Welfare Hostels : ఎన్నాళ్లయినా ఇంతేనా?
ABN, Publish Date - Jul 14 , 2024 | 12:14 AM
సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వాటి పరిస్థితి మెరుగుపడటం లేదు. నియోజకవర్గంలో ఏ వసతి గృహానికి వెళ్లి చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు చెప్పుకునే సమస్యలు కొన్ని అయితే.. చెప్పుకోని సమస్యలు మరెన్నో ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక హాస్టల్ విద్యార్థులు నానా అగచాట్లు పడ్డారు. ఈ ఏడాది ...
సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల తిష్ట
అగచాట్లు పడుతున్న విద్యార్థులు
కలగానే ట్రైబల్ వెల్ఫేర్
రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం
సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వాటి పరిస్థితి మెరుగుపడటం లేదు. నియోజకవర్గంలో ఏ వసతి గృహానికి వెళ్లి చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు చెప్పుకునే సమస్యలు కొన్ని అయితే.. చెప్పుకోని సమస్యలు మరెన్నో ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక హాస్టల్ విద్యార్థులు నానా అగచాట్లు పడ్డారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభం అయి దాదాపు నెల రోజులు గడుస్తున్నా వసతి గృహ విద్యార్థులకు ఇంకా కొత్త దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు రాలేదు. దీంతో ఇంటి వద్ద నుంచే విద్యార్థులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- బుక్కరాయసముద్రం
అన్నీ బయటే..
మరుగుదొడ్లు, స్నానాల గదులు లేకపోవడంతో విద్యార్థులు అన్నింటికీ ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఉదారణకు బీకేఎస్ ఎస్సీ బాలుర వసతి గృహంలో 200 మందికి పైగా ఉన్నారు. 15 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు శిథిలావస్థకు చేరు కున్నాయి. సరిపడే బాతరూమ్‌లు, మరుగుదొడ్లు లేకపోవడంతో స్నానాలు , కాలకృత్యాలు అన్ని ఆరుబయట తీర్చుకోవాల్సిందే. రాత్రి సమయాల్లో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. పురుగు, పుట్ర బారిన పడితే ఎవరిది బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలో గదుల సంఖ్య తక్కువగా ఉంది. ఒక గదిలోనే 25 నుంచి 30 మంది వరకు ఉండాల్సిన పరిస్థితి. ఈ ఒక్క హాస్టలే కాదు నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ బాలుర, బాలిక వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడంతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు.
అందని మెస్, కాస్మెటిక్ చార్జీలు
సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీల బకాయిలు పేరుకు పోయాయి. గడిచిన 10 నెలలుగా నిధులు విడుదల కావడం లేదు. వసతి గృహాల నిర్వహణకు సంబంధించి నిధులను గత ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి నెలా బయటి నుంచి అప్పు తెచ్చి విద్యార్థులకు మోను అందించాలంటే తలకు మించిన భారం అవుతోందని వార్డెన్లు వాపోతున్నారు. నూతన ప్రభుత్వమైనా బిల్లులు విడుదల చేస్తే విద్యార్థులకు సక్రమంగా మోను అమలు చేస్తామని వారు పేర్కొంటున్నారు.
నిర్మాణం ఎప్పుడో..!
నూతన భవన నిర్మాణం కోసం బుక్కరాయసముద్రంలోని ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఎదురు చూస్తోంది. గతంలో ఎస్సీ సంక్షేమ వసతి గృహం ఉన్న భవనాన్నే రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చారు. అప్పట్లో 120 మంది విద్యార్థులకు సరిపడేలా భవనం ఉండేది. అయితే ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 320 మంది విద్యార్థులు ఉండాలి. కానీ తక్కువ గదుల ఉండటంతో 200 మందికే సీట్లు కేటాయిస్తున్నారు. ఈ రెండు వందల మంది విద్యార్థులకు 8 గదుల మాత్రమే ఉన్నాయి. పైన విద్యార్థుల ఉండటానికి, నిద్రపోవటానికి చాలా ఇరుకైన గదులు 8 ఉన్నాయి. ప్రతి గదిలో 25 నుంచి 30 మంది వరుకు ఉండాల్సిన పరిస్థితి . నాడు -నేడు కింద పాఠశాలపైన ఈ 8 వసతి గృహాలు నిర్మించారు. భవ నంపైన స్లాబ్ వేయకుండా రేకుల షెడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో విద్యార్థులు వేడి, ఉక్కుపోతతో అల్లాడి పోతున్నారు. నూతన భవనం కోసం బుక్కరాయసముద్రంలో సర్వేనెంబరు396 సర్వే నెంబరులో 5 ఎకరాల స్థలంను 2018లో కేటాయించారు. అయితే ఇందుకు సంబంధిం చి నిధులు లేక పోవడంతో ట్రైబల్ గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది.
ప్రతిపాదనలు పంపాం
పస్తుతం ఈ రెసిడెన్సియల్ పాఠశాల చిన్నది కావడంతో విద్యార్థులకు సరిపోవడం లేదు. నూతన భవనం కోసం బీకేఎ్‌సలో 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందు కోసం నిధులు కేటాయించలేదు. నూతన భవనం కోసం జిల్లా అధికారులకు నివేదిక పంపాం. నిధులు మంజూరు అయ్యి , నూతన భవనం నిర్మిస్తే 3 వతరగతి నుంచి 10 వరకు గిరిజన విద్యార్థులు 350 మంది ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.
-హరినాయక్, ప్రిన్సిపాల్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 14 , 2024 | 12:14 AM