ఆ 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతివ్వండి
ABN, Publish Date - Jul 21 , 2024 | 04:05 AM
వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఐదు వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
నిర్మాణాలు పూర్తి చేస్తాం.. సిబ్బందిని పెడతాం
ఎన్‌ఎంసీకి లేఖ రాసిన కాలేజీల ప్రిన్సిపాళ్లు
ఎన్‌ఎంసీ సరేనంటే కొత్తగా 500 సీట్లు
గత సర్కారు తప్పిదాలతో నిలిచిన అనుమతి
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఐదు వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పాడేరు, మర్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో సిబ్బంది కొరత, నిర్మాణాలు పూర్తి కాలేదన్న కారణాలతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024-25 ఏడాదికి అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. పైగా ఈ కాలేజీల వల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.600 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఐదు కాలేజీల్లో అడ్మిషన్లకు వెళ్లాలని నిర్ణయించింది. కనీసం కాలేజీకి 100 సీట్లు కేటాయించాలని కోరాల్సిందిగా ప్రభుత్వం సూచించడంతో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామకాలు ఆలస్యం అయ్యాయని, కాలేజీల నిర్మాణాలు పూర్తి కాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. జూలై చివరి నాటికి కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు వైద్య, బోధనా సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని అందులో వెల్లడించారు. 2024-25 ఏడాదికి అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. దీంతో ఎన్‌ఎంసీ అధికారులు మరోసారి ఆన్‌లైన్‌లో తనిఖీలు చేపట్టనున్నారు. ఎన్‌ఎంసీ నుంచి అనుమతి లభిస్తే ఈ ఏడాది మరో 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబుకు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు విద్యా ర్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Updated Date - Jul 21 , 2024 | 06:24 AM