ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MPEO'S: ఇప్పుడైనా..!

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:37 PM

సొంత జిల్లాకు రావడానికి ఎంపీఈఓలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పాలనలో తమను ఓడీపై చిత్తూరుకు పంపి అన్యాయం చేశారని, మీరే న్యాయం చేయాలని ఇదివరకే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు.

MPEOs giving petition to Minister Achchennaidu

చిత్తూరు జిల్లాలో పని చేస్తున్న 106 మంది

జిల్లాకు రప్పించాలని ప్రజాప్రతినిధులకు వినతి

ఖరీఫ్‌ ఈ-పంట నమోదు తర్వాత పంపుతామన్న ఉన్నతాధికారులు

హామీ అమలు కోసం నిరీక్షిస్తున్న చిరుద్యోగులు

అనంతపురం అర్బన, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సొంత జిల్లాకు రావడానికి ఎంపీఈఓలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పాలనలో తమను ఓడీపై చిత్తూరుకు పంపి అన్యాయం చేశారని, మీరే న్యాయం చేయాలని ఇదివరకే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు. అలాగే వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఢిల్లీరావులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. జిల్లా ప్రతినిధులతో సైతం సంబంధిత మంత్రి, అధికారులకు లేఖలు రాయించారు. గత జూలైలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీఈఓలను జిల్లాకు రప్పించాలని అనంత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సైతం కోరారు. దీంతో వ్యవసాయ కమిషనరేట్‌కు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నుంచి లేఖ పంపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ఈ- పంట నమోదు పూర్తయిన తర్వాత ఓడీలు రద్దు చేసి అనంత జిల్లాకు పంపుతామని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఎంపీఈఓలకు హామీ ఇచ్చారు. ఈ పంట నమోదుతోపాటు ఈకేవైసీ పూర్తయినా ఇప్పటి దాకా ఇచ్చిన హామీ అమలు కాలేదు. దీంతో ఎంపీఈఓలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


అరకొర జీతానికి అంతదూరమా..?

టీడీపీ పాలనలో 2015లో జిల్లా సెలెక్షన కమిటీ ద్వారా ఉమ్మడి అనంత జిల్లాలో 650 మంది ఎంపీఈఓ (మల్టీ పర్సప్‌ ఎక్స్‌టెన్షన ఆఫీసర్‌)లను కాంట్రాక్టు పద్ధతిపై ఎంపిక చేశారు. అప్పట్లో 1000 హెక్టార్లకు ఒక ఎంపీఈఓను నియమించారు. వీరంతా వ్యవసాయ శాఖ తరపున క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో కొత్తగా వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌, పశుసంవర్ధక శాఖ తరపున గ్రామ స్థాయి సిబ్బందిని నియమించింది. ఆర్బీకే సిబ్బంది నియామకాలతో ఎంపీఈఓలకు కష్టకాలం మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 650 మంది ఎంపీఈఓలు పనిచేసేవారు. వీరిలో 175 మంది వీఏఏలు పోస్టులకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో 4వేల ఎకరాల నుంచి 6వేల ఎకరాలకు ఒక ఆర్బీకేను ఏర్పాటు చేశారు. తద్వారా ఎంపీఈఓలకు అన్యాయం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో జరగని విధంగా అనంత జిల్లా ఎంపీఈఓలను చిత్తూరు జిల్లాకు ఓడీపై పంపారు. 2021, 2022 సంవత్సరాల్లో రెండు విడతలుగా 253 మంది ఎంపీఈఓలను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఓడీపై పంపారు. ప్రస్తుతం వీరిలో 106 మంది ఉమ్మడి చిత్తూరులో ఓడీపై పనిచేస్తున్నారు. మిగిలిన వారు అనారోగ్యం, ప్రసూతి సెలవులు, ఆర్థిక, కుటుంబ సమస్యలతో అక్కడ పనిచేయలేక తిరిగి వచ్చారు. వీరిలో 70 శాతం మంది మహిళా సిబ్బంది ఉండటం గమనార్హం. పేద కుటుంబాలకు చెందిన ఆ సిబ్బంది రూ.12వేల జీతం కోసం వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు దూరంగా ఉంటూ పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జనాభా ప్రతిపదికగా ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. 60 ఎకరాల నుంచి 500 ఎకరాల పరిధిలో కూడా ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. దీంతో వాటి సంఖ్య పెరిగింది. అనంత జిల్లాలో ఎక్కువ విస్తీర్ణానికి ఆర్బీకేలు ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ పనిచేస్తున్న ఎంపీఈఓలకు అన్యాయం జరిగింది.


ముమ్మరంగా వినతులు

వైసీపీ హయాంలో ఓడీపై చిత్తూరు జిల్లాకు ఎంపీఈఓలను పంపాలని నిర్ణయించిన నాటి నుంచి ఎంపీఈఓల సంఘం నాయకులు ఓడీ రద్దు చేసి, జిల్లాలోనే కొనసాగించాలని అప్పటి ప్రజాప్రతినిధులను అనేక సార్లు విన్నవించారు. ఉమ్మడి జిల్లాలో 1000 హెక్టార్లకు ఒక ఎంపీఈఓ పోస్టును కేటాయిస్తే సమస్య పరిష్కారమవుతుందని విన్నవిస్తూ వచ్చారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధిత ఎంపీఈఓలు పలు మార్లు కూటమి ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంతో ఇకమీదట ఏమి చేయాలో తోచని అయోమయంలో పడ్డారు.


కుటుంబానికి దూరంగా..

నాది చెన్నేకొత్తపల్లి మండలం. వైసీపీ హయాంలో ఓడీపై చిత్తూరు జిల్లాకు పంపారు. నా భర్త రైతు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయికి ఆరేళ్లు, కుమారుడికి నాలుగేళ్లు. కుటుంబ అవసరాల రీత్యా తక్కువ వేతనమైనా తప్పని పరిస్థితుల్లో ఓడీపై చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నా. పిల్లలను తలచుకుంటే కన్నీళ్లు వస్తాయి. నా భర్తే వారి ఆలనాపాలన చూస్తున్నారు. సెలవు రోజుల్లో ఊరికి వెళ్లి పిల్లలను చూసుకుంటున్నా. నాతోపాటు ఎక్కువ మంది మహిళలే ఓడీపై చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అందరూ నాలాగే ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నాం. - నాగేశ్వరి, వ్యవసాయ శాఖ ఎంపీఈఓ

తక్షణమే ఓడీలు రద్దు చేయాలి

ఈ ఏడాది ఖరీఫ్‌ ఈ పంట నమోదు పూర్తికాగానే ఓడీలు రద్దు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కమిషనర్‌లు హామీ ఇచ్చారు. ఈ పంట నమోదు ఇప్పటికే పూర్తి చేశాం. ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఓడీలు రద్దు చేసి, సొంత జిల్లాకు పంపాలి. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికా రులు మేము వెళ్లిన ప్రతి సారి సానుకూలంగానే స్పందిస్తున్నారు. త్వరలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.

- రెడ్డి ప్రసాద్‌, ఎంపీఈఓల సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు

Updated Date - Oct 21 , 2024 | 11:37 PM