VOTERS: భవితను తేల్చేది యువతేనా..?
ABN, Publish Date - May 15 , 2024 | 11:33 PM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి అధికార వైసీపీ అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పోలింగ్‌కు ముందురోజు వరకూ మళ్లీ మేమే అధికారంలోకి వస్తామనే ఆశల పల్లకిలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత గెలుపోటములపై ఆ పార్టీ అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
వైసీపీ అభ్యర్థుల అంతర్మథనం
కూటమి పథకాలపై ఆందోళన
జగన నియంతృత్వ పాలనపైనా విసుర్లు
అధికార పార్టీలో నైరాశ్యం
అనంతపురం, మే 15(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి అధికార వైసీపీ అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పోలింగ్‌కు ముందురోజు వరకూ మళ్లీ మేమే అధికారంలోకి వస్తామనే ఆశల పల్లకిలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత గెలుపోటములపై ఆ పార్టీ అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఐదేళ్ల పాలనలో బటన నొక్కుడుతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చామని గొప్పలుపోయిన ఆ పార్టీ అభ్యర్థులు... అభివృద్ధిని మరిచాం కదా అని ఇప్పుడు గుర్తిస్తున్నారు. పింఛనదారులు, మహిళలు తమకే ఓటు వేసుంటారనే నమ్మకంతో ఉన్న వైసీపీ అభ్యర్థులకు యువ ఓటర్ల నిర్ణయంపై గుబులు రేపుతోంది. యువత ఎటువైపు ఉన్నారనే అంతర్మథనంలో వైసీపీ అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా ని యోజకవర్గాల్లో పోలైన ఓట్లల్లో యువత ఓట్ల శాతం ఎంత ఉంటుందనే లెక్క లు వేసుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో యువతకు ప్రత్యేకంగా ప్రయోజనా లు చేకూర్చింది లేదు కదా అనే భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యువత ఓటు ఎటువైపు అనే సందిగ్ధం వారిని వెంటాడుతోం ది. చివరికి గెలుపోటములపై.. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందనే నైరాశ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
కూటమి యువత పథకాలపై ఆందోళన
సూపర్‌సిక్స్ పథకాల్లో భాగంగా... యువతకు ఏడాదికి 4 లక్షలు చొప్పున ఐదేళ్లకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూటమి మేనిఫెస్టోలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు... యువతకు ఉద్యోగం వచ్చేంత వరకూ నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి అందజేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విభజిత రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత కరువు జిల్లాలో కియా పరిశ్రమ తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కూటమి అధికారంలోకి రాగానే... మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో యువతలో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే... బెంగళూరు, హైదరాబాదు, చెన్నై నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న యువత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ గెలుపోటములపై యువత ప్రభావం తప్పనిసరిగా పడుతుందన్న అభద్రతాభావం వైసీపీ అభ్యర్థులను వెంటాడుతోంది.
అధినేత నియంతృత్వ పాలనపైనా విసుర్లు
రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా... ఆయనకంటే మెరుగైన పాలన అందిస్తానని ఒక్క చాన్స ఇవ్వాలని వైఎస్ జగన పాదయాత్రలోనూ, గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ ప్రజలను అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజలు జగన మాటలు నమ్మి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళ్లల్లో చూడాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగనరెడ్డి నియంతృత్వ పాలన సాగించాడని పోలింగ్ తరువాత ఆ పార్టీ అభ్యర్థుల్లో విసుర్లు మొదలయ్యాయి. ఎన్టీ రామారావు కాలం నుంచే పింఛన్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనుకుంటే పొరబడినట్లేనన్న భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మేనిఫెస్టో రూపకల్పనలోనూ కూటమి మేనిఫెస్టోతో పోలిస్తే... వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లో భరోసా నింపలేదన్న వాదన ఆ పార్టీలో లేకపోలేదు. సంక్షేమ పథకాల ద్వారా ఫలానా ఇంటికి ఇంతమొత్తంలో లబ్ధి చేకూర్చామని ఇంటింటికి వెళ్లి చెబుతున్నామేగానీ... యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొచ్చారా..? ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా..? ప్రాజెక్టులు పూర్తీచేసి ఒక ఎకరాకైనా సాగునీరిచ్చారా..? అనే ప్రశ్నలకు ఆ పార్టీ అభ్యర్థులు సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నామన్న ఆవేదన వారిలో ఉంది. ఈ పరిణామాలే తమను దెబ్బ తీస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
యువత ఓటు శాతంపై గుబులు
యువత ఓటు శాతం పెరగడంపై అధికార వైసీపీ అభ్యర్థుల్లో అలజడి రేపుతోంది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా... ఉదయం 7 గంటలకు ముందే యువత ఓటు వేసేందుకు బారులు తీరిన విషయం తెలిసిందే. ఇదే అధికార వైసీపీ అభ్యర్థుల్లో గుబులు రాజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 20.18 లక్షల మంది ఓటర్లుండగా... అందులో 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సు యువ ఓటర్లు 49,234 మంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్లలోపు యువకులు 3,72,769 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్లలోపు యువకులు 5,84,111 మంది ఉన్నారు. అంటే మొత్తంగా యువ ఓటర్లు 10,06,114 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే జిల్లా ఓటర్లల్లో 50 శాతం మంది యువ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కావడంతో... యువ ఓటర్లు దాదాపు 37 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పోలింగ్ విధులకు హాజరైన ఉద్యోగ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ యువ ఓటింగ్ శాతమే వైసీపీ అభ్యర్థుల్లో గుబులు రాజేస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ 25 వేల నుంచి 35 వేల మందికిపైగానే యువ ఓటర్లు ఉండటం వైసీపీ అభ్యర్థులకు కంటకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Updated Date - May 15 , 2024 | 11:33 PM