పెద్దిరెడ్డి సోదరులపై చర్య తీసుకోండి
ABN, Publish Date - Nov 30 , 2024 | 03:50 AM
అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటన కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. తప్పుడు కేసు పెట్టి, నన్ను జైలుపాలు చేసినందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి,
తప్పుడు కేసు పెట్టి, జైలుపాలు చేశారు
పోలీసులకు బాధితుడు మనోహర్ నాయుడు ఫిర్యాదు
రాయచోటి /బి.కొత్తకోట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటన కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. తప్పుడు కేసు పెట్టి, నన్ను జైలుపాలు చేసినందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, అప్పటి మదనపల్లె డీఎస్పీ కేశప్ప, మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు తదితరులపై చర్య తీసుకోండి’ అంటూ బాధితుడు ఒకరు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ప్రతిపక్ష నేత హోదాలో 2023, ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా బి.కొత్తకోట మండలం అంగళ్లులో వైసీపీ నాయకులు చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. అయితే అప్పటి పోలీసులు ఈ ఘటనపైన చంద్రబాబుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై ఐదు కేసులు నమోదు చేశారు. సంఘటన జరిగిన రోజు అసలు ఊర్లో లేని వ్యక్తులు పలువురిని ఈ కేసుల్లో ఇరికించారు. సుమారు 250 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీళ్లంతా చేయని తప్పునకు సుమారు 50 రోజుల పాటు జైలులో గడిపారు. బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం బావగారిపల్లెకు చెందిన బి.మనోహర్ నాయుడూ ఆ బాధితుల్లో ఒకరు.
తనను అన్యాయంగా కేసులో ఇరికించి, జైలుపాలు చేసి వేధించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్ సీఐ రాజారెడ్డికి శుక్రవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ‘నా పెద్దకొడుకు బి.హరిక్రిష్ణనాయుడు ఆర్మీలో ఉన్నాడు. మిలిటరీ పరేడ్‌ను చూసేందుకు ఆయన ఆహ్వానం మేరకు భార్యతో కలసి నాసిక్‌కు వెళ్లా. గత ఏడాది ఆగస్టు 3న వెళ్లి 6వ తేదీ రాత్రి తిరిగి స్వగ్రామానికి వచ్చాను. నేను మన రాష్ట్రంలోనే లేని సమయంలో అంగళ్లు సంఘటన జరిగింది. అయితే నేను ఇంటికి వచ్చిన మరుసటి రోజు మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు పిలుస్తున్నారంటూ బి.కొత్తకోట పోలీసులు అప్పటి డీయస్పీ కేశప్ప వద్దకు తీసుకెళ్లారు. ఆయన కులం పేరుతో దుర్భాషలాడారు. క్రైం నంబరు 75/2023లో నన్ను ఇరికించి అటు నుంచి అటే రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌లో 50 రోజులపాటు మదనపల్లె సబ్ జైలులో అనేక చిత్రహింసలకు గురయ్యాను. వైసీపీ నాయకులు తిరుమల అమరనాథ్, లోకనాథరెడ్డి ప్రోద్భలంతో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు కేసులో ఇరికించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మనోహర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, మనోహర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుం టామని బి.కొత్తకోట సీఐ రాజారెడ్డి మీడియాకు తెలిపారు.
Updated Date - Nov 30 , 2024 | 03:50 AM