ప్రభుత్వ మద్యం..వైసీపీ పరం..!
ABN, Publish Date - May 04 , 2024 | 11:04 PM
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుగానే ప్రలోభాలకు తెరతీస్తున్నారు. మద్యాన్ని కీలక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎరగా వేసి, కీలక వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుంటున్నట్లు సమాచారం.
ధర్మవరం: సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నాయకులు ముందుగానే ప్రలోభాలకు తెరతీస్తున్నారు. మద్యాన్ని కీలక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఎరగా వేసి, కీలక వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకుంటున్నట్లు సమాచారం. రహస్య ప్రాంతాల్లో మద్యం డంప్ చేసినట్లు సమాచారం. ఎన్నడూలేని విధంగా అధికార పార్టీ మాఫియా నియోజకవర్గ కేంద్రాల్లో రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీనేతలు కొంతమంది నేరుగా ప్రధాన గోడౌన్లు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి మద్యం కేసులను రహస్యంగా ఇప్పటికే తరలించి, డంప్ చేసినట్లు ఆ పార్టీకి చెందిన నాయకులే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రాల వారీగా మద్యం, డబ్బు ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులకు అందజేసినట్లు తెలుస్తోంది. వారు మండల కేంద్రాల్లోని ఆ పార్టీ బూత ఏజెంట్లకు డబ్బు, మూడు మద్యం కేసులు అందించినట్లు సమాచారం. మరికొంతమంది నాయకులు నాటుసారా కాచే వారితో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొంతమంది సిబ్బంది.. అధికార పార్టీ నాయకుల నుంచి ముందస్తుగా డబ్బు తీసుకుని స్కానింగ్ చేసి, వారికి రాత్రికి రాత్రే రహస్యంగా మద్యం కేసులను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మద్యం ప్రియులు మందు కోసం వెళితే ఆనలైన పనిచేయట్లేదనీ, స్కానింగ్ కాలేదని సాకులు చెబుతున్నారని, ప్రశిస్తే వారికి మద్యం స్టాకు అయిపోయిందని చెబుతున్న మద్యం బాబులు వాపోతున్నారు. గట్టిగా నిలదీస్తే తాము అధికార పార్టీ కార్యకర్తలమనీ, తమనే ఎదిరిస్తావా అంటూ ఎదురు దాడికి దిగుతున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచాల్సి ఉంది. మద్యం స్టాకు అయిపోయిందనీ, తాము ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటామని చెబుతూ.. రహస్యంగా మద్యాన్ని బెల్టు షాపులకు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా పబ్లిక్‌గానే సాగుతున్నా.. ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవట్లేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. దీంతో మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Updated Date - May 04 , 2024 | 11:04 PM