ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mid Pennar 5th South Canal : నీరందక30 ఏళ్లు!

ABN, Publish Date - Jul 18 , 2024 | 11:39 PM

మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ చివరి ఆయకుట్టు భూములకు నీరు అందక ఏకంగా మూడు దశాబ్దాలు అయింది. ఒకప్పుడు పండ్ల తోటలు, పచ్చని పైర్లతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు దీన స్థితిలో ఉంది. వర్షాలు లేక, కాలువ నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు బావులు నిర్వీర్యం కావడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. కొందరు రైతులు పెన్నా నదిలోకి కిలోమీటర్ల పొడవున పైప్‌లైన ఏర్పాటు చేసుకుని.. వర్షాకాలంలో సాగుకు నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...

HLC canal blocked at Ananda Raopet

కాలువ పొడవునా గండ్లు.. ముళ్లపొదలు

భూగర్భజలాలు అడుగంటి.. ఎండిన బోరుబావులు

మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ చివరి ఆయకట్టు బీడు

ఎన్నికల హామీగా మిగిలిపోయిన సాగునీరు

మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ చివరి ఆయకుట్టు భూములకు నీరు అందక ఏకంగా మూడు దశాబ్దాలు అయింది. ఒకప్పుడు పండ్ల తోటలు, పచ్చని పైర్లతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు దీన స్థితిలో ఉంది. వర్షాలు లేక, కాలువ నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు బావులు నిర్వీర్యం కావడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. కొందరు రైతులు పెన్నా నదిలోకి కిలోమీటర్ల పొడవున పైప్‌లైన ఏర్పాటు చేసుకుని.. వర్షాకాలంలో సాగుకు నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - శింగనమల

నిర్వహణ లేకనే...

మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ నిర్వహణను గత ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. దీంతో కాలువ చివరి 15 కిలోమీటర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. కాలువ పొడవునా ముళ్ల పొదలు పెరిగాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు కాలువను బాగు చేసే దిశగా చొరవ చూపలేదు. చివరి ఆయకట్టుకు నీరివ్వాలని శింగనమల మండలంలోని నిదనవాడ, ఆనందరావుపేట నాయనవారిపల్లి, సలకంచెరువు గ్రామాల రైతులు పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించారు. కానీ 30 ఏళ్ల నుంచి ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.


రెండు వేల ఎకరాలు బీడు..

శింగనమల మండలంలోని మిడ్‌పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిధిలోని ఆయకుట్టు భూములకు సాగునీరు ఇవ్వాలి. కానీ మొదటి 10 కి.మీ. పరిధిలో మాత్రమే సాగునీరు ఇస్తున్నారు. కల్లుమడి, గుమ్మేపల్లి, తరిమెల గ్రామాలకు మా త్రమే.. అదీ.. ఆరకొరగా నీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు 15 కిలోమీటర్లుకు మొండిచేయి చూపుతున్నారు. సుమారు రెండు వేల ఎకరాల ఆయకుట్టుకు నీరు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువ దెబ్బతిన్న కారణంగానే తమ వరకూ నీరు రావడం లేదని, తరిమెల వద్ద ఆగిపోతోందని చివరి ఆయకట్టు రైతులు అంటున్నారు.

ఎన్నికల హామీతో సరి..

చివరి ఆయకట్టుకు నీరు ఎన్నికల హామీగానే మిగిలిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు ఇప్పిస్తామని ఎన్నిక సమయంలో అభ్యర్థులు హామీ ఇస్తున్నారని, కానీ గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి ఆయకట్టు వరకు కాలువకు నీరు చేరితో వ్యవసాయ బోరుబావుల్లో నీరు పుష్కలంగా వస్తుందని అంటున్నారు. గడిచిన 30 ఏళ్ల నుంచి నీరు రాకపొవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, బోర్లులో నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పండ్ల తోటలతో కళకళలాడే తమ గ్రామాలు ఇప్పడు కరువు ప్రాంతాలుగా మారాయని వాపోతున్నారు.

పండ్ల తోటలను నరికేశాం..

మాది నాయనవారిపల్లి. 30 ఏళ్ల కిందట మా కాలుకకు నీరు వచ్చేది. మా ఊరి రైతులు అందరూ చీనీ, సపోటా తోటలను సాగుచేసేవాళ్లం. మా ఊరి చీనీ పండ్లకు చైన్నె, ముంబై నాగపూర్‌లో మంచి ధరలు లభించేవి. గత 30 ఏళ్ల నుంచి కాలువకు చుక్కనీరు రాలేదు వర్షాలు కూడా సక్రమంగా రావడంలేదు. వ్యవసాయ బోరు బావులు ఎండిపోతున్నాయి. ఐదొందల అడుగు వరకూ బోరు వేసినా చుక్కనీరు పడటం లేదు. దీంతో పండ్లు తోటలను నరికేశాము. నాకున్న ఐదు ఎకరాలను బీడు పెట్టాను.

- సుబ్బయ్య, రైతు

బోర్లలో నీరే లేదు...

కాలువకు నీరు వచ్చే సమయంలో ప్రతి రైతూ పండ్ల తోటలను సాగు చేసి.. ఆర్థికంగా ఎదిగారు. ఇప్పుడు చాలా సంవత్సరాలుగా నీరు రావడంలేదు. బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. పండ్ల తోటలను కాపాడుకోలేకపోయాము. ఇప్పుడు ఆర్థికంగా బాగున్న రైతులు పెన్నానదిలో బోర్లు వేసి.. అక్కడి నుంచి ఆరేడు కిలోమీటర్లు వరకు పైప్‌లైన వేసుకుని తోటలకు నీరు తెచ్చుకుంటున్నారు. దీనికి లక్షలకు లక్షలు ఖర్చు అవుతోంది. మా లాంటి పేద రైతులు భూములను బీడు పెట్టాము.

- భాస్కర్‌ రెడ్డి, నిదనవాడ

మరమ్మతులు చేపట్టాలి..

తరిమెల నుంచి సలకంచెరువు వరకు కాలువకు ఎక్కడ చూసినా గండ్లు పడ్డాయి. ముళ్ల పొదలతో కాలువ నిండిపోయింది. కాలువ ధ్వంసమైంది. ప్రజా ప్రతినిధులు స్పందించి.. కాలువకు మరమ్మతులు చేయించాలి. చివరి 15 కిలోమీటర్లు బాగుచేశాక నీరు వదలాలి. మా గ్రామాల రైతులకూ నీరు అందేలా చూడాలి. ఆ దిశగా ఎమ్మెల్యే చొరవ చూపాలి.

- పెద్ద నరసింహులు, ఆనందరావుపేట

ఎమ్మెల్యే స్పందించాలి..

శింగనమల మండలంలో మిడ్‌ పెన్నార్‌ 5వ దక్షిణ కాలువ కింద చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే మొదట కాలువకు మరమ్మతులు చేయాలి. దీనికి అవసరమైన నిధులను ఎమ్మెల్యే తీసుకురావాలి. తరిమెల నుంచి సలకంచెరువు వరకు దాదాపు 15 కి.మీ. వరకు కాలువ పూర్తిగా ధ్వంసం అయింది. తరిమెల తరువాత చుక్కనీరు కూడా దిగువకు వెళ్లడం లేదు. చాలా సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధులు చొరవ చూపకపోవడంతో 1500 నుంచి రెండు వేల ఎకరాలకు నీరు అందడం లేదు. బోరు బావుల్లో నీరు ఇంకిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ రైతు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి.

- చిన్నప్ప యాదవ్‌, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 18 , 2024 | 11:39 PM

Advertising
Advertising
<