OFFICER SCAM : ఇవీ మడత పెట్టేస్తాడా..?
ABN, Publish Date - May 30 , 2024 | 12:03 AM
ఎన్నికల నిధులను ఏమాత్రం సంకోచం లేకుండా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓ అధికారి. వచ్చిన నిధులలో సగానికి పైగా మడతపెట్టేందుకు సిద్ధమయ్యాడు. పోలింగ్ సమయంలో చెలరేగిన అల్లర్లు ఆ అధికారికి వరంగా మారాయి. సందట్లో సడేమియా అన్నట్లు నిధులను మింగేయాలని చూస్తున్నాడు. గత ఎన్నికల నిర్వహణకు మంజూరైన రూ.12 లక్షల నిధులను కాజేసిన తరహాలోనే ఇప్పుడూ కాజేయాలని చూస్తున్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి పెండింగ్ బిల్లులు రూ.12లక్షలు రెండు నెలల క్రితం విడుదలయ్యాయి. ఇవి పక్కదారి పట్టిన ...
ఎన్నికల నిధుల స్వాహాకు ఎత్తుగడ
గత ఎన్నికల సొమ్మూ ఆయన వద్దే..
సీఎంఓను ఆశ్రయించిన బీఎల్వోలు
అయినా స్పందించని ఓ అధికారి
గట్టిగా అడిగినవారికి అరకొరగా చెల్లింపులు
రూ.1.50 కోట్లలో సగం తినేసేందుకు సిద్ధం
తాడిపత్రి టౌన, మే 29: ఎన్నికల నిధులను ఏమాత్రం సంకోచం లేకుండా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓ అధికారి. వచ్చిన నిధులలో సగానికి పైగా మడతపెట్టేందుకు సిద్ధమయ్యాడు. పోలింగ్ సమయంలో చెలరేగిన అల్లర్లు ఆ అధికారికి వరంగా మారాయి. సందట్లో సడేమియా అన్నట్లు నిధులను మింగేయాలని చూస్తున్నాడు. గత ఎన్నికల నిర్వహణకు మంజూరైన రూ.12 లక్షల నిధులను కాజేసిన తరహాలోనే ఇప్పుడూ కాజేయాలని చూస్తున్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి పెండింగ్ బిల్లులు రూ.12లక్షలు రెండు నెలల క్రితం విడుదలయ్యాయి. ఇవి పక్కదారి పట్టిన విషయంపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో ఆ మొత్తం చెల్లించకుండా ఇప్పటికీ ఆ అధికారి తన వద్దే
ఉంచుకున్నారు. ఆ నిధులు ఉండగానే ఈ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు తాడిపత్రి నియోజకవర్గానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. వీటిపై తహసీల్దారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కన్నుపడింది. మొత్తం స్వాహా చేస్తే అసలుకే ఎసరు వస్తుందని భావించి.. కొంత మేరకు బిల్లులు చేయాలని.. మిగిలిన మొత్తాన్ని స్వాహా చేద్దామని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికోసం ఆ అధికారి మరో ముగ్గురిని భాగస్వాములను చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందికి అంతో ఇంతో ఇచ్చి మేనేజ్ చేయాలని వారు చూస్తున్నట్లు సమాచారం. నిధుల గురించి ఆ ముగ్గురు అధికారులు ఏం చెబితే ఆ అధికారి అది చేస్తున్నారని సమాచారం.
రోజులు గడుస్తున్నా..
ఎన్నికల నిర్వహణ బిల్లులు ఇవ్వాలని పలువురు బీఎల్వోలు ఆ అధికారిని కలిసినా స్పందించలేదని సమాచారం. దీంతో బిల్లుల కోసం బీఎల్వోలు విజయవాడలోని సీఎంఓను ఆశ్రయించినట్లు తెలిసింది. నేరుగా సీఎంఓ నుంచి ఫోన రావడంతో ఆ అధికారి బీఎల్వోలపై కన్నెర్ర చేశారని సమాచారం. ‘నాపైనే ఫిర్యాదు చేస్తారా?’ అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బిల్లుల విషయం అడిగితే ఈ రోజు.. రేపు.. అని కాలయాపన చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించిన బీఎల్వోలు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, పోస్టల్ బ్యాలెట్ సర్టిఫై ఆఫీసర్లు తదితరులకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పోలింగ్ ముగిసి రోజులు గడుస్తున్నా ఆ అధికారి స్పందిచలేదు. దీంతో అడగకపోతే రావని భావించిన కొందరు రూట్, సెక్టార్ ఆఫీసర్లు రెండురోజుల క్రితం ఆ అధికారిని కలిశారు. బిల్లులు ఇవ్వాలని అడిగితే.. కొంత మొత్తం తీసుకువెళ్లాలని ఆ అధికారి చెప్పినట్లు తెలిసింది. సెక్టార్, రూట్ ఆఫీసర్లు మొత్తం 32 మంది నెలరోజులపాటు పనిచేశారు. తమకు ఒక్కొక్కరికి రూ.20వేల వరకు రావాల్సి ఉందని, ఆ మొత్తం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారని తెలుస్తోంది. దీంతో చేసేదిలేక ఒక్కొక్కరికి రూ.10వేలు ఇస్తామని, మిగిలినది తర్వాత చూద్దామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
ఏమిటి పరిస్థితి..?
విజయవాడకు వెళ్లి వచ్చినా ఫలితం లేకపోవడంతో బీఎల్వోలు సైలెంట్‌గా ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో పలు విభాగాలు పనిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, అద్దె వాహనాలు, డీజిల్, సిబ్బంది భోజనాలు, వసతి తదితరాల బిల్లులను అరకొరగానే చెల్లించారు. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రూరల్ పరిధిలో ఎన్నికల వాహనాలకు డీజిల్ పట్టించకపోయినా బిల్లులు తయారుచేసినట్లు తెలుస్తోంది. భోజనాల్లో కూడా కక్కుర్తి పడ్డారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. కౌంటింగ్ పూర్తయితే తమ బిల్లులు ఎవరు చెల్లిస్తారని దుకాణాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఎన్నికల విధుల్లో భాగంగా నాలుగునెలల క్రితం బదిలీపై వచ్చిన ఆ అధికారి మాత్రం పండుగ చేసుకుంటున్నారు. పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయి. ఆ తర్వాత బదిలీలు జరుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్లిపోతే బిల్లుల గురించి అడిగేది ఎవరు అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఉన్నతాధికారులకు పట్టదా..?
2019 ఎన్నికల పెండింగ్ బిల్లులు రూ.12 లక్షల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది అంటున్నారు. గత ఎన్నికల సమయంలో కార్యాలయ సిబ్బందిలో కొందరు అప్పులు చేసి ఖర్చు పెట్టారని సమాచారం. బిల్లులు మంజూరైనా వారికి చెల్లించలేదు. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులను చెల్లించేలా చూడాలని కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 30 , 2024 | 12:03 AM