BANDARU SRAVANI : మీ ఆడబిడ్డను.. ఆదరించండి..!
ABN, Publish Date - May 12 , 2024 | 12:37 AM
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అందరి మన్ననలు పొందేలా సేవ చేస్తాను. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తాను..’ అని శింగనమల నియోజకవర్గ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విన్నవించారు. అక్రమంగా సంపాదించుకునేందుకు తాను రాజకీయాలలోకి రాలేదని అన్నారు. తన తాత, దివంగత టీడీపీ నేత బండారు నారాయణస్వామి నియోజకవర్గంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ...
గెలిపిస్తే మీ సేవకురాలినౌతా
టీడీపీ కూటమి శింగనమల అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అందరి మన్ననలు పొందేలా సేవ చేస్తాను. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తాను..’ అని శింగనమల నియోజకవర్గ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ విన్నవించారు. అక్రమంగా సంపాదించుకునేందుకు తాను రాజకీయాలలోకి రాలేదని అన్నారు. తన తాత, దివంగత టీడీపీ నేత బండారు నారాయణస్వామి నియోజకవర్గంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం రాజకీయాలలోకి వచ్చానని
అన్నారు. నియోజకవర్గ ఆడబిడ్డగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, గెలిచాక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తానని అన్నారు. 2019లో తమ పార్టీ అధినేత చంద్రబాబు తనకు టిక్కెట్ ఇచ్చారని, అప్పట్లో ప్రజలు ఓడించినా తాను బాధపడలేదని అన్నారు. తాను ఏమిటో నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఐదేళ్లు ప్రజల కోసం పోరాటం చేశానని అన్నారు. అందుకే తనకు చంద్రబాబు నాయుడు మరో అవకాశం ఇచ్చారని, ప్రజలు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విన్నవించారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఇసుక దొంగ అని, అతనిపై అనేక కేసులున్నాయని అన్నారు. అలాంటి వ్యక్తిని చట్టసభలకు పంపితే నియోజకవర్గాన్ని దోచేస్తారని అన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
ఎన్నికల ప్రచారం ఎలా సాగింది..? ప్రజల స్పందన ఎలా ఉంది..?
శ్రావణి: అశేష జనవాహిని మధ్య ఎన్నికల ప్రచారం సాగింది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి ఆపూర్వ ఆదరణ లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే నాకు మరోమారు అవకాశం ఇచ్చారు. ఏ గ్రామానికి వెళ్లినా తమ ఇంటి అడబిడ్డ వచ్చినట్లుగా ప్రజలు ఆదరించారు. వారి ఆప్యాయత జీవితంలో మరవలేనది. నియోజకవర్గంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు అనేకం నా దృష్టికి వచ్చాయి.
సూపర్ సిక్స్ పథకాల ప్రభావం ఎలా ఉంది?
శ్రావణి: కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి పసలేదని, మరోసారి నకలీ నవరత్నాలు-2 విడుదల చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా రూ.1500 ఆర్థిక సాయం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఇవన్నీ మహిళలను మెప్పిస్తున్నాయి. రూ.4 వేల పింఛన, డీఎస్సీపై తొలి సంతకం తదితరాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయి. వైసీపీతో నష్టపోవడం తప్ప, ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు మేలుకున్నారు.
జనసేన, బీజేపీ, ఎమ్మార్పీఎస్ శ్రేణుల మద్దతు ఎలా ఉంది..?
శ్రావణి: నియోజకవర్గంలో మొదటి నుంచి జనసేన, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాకు అండగా ఉన్నాయి. వారి మద్దతుతో నేను సునాయసంగా గెలుస్తాను. ప్రచారంలో వారు ముందుండి నడిపించారు. విశేష స్పందన వచ్చింది. జనసేన అధ్యక్షుడు పవనకళ్యాణ్, ప్రఽధానమంత్రి నరేంద్రమోదీ క్రేజ్ మాకు కలిసి వస్తాయి. ఎస్సీ నియోజకవర్గం అయిన శింగనమలలో వైసీపీ పాలనలో దళితలకు తీవ్ర అన్యాయం జరిగింది. దళిత సంఘాలు, దళితులు అంతా టీడీపీకి మద్దతు ఇస్తున్నారు.
గెలిపిస్తే శింగనమల ప్రజలకు ఏం చేస్తారు..?
శ్రావణి: నన్ను గెలిపిస్తే రాజకీయ నేతలా కాకుండా సేవకురాలిగా పనిచేస్తాను. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాను. శింగనమల చెరువు లోకలైజేషనకు నకిలీ జీవో ఇచ్చారు. నేను అసలైన జీవో తెప్పిస్తాను. చట్ట సభలో తీర్మానం చేయించి, బిల్లు పాస్ చేయిస్తాను. ఉద్యాన రైతులకు రాయితీలు, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయిస్తాను. అంబేడ్కర్ భవనం నిర్మిస్తాం. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తాం. శింగనమలలో వంద పడకల అస్పుత్రి ఏర్పాటు చేయిస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను. నిత్యం అందుబాటులో ఉంటాను.
పోలింగ్ రోజున దౌర్జన్యాలు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఎలా ఎదుర్కొంటారు..?
శ్రావణి: ఓటమి భయంతో వైసీపీ ఇప్పటికే ఓటర్లను ప్రలోభ పెడుతోంది. లొంగని చోట బెదిరిస్తున్నారు. టీడీపీ కూటమి తరఫున ఏజెంట్లు కూర్చోకుండా చేయాలని వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బందిలో కొందరు అధికార పార్టీ వైపు పనిచేస్తున్నారు. అయినా కూటమి నాయకులు, కార్యర్తలు ధైర్యంగా పోరాటాం చేస్తున్నారు. మా గెలుపును ఎవరూ ఆపలేరు.
ప్రచారంలో వడదెబ్బకు గురయ్యారు. ఇప్పుడు ఎలా ఉన్నారు..?
శ్రావణి: మండుటెండును లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. అందుకే వడదెబ్బ తగిలింది. మూడు రోజులపాటు ఇబ్బంది పడ్డా. అయినా నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అండగా ఉండి ప్రచారం కొనసాగించారు. నన్ను తమ కుటుంబ సభ్యురాలిగా భావించి అండగా నిలిచారు. నా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. వారి కష్టం మరవలేనిది.
- బుక్కరాయసముద్రం
అనంతపురం వార్తల కోసం...
Updated Date - May 12 , 2024 | 12:46 AM