ACCIDENT : హైవేపై ఘోరం..
ABN, Publish Date - May 19 , 2024 | 12:45 AM
పది రోజుల్లో పెళ్లి. కుటుంబంలో సందడి మొదలైంది. పెళ్లి బట్టలు కొనేందుకు అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాదుకు వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి మరో గంటలో చేరుకోవాల్సి ఉండగా.. ఒక కారు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పెళ్లికొడుకు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ ...
బాచుపల్లి వద్ద అదుపుతప్పిన కారు
గుత్తి/రూరల్, మే 18: పది రోజుల్లో పెళ్లి. కుటుంబంలో సందడి మొదలైంది. పెళ్లి బట్టలు కొనేందుకు అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాదుకు వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. స్వస్థలానికి మరో గంటలో చేరుకోవాల్సి ఉండగా.. ఒక కారు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పెళ్లికొడుకు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పెళ్లికొడుకు షేక్ ఫిరోజ్ బాషా (30), ఆయన తండ్రి అలీసాహెబ్ (56), సోదరుడి పిల్లలు మహమ్మద్ ఆయాన (6), మహమ్మద్ ఆమాన (3), పిన్ని రెహనా బేగం (40), వదిన జహీరా బాను (40) మృతిచెందారు. ఫిరోజ్ పిన్నమ్మ కొడుకు మహమ్మద్ గౌస్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రాణాలు తీసిన నిద్రమత్తు
అనంతపురం నగరంలోని బిందెల కాలనీకి చెందిన షేక్ ఫిరోజ్ బాషా ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి. ఆయనకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి దుస్తులు కొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అందరూ కలిసి రెండు కార్లలో హైదరాబాదుకు వెళ్లారు. రాత్రి వరకూ షాపింగ్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. గుత్తి మండలం బాచుపల్లి వద్దకు రాగానే తెల్లవారుజామున డ్రైవింగ్ చేస్తున్న మహమ్మద్ గౌస్ నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పింది. వేగంగా డివైడరును ఢీకొని, అవతలి వైపు వస్తున్న లారీ కిందకు దూసుకుపోయింది. లారీ మడ్‌గార్డ్ రేకు తగులుకుని ఫిరోజ్ తల మొండెం నుంచి వేరైంది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ ముగ్గురిలో ఒకరు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకరు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. డ్రైవింగ్ చేసిన మహమ్మద్ గౌస్ తీవ్రగాయాలతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పెను విషాదం
అనంతపురం బిందెల కాలనీకి చెందిన అలీసాహెబ్ గుజరీ వ్యాపారి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడికి వివాహం అయ్యింది. అతను రెండేళ్ల క్రితం మృతిచెందాడు. కూతురుకు వివాహం చేశాడు. రెండో కుమారుడు షేక్ ఫిరోజ్ బాషా అనంతపురం నగరంలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం నిశ్చయమైంది. పెళ్లి దుస్తులు కొనుగోలు చేశాక పెళ్లికొడుకు ఫిరోజ్ బాషా, తండ్రి ఆలీసాహెబ్, పిన్నమ్మ రెహనా బేగం, సోదరుడి పిల్లలు మహమ్మద్ ఆయాన, మహమ్మద్ ఆమాన, వదిన జహీరా బాను, పిన్నమ్మ కొడుకు మహమ్మద్ గౌస్ ఒక కారులో ఎక్కారు. కారును మహమ్మద్ గౌస్ నడిపాడు. ఇంకో కారులో బయలుదేరిన ఫిరోజ్ బాషా తల్లి, కూతురు, అల్లుడు, మరో ఇద్దరు గంట ముందుగానే అనంతపురానికి చేరుకున్నారు. పెళ్లి కొడుకు ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద రాగానే పిల్లలు ఏడుస్తుండడంతో కారును పక్కన నిలబెట్టి వారిని నిద్రపుచ్చారు. ఆ తరువాత అనంతపురానికి బయలుదేరారు. బాచుపల్లి సమీపంలో రాగానే గౌస్ నిద్రమత్తులోకి వెళ్లిపోవడంతో ఘోరం జరిగింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్ సీటు పక్కన కుర్చున్న పెళ్లికుమారుడు ఫిరోజ్ బాషా, వెనుక సీట్లో కుర్చున్న అలీసాహెబ్, మహమ్మద్ అయాన, మహమ్మద్ అమాన అక్కడికక్కడే మృతి చెందారు. రెహానా బేగం,
జహీరాబాను, మహమ్మద్ గౌస్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెహనాబేగం మృతిచెందారు. మెరుగైన వైద్యం కోసం జహీరా బాను, మహమ్మద్ గౌస్‌ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జహీరాబాను మృతి చెందారు. మహమ్మద్ గౌస్ చికిత్స పొందుతున్నాడు.
ఇద్దరు మిగిలారు..
ఆలీసాహెబ్ ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇది వరకే మరణించారు. ఈ ప్రమాదంలో అలీసాహెబ్‌తోపాటు మిగిలిన ఒక్క కొడుకు, వితంతువైన పెద్ద కోడలు, ఆమె ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఆలీ సాహెబ్ కుటుంబంలో ఆయన భార్య, కూతురు, అల్లుడు, వారి ఇద్దరు పిల్లలు మిగిలారు. ప్రమాద స్థలాన్ని గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్ పరిశీలించారు. మృతదేహాలను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుప్పకూలిన ముఖద్వారం
ఇద్దరు మధ్యప్రదేశ కూలీల మృతి
కూడేరు, మే 18: మండల పరిధిలోని గొట్కూరు గ్రామ సమీపంలో భవ్యశ్రీ వెంచర్ ముఖద్వారాం స్లాబ్ కూలి శనివారం ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశకు చెందిన పూరనసింగ్ (27), హస (26)గా గుర్తించారు. వెంచర్‌లో మధ్యప్రదేశలోని అనుక్‌పూర్ జిల్లా సుల్కారిక్ గ్రామానికి చెందిన ఐదుగురు, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. ముఖద్వారాం స్లాబ్ వేస్తుండగా ఒక వైపు ఉన్న పిల్లర్లు కూలిపోయాయి. దీంతో పైన ఉన్న మధ్యప్రదేశ కూలీలు పూరనసింగ్, హస కాంక్రీట్‌లో కడ్డీల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందారు. అనుక్‌పూర్ జిల్లా సుల్కారిక్ గ్రామ కూలీ తీహరూ, కొర్రపాడుకు చెందిన ఆంజనేయులు, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని
వెంటనే 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంక్రీట్ మిక్చర్ మధ్య ఇరుక్కుపోయిన కూలీలను బయటకు తీయడానికి యంత్రాలను ఉపయోగించాల్సి వచ్చింది. పిల్లర్లు నాసిరకంగా నిర్మించినందుకే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లర్లకు చిన్న కడ్డీలు వినియోగించారని, దీంతో స్లాబ్ పైభాగం బరువై పిల్లర్లు కూలిపోయాయని అన్నారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 19 , 2024 | 12:45 AM