encroachment: దేవుడు అడగలేడని..!
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:40 AM
దేవుడు వచ్చి అడుగుతాడా అని అనుకున్నాడో ఏమో ఓ వైసీపీ నాయకుడు ఆలయ భూమిని కాజేయడానికి పూనుకున్నాడు. కౌలు చెల్లించకుండా ఏళ్లుగా మాన్యం భూమిని సాగు చేసుకుంటున్నాడు. అరటి వంటి పంట సాగు చేసుకుంటూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఈక్రమంలోనే భూమిని శాశ్వతంగా సొంతం చేసుకోవాలనే కుటిల యత్నాలకు తెరతీశాడు.
మాన్యం కాజేసేందుకు వైసీపీ నాయకుడి యత్నం
కౌలు చెల్లించకుండా ఏళ్ల తరబడి సాగు
కుంటుపడుతున్న ఆలయ అభివృద్ధి
చందాలతోనే ఆలయ పునర్నిర్మాణం
పట్టించుకోని దేవదాయ అధికారులు
పుట్లూరు, అక్టోబరు 1: దేవుడు వచ్చి అడుగుతాడా అని అనుకున్నాడో ఏమో ఓ వైసీపీ నాయకుడు ఆలయ భూమిని కాజేయడానికి పూనుకున్నాడు. కౌలు చెల్లించకుండా ఏళ్లుగా మాన్యం భూమిని సాగు చేసుకుంటున్నాడు. అరటి వంటి పంట సాగు చేసుకుంటూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఈక్రమంలోనే భూమిని శాశ్వతంగా సొంతం చేసుకోవాలనే కుటిల యత్నాలకు తెరతీశాడు. పుట్లూరు మండలంలోని ఏ. కొండాపురం గ్రామంలో ఆత్మరామస్వామి ఆలయానికి అరకటి వేముల రెవెన్యూలో సర్వే నెంబర్ 94ఏలో 2.8 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 15 ఏళ్ల కిందట ఓ వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ఏడాదికి రూ.50 వేలు చెల్లించాల్సి ఉండగా రూ.20 వేలు మాత్రమే చెల్లించాడు. అప్పటి నుంచి ఇంతవరకు ఆలయానికి పైసా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.
కౌలుకు తీసుకున్న భూమిలో అరటి, చామంతి, లిల్లీపూల పంటల సాగు చేసుకుంటూ ఏడాదికి సుమారు రూ.10లక్షల పైగానే ఆదాయం పొందుతున్నాడు. అయినా కౌలు మాత్రం చెల్లించడం లేదు. ఈ భూమి విషయంగా చర్చించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఎకరా రూ.50 లక్షల పైమాటే
ఎ.కొండాపురం గ్రామంలో జాతీయ రహదారి వెళుతుండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రూ.10లక్షలు విలువజేసే భూములు ప్రస్తుతం రూ.50లక్షల నుంచి రూ.60లక్షల ధర పలుకుతున్నాయి. ఆలయ భూమి జాతీయ రహదారికి 100మీటర్ల దూరంలో తాడిపత్రి- తిమ్మంపల్లి రోడ్డు పక్కన ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఈ భూమిపై కన్నేశారు. గ్రామంలో కౌలుకు ఇచ్చినా ఎకరానికి రూ.లక్ష మేర ఇస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సాగులో ఉన్న కౌలు దారు కౌలు చెల్లించక ఏళ్లు గడుస్తున్నా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపానపోలేదు.
కాజేసే కుట్ర
గత వైసీపీ ప్రభుత్వంలో ఆత్మారామస్వామి భూమిని కాజేసేందుకు ఆ పార్టీ నాయకుడు, ప్రస్తుత సాగుదారు కుట్ర చేసినట్లు సమాచారం. ఆనలైనలో చూపని సర్వే నెంబరును తన పేరిట ఎక్కించుకోవాలని అప్పట్లో రెవెన్యూ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ విషయం గ్రామస్థులకు తెలిసి అప్పటి తహసీల్దార్‌కు చెప్పడంతో ఆనలైన విషయం విరమించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ భూమిలో బోరువేసి పంట సాగుచేస్తున్నాడు. దీనిపై దేవదాయశాఖ ఈఓ శోభారాణిని వివరణ కోరగా తమ దృష్టికి రాలేదు. కౌలు డబ్బులు చెల్లించకుండా సాగు చేస్తుంటే విచారించి చర్యలు తీసుకుంటాం.
కరువైన ధూప దీపనైవేద్యాలు
రూ. కోట్ల విలువైన భూమి ఉన్నా ఆత్మారామస్వామి ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. ఆ భూమి కౌలుకు తీసుకున్న వ్యక్తి సక్రమంగా డబ్బు చెల్లించకపోవడం తో అభివృద్ధి కుంటుపడింది. దీంతో గ్రామస్థులే సుమారు రూ.ఐదు లక్షలు చందాలు వేసుకుని ఆలయ పునర్నిర్మాణం చేశారు. ప్రతి ఏటా శ్రీరామనవమిని సైతం గ్రామస్థుల చందాలతోనే నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా మరోసారి ఆలయ భూమి కౌలు వేలం వేయాలన్న ఆలోచన కూడా దేవదాయశాఖ అధికారులకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Updated Date - Oct 02 , 2024 | 12:40 AM