puttaparthi ఆశలపై నీళ్లు..!
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:16 PM
కొత్త జిల్లా కేంద్రం పుట్టపర్తి వాసుల ఆశలపై రైల్వే శాఖ నీళ్లు చల్లింది. చిక్కబళ్ళాపుర-పుట్టపర్తి రైల్వే లైన నిర్మాణానికి మొండిచేయి చూపింది. రైల్వేలైన నిర్మాణ ప్రతిపాదనలే తమ వద్ద లేవని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా లోక్‌సభలో ప్రకటించారు.
చిక్కబళ్ళాపుర-పుట్టపర్తి రైలు మార్గానికి మొండిచేయి
ప్రతిపాదనలే లేవని లోక్‌సభలో స్పష్టంచేసిన మంత్రి
బెంగళూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లా కేంద్రం పుట్టపర్తి వాసుల ఆశలపై రైల్వే శాఖ నీళ్లు చల్లింది. చిక్కబళ్ళాపుర-పుట్టపర్తి రైల్వే లైన నిర్మాణానికి మొండిచేయి చూపింది. రైల్వేలైన నిర్మాణ ప్రతిపాదనలే తమ వద్ద లేవని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా లోక్‌సభలో ప్రకటించారు. చిక్కబళ్ళాపుర నుంచి బాగేపల్లి, గోరంట్ల మీదుగా పుట్టపర్తిదాకా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. 15ఏళ్ల క్రితమే సర్వే కూడా పూర్తి చేశారు. పలు కారణాలతో నిర్మాణం పట్టాలెక్కలేదు. తాజాగా లోక్‌సభలో రైల్వేలైన ఏర్పాటుపై కేంద్ర మంత్రి స్పందించారు. రైల్వేలైన నిర్మాణానికి సంబంధించ తమ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు. చిక్కబళ్ళాపుర-పుట్టపర్తి మధ్య 103 కిలోమీటర్ల దూరం ఉందని ఆయన తెలిపారు. రైల్వేట్రాక్ ఏర్పాటుకు సర్వే చేశారన్నారు. జనసంచారం లేనందునే ప్రస్తుతానికి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టట్లేదన్నారు. చిక్కబళ్ళాపుర-గౌరీబిదనూరు మధ్య 44 కిలోమీటర్ల దూరం రైల్వేట్రాక్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ తయారీకి అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
పుట్టపర్తి-చిక్కబళ్ళాపుర మీదుగా బెంగళూరుకు రైల్వేలైన ఏర్పాటు చేయాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. సత్యసాయి బాబా ఉన్నపుడే ఈ ప్రతిపాదనలపై ప్రచారం సాగింది. గతంలో పెనుకొండ నుంచి నేరుగా ధర్మవరం వెళ్లే ట్రాక్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత పెనుకొండ నుంచి పుట్టపర్తి, ధర్మవరం మరోమార్గం ఏర్పాటైంది. ఈమార్గంలో కొన్ని రైళ్లు మాత్రమే సంచరిస్తున్నాయి. వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు రైల్వేలైన్ల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పుట్టపర్తి-చిక్కబళ్ళాపుర మధ్య రైల్వేమార్గం ఏర్పాటైతే ఏడో నంబరు జాతీయ రహదారికి అనుబంధంగా ట్రాక్ రానుంది. చిక్కబళ్ళాపుర సమీపంలోనే దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం వల్ల భవిష్యత్తులో విమాన సర్వీసులు వినియోగించుకునేవారికి అనుకూలం కానుందని భావించారు. కేంద్ర రైల్వేశాఖ అటువంటి ప్రతిపాదనలు లేవని తేల్చడంతో ఇటు చిక్కబళ్ళాపుర.. అటు శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు నిరాశ మిగిలింది.
Updated Date - Dec 02 , 2024 | 11:16 PM