నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు
ABN, Publish Date - May 31 , 2024 | 11:51 PM
ప్రజల అవసరాలకు నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి ఆలనా పాలన కరువవడంతో పక్కా భవనాలు దెబ్బతింటున్నాయి. మండలంలో ఇలాంటి భవనాలు పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి.
ఆలనాపాలన లేక శిథిలావస్థలోకి..
రూ.లక్షల ప్రజాధనం వృథా
చిలమత్తూరు, మే 31: ప్రజల అవసరాలకు నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటి ఆలనా పాలన కరువవడంతో పక్కా భవనాలు దెబ్బతింటున్నాయి. మండలంలో ఇలాంటి భవనాలు పదుల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడటంతో ఆ భవనాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొడికొండ చెక్‌పోస్టులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బలిజపల్లి, నంజిరెడ్డిపల్లి, సుబ్బరావుపేట, ముద్దప్పలి, వై.గొళ్లపల్లి, దాదిరెడ్డిపల్లి తండా, మాదిరెడ్డిపల్లి గ్రామాల పాఠశాలలు మూతపడటంతో ఆ భవనాలు నిరుపయోగంగా మారాయి. కోడూరులో పాత పంచాయతీ కార్యాలయం వద్ద నిర్మించిన పెద్ద భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కొడికొండ చెక్‌పోస్టు వద్ద గతంలో కమర్షియల్ సేల్‌ట్యాక్స్ కార్యాలయంగా ఏర్పాటు చేసిన కొత్త భవనం ఇప్పుడు పర్యవేక్షణ కరువైంది. దాంతో ఇప్పటికే భవనానికి ఉన్న కిటికీలు, వాకిళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆ పక్కనే ఉన్న రూ.కోట్లు విలువ చేసే ఏపీ టూరిజం శాఖకు చెందిన రెస్టారెంట్ భవనం శిథిలావస్థకు చేరింది. నాలుగేళ్లుగా ప్రభుత్వం టెండర్లకు అవకాశం ఇవ్వకపోవడంతో దానిని పట్టించుకునేవారే కరువయ్యారు. దాంతో ఇప్పుడు ఆ భవనం దెయ్యాల భవనంగా మారింది.
మండల కేంద్రంలోని విద్యుత శాఖకు సంబంధించిన క్వార్టర్స్ ఒకప్పుడు ఎంతో ఆందంగా, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండే భవనాలు ప్రస్తుతం కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఉద్యోగులు నివాసం లేకపోవడంతో రూ.లక్షలు మట్టిపాలవుతున్నాయి. అదేదారిలో పోలీస్ క్వార్టర్స్, సిబ్బంది స్థానికంగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక క్వార్టర్స్ నిర్మించారు. ఆ భవనాలకు సరైన సమయంలో మరమతులు చేయకపోవడంతో శిథిలమయ్యాయి. దీంతో క్వార్టర్స్‌లో నివాసం ఉండటానికి ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదు. దాంతో ఆ భవనాలు కూడా పాడైపోతున్నాయి. ఇలా ప్రభుత్వ భవనాలకు ఆలనా పాలన కరువవడంతో శిథిలావస్థకు చేరాయి.
ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించాలి
ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలు కొన్ని కారణాలతో మూతపడ్డాయి. ఆ భవనాలను అలాగే వదిలేయకుండా ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు. ఉన్న భవనాలను అలాగే వదిలేస్తే శిథిలమడం తప్పా ఏ మాత్రం ఉపయోగపడవని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏ శాఖకు అవసరమైన వాటిని ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Updated Date - May 31 , 2024 | 11:51 PM