిన ఇద్దరు ముఖ్య అధికారులను మాత్రం ఇంకా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సర్వే రాళ్ల ఎంగ్రేవింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం పిలిచిన టెండర్లు, ఽవైద్య పరికరాలు విక్రయించే సంస్థ ‘ధన్వంతరి’కి టెండర్ అప్పగింతపై ఏసీబీ 16 ప్రశ్నలను ప్రధానంగా లేవనెత్తి సమాధానాలు రాబట్టింది.
రూపకర్త వెంకటరెడ్డే..!
వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌గా, ఏపీఎండీసీ ఎండీగా ఉన్న సమయంలో 3.5 కోట్ల సర్వే రాళ్లను కొనుగోలు చేయాలనుకున్నారు. గ్రానైట్ రాళ్లను సరఫరాదారుల నుంచి తీసుకున్నాక పాలిష్ చేయడం, వాటిపై భూమి హక్కు, జగన్ పేర్లను రాయడం వంటి పనులు (ఎంగ్రేవింగ్) చేయడానికి ప్రత్యేకంగా ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) యూనిట్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందుకోసం చైనా యంత్రాలు కొనాలనుకున్నారు. ఈ యంత్రాల కొనుగోలు విలువే రూ.525 కోట్ల వరకు ఉంది. ఈ వర్క్‌ను కూడా సర్వే రాళ్ల సరఫరా ఏజెన్సీలకే అప్పగించవచ్చు. కానీ ఆ పనిచేయకుండా.. ప్రత్యేకంగా ఓఎండ్‌ఎం యూనిట్ల అంశాన్ని వెంకటరెడ్డి తెరపైకి తెచ్చారు. నిబంధనల ప్రకారం చైనా యంత్రాల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలి. టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడీషియల్ కమిషన్ ఆమోదానికి పంపించాలి. కానీ వెంకటరెడ్డి వైద్య పరికరాలు అమ్ముకునే ధన్వంతరి అనే కంపెనీకి టెండర్ కట్టబెట్టారు. సర్వే రాళ్లకు, వైద్య పరికరాల సంస్థకు సంబంధం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తారనే సంకోచం లేకుండా.. యంత్రాల కొనుగోలు టెండర్, కొన్న వాటిని జాగ్రత్తగా నిర్వహించే కాంట్రాక్టు.. ఈ రెండింటినీ ఆ సంస్థకే వెంకటరెడ్డి ఇచ్చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీకి చైనా యంత్రాలు కొనుగోలు చేసే ఆర్ధిక సామర్థ్యం లేకపోవడంతో రూ.100 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ వెంటనే డబ్బు విడుదలకు ఆర్థిక శాఖపై వెంకటరెడ్డి తీవ్ర ఒత్తిడిచేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ.2 కోట్లు పలికే యంత్రాన్ని ఈ సంస్థ రూ.7.46 కోట్లకు కొనుగోలు చేసింది. బల్లికురవలో ఓ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత జిల్లాల వారీగా యూనిట్లు ఏర్పాటు చేయాలని వెంకటరెడ్డి ప్రతిపాదనలు పంపించారు. వాటిని నాటి గనుల శాఖ ముఖ్యకార్యదర్శి తిరస్కరించారు. ఈలోపు ఎన్నికల సందడి మొదలవడంతో నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ అధికారి అండతో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
అంతా గోల్‌మాల్..
టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. గతంలో ఈ టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షించిన గనుల శాఖ అధికారులను ప్రశ్నించింది. టెండర్ కమిటీని కూడా విచారించింది. ఎంగ్రేవింగ్ యూనిట్లకు సంబంధించి 2023 జనవరి 4న జరిగిన మీటింగ్ మినిట్స్‌ను దగ్గర పెట్టుకుని విచారణ జరిపింది. చైనా యంత్రాల కొనుగోలు, నిర్వహణ టెండర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోలేదని, టెండర్‌ను జ్యుడీషియల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లకుండానే నడిపించారని గుర్తించింది. కనీసం రూ.కోటి టర్నోవర్ కూడా లేని ధన్వంతరి అసోసియేట్స్‌కు రూ.వందల కోట్ల టెండర్ కట్టబెట్టారని.. నిబంధనలకు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా ఈ ప్రక్రియను నడిపారని తేల్చింది. ఆర్థిక సామర్థ్యమే లేని ధన్వంతరికి ప్రభుత్వమే రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇప్పించి.. ఆ సొమ్ముతో చైనా యంత్రాలు కొనుగోలు చేయించడం పూర్తిగా కుట్రపూరితమని.. ఇందులో దురుద్దేశాలు ఉన్నాయని పలు నోట్‌ఫైల్స్, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ నిర్ధారించింది. కాగా.. ఈ టెండర్ నిర్వహించే సత్తా ఈ కంపెనీకి లేదని, బిల్లులు ఇవ్వకూడదని పలు స్థాయుల్లోని అధికారులు స్పష్టం చేశారు. అవన్నీ బయటికొస్తే బండారం బయటపడుతుందని.. గుట్టుగా ఆ కంపెనీకి బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి పంపించాలని వెంకటరెడ్డి ప్లాన్ చేసినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఆ కంపెనీతో అగ్రిమెంట్లు రద్దుచేసుకోకుండానే.. అకౌంట్స్, ఇతర విభాగాల అధికారులు వ్యతిరేకించినా.. బ్యాంకు గ్యారెంటీలు ఇప్పించడం ద్వారా వెంకటరెడ్డి ఏకపక్షంగా మేలుచేశారని తేల్చింది.
ఆయన అనుకున్నదే చేశారు!
ధన్వంతరి పేరిట జరిగిన గోల్‌మాల్‌పై మైన్స్, కన్సల్టెన్సీ అధికారుల వాంగ్మూలాలను ఏసీబీ నెల్లూరు కార్యాలయంలో రికార్డుచేసింది. అక్కడే ఫైళ్లను పరిశీలించి వారి అభిప్రాయాలను నమోదు చేసింది. ప్రభుత్వానికి తెలియజేయకుండా టెండర్లు పిలవడం, జ్యుడీషియల్ కమిషన్ ఆమోదం తీసుకోకపోవడం, ఏకపక్షంగా ధన్వంతరికి అడ్వాన్స్ ఇప్పించడం వంటివన్నీ వెంకటరెడ్డి కేంద్రంగానే జరిగాయని వారు చెప్పారు. నోట్‌ఫైల్స్, ఇతర డాక్యుమెంట్లలో తాము నిబంధనలను ప్రస్తావించామని, కానీ చివరకు వెంకటరెడ్డి తాను అనుకున్నదే చేశారని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆధారాలనూ వారు ఏసీబీకి సమర్పించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. టెండర్ డాక్యుమెంట్లు, ఒప్పందాలను తయారుచేసిన కన్సల్టెన్సీకి చెందిన నలుగురు అధికారులను ఏసీబీ విచారించింది. వీరిలో ఇద్దరిని పంపించివేసి మరో ఇద్దరిని మాత్రం నెల్లూరులోనే ఉంచి ప్రశ్నిస్తోంది.
గనుల ఘనుడు వీజీ వెంకటరెడ్డి అవినీతి, అక్రమాల లీలలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. భూముల సర్వే కోసం రాళ్ల కొనుగోలు, ఆ రాళ్ల పాలిషింగ్‌కు, వాటిపై జగన్ పేరు రాయడానికి (ఎంగ్రేవింగ్) చైనా యంత్రాల కొనుగోలు పేరిట భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఆ దోపిడీ రూ.575 కోట్లపైనే.
వెంకటరెడ్డి ప్రమేయం, అధికార దుర్వినియోగంపై ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది.’
Updated Date - Oct 31 , 2024 | 04:06 AM