PINCHAN : పేదింటి పండుగ
ABN, Publish Date - Jul 02 , 2024 | 12:11 AM
జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. పెంచిన పింఛన అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో జయహో చంద్రన్న నినాదం మార్మోగింది. చంద్రబాబు పేదింటి పెద్ద కొడుకయ్యాడంటూ లబ్ధిదారుల నుంచి దీవెనలు వెల్లువెత్తాయి. చేతిలోకి ఒక్కసారిగా పింఛన రూపంలో రూ. ఏడు వేలు రాగానే అవ్వతాతల మోములు మతాబుళ్లా వెలిగిపోయాయి. కొందరు ఆనందంతో డ్యాన్సులు వేశారు. కొన్ని చోట్ల కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ..
ఊరూ, వాడా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
జయహో చంద్రన్న అంటూ కీర్తించిన లబ్ధిదారులు
పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
రూ. ఏడు వేలు చేతికందగానే అవ్వతాతల్లో భావోద్వేగం
అనంతపురం, జూలై1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. పెంచిన పింఛన అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో జయహో చంద్రన్న నినాదం మార్మోగింది. చంద్రబాబు పేదింటి పెద్ద కొడుకయ్యాడంటూ లబ్ధిదారుల నుంచి దీవెనలు వెల్లువెత్తాయి. చేతిలోకి ఒక్కసారిగా పింఛన రూపంలో రూ. ఏడు వేలు రాగానే అవ్వతాతల మోములు మతాబుళ్లా వెలిగిపోయాయి. కొందరు ఆనందంతో డ్యాన్సులు వేశారు. కొన్ని చోట్ల కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వాడవాడలా చంద్రబాబు, పవనకల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. జిల్లాలో మొత్తం 2,87,032 మంది వివిధ కేటగిరీల
పింఛనదారులకు రూ.195.70 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా... సాయంత్రం 5 గంటల సమయానికి 2,51,827 మంది లబ్ధిదారులకు రూ.171.69 కోట్లు పంపిణీ చేశారు. అంటే 87.73 శాతం మందికి పింఛన పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడంతో... కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉదయం ఆరు గంటలకే ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
- రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ, కౌకుంట్లలో అవ్వతాతలకు పింఛన సొమ్మును పంపిణీ చేశారు. అవ్వతాతలతో ముచ్చటించారు.
- రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి, రాప్తాడు, కనగానపల్లి మండలం మామిళ్లపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలంలోని వెంకటాపురంలో లబ్ధిదారులకు పింఛన సొమ్మును పంపిణీ చేశారు. వారితో కలిసి కేక్ కట్ చేశారు. ఆత్మకూరులో చంద్రబాబు, పవనకళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
- అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ టీడీపీ జిల్లా అద్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌తో కలిసి అనంతపురం నగరంలోని పాతూరు, గుల్జార్‌పేట, సాయినగర్, రహమతనగర్, మున్నానగర్, సున్నపుగేరి, నాయక్‌నగర్, ఆజాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన పంపిణీ చేశారు. కేక్‌లు కట్ చేసి లబ్ధిదారులతో సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబు, పవనకళ్యాణ్ చిత్రపటాలకు లబ్ధిదారులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
- టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అనంతపురం నగరంలోని రాజీవ్‌కాలనీ, మరాఠీ కాలనీ తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛనసొమ్ము అందజేశారు.
- గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కసాపురంలో, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ గుంతకల్లు పట్టణంలో పింఛనదారులకు పింఛన సొమ్ము అందజేశారు. గుత్తి పట్టణంలోని జంగాలకాలనీలో టీడీజీ జిల్లా అద్యక్షుడు వెంకటశివుడు యాదవ్ లబ్ధిదారులకు పింఛన సొమ్ము పంపిణీ చేశారు.
- కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛనసొమ్ము పంపిణీ చేశారు. చంద్రబాబు పింఛనసొమ్ము పెంచి తమ లాంటి వృద్ధులకు భరోసా కల్పించారని అవ్వతాతలు ఎమ్మెల్యేతో ఆనందంగా పేర్కొన్నారు. కేక్‌లు కట్ చేసి, చంద్రబాబు, పవనకళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
- శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తన స్వగ్రామం సిద్దరాంపురంతో పాటు నార్పలలోని పప్పూరులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, పుట్లూరు మండలంలోని మడుగుపల్లి, యల్లనూరు, శింగనమల, గార్లదిన్నె మండల కేంద్రాల్లో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు.
- రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు భరతతో పాటు స్థానిక నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- తాడిపత్రి నియోజకవర్గంలోనూ స్థానిక నాయకులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పింఛన
అనంతపురం అర్బన: నగరంలోని లక్ష్మీనగర్‌కు చెందిన సాలమ్మకు ఫిట్స్ రావడంతో కోమాలో ఉన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 39వ డివిజన టీడీపీ ఇనచార్జి చేపల హరి, నాయకులు కరీం, బోయ శ్రీనివాసులు సచివాలయ సిబ్బంది శశికళ, గౌతమితో కలిసి ఆస్పత్రికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు రూ.7 వేలు పింఛన అందజేశారు. టీడీపీ నాయకులకు నాయకులకు వారు కృతజ్ఞలు తెలిపారు.
అమరావతి నిర్మాణానికి విరాళం
అనంతపురం రూరల్: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పలువురు పింఛనదారులు విరాళం ఇచ్చారు. అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేటలో 25 మంది ఒక్కొక్కరు రూ.500 చొప్పున పింఛన సొమ్ము నుంచి రూ.12,500 విరాళం ఇచ్చారు. మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌కు అందజేశారు.
పామిడి: పట్టణంలోని వెంగమనాయుడు కాలనీకి చెందిన సూర్యనారాయణ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌కు తన పింఛన సొమ్ము రూ.7 వేలను రాజధాని కోసం విరాళం ఇచ్చారు. ప్రతి పౌరుడూ రాజధాని నిర్మాణంలో భాగస్వామి కావాలని అన్నారు.
పింఛన పంపిణీ 95 శాతం పూర్తి
అనంతపురం క్లాక్‌టవర్, జులై 1: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఒక్కరోజులోనే 95శాతం పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న 2,89,805మంది పింఛన లబ్ధిదారుల్లో 95శాతం మంది తొలి రోజే పింఛన అందుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 11,355 క్లస్టర్లలో 5643మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉదయం 6గంటల నుంచే పింఛన పంపిణీ ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఉద్యోగులు భాగస్వామ్యంతో పింఛనల పంపిణీ విజయవంతంగా ముగించారు. కలెక్టరేట్‌లోని ఎనఐసీలో డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య నేతృత్వంలో మైన్స డీడీ నాగయ్య, డీఎల్‌డీఓ శంకర్‌లతో పాటు ఉద్యోగులు నిత్యం ప్రతి గంటకు వచ్చే పంపిణీ నివేదికలను ప్రభుత్వానికి పంపారు. అనంతపురం వెంకట్రావునగర్‌లో కొద్దిసేపు సాంకేతిక సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో సజావుగా నిర్వహించారు. జిల్లా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కలెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీ విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. 11 కేటగిరీలకు సంబంధించి 2,89,805 మందికి రూ.3వేల నుంచి రూ.4వేలకు, రెండు కేటగిరిరీల్లో 46,742మందికి రూ.3వేల నుంచి రూ.6వేలకు, మరో రెండు కేటగిరీల్లో 2535మందికి రూ.5వేల నుంచి రూ.15వేలకు, ఐదు కేటగిరీల్లో 859మందికి రూ.5వేల నుంచి రూ.10వేలకు పింఛన సొమ్ము పెంచి పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన సొమ్ముతో పాటు సీఎం చంద్రబాబునాయుడు సందేశ లేఖను అందజేశామని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన లబ్ధిదారులకు మంగళవారం పింఛన అందజేస్తామని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 02 , 2024 | 12:11 AM