BIRTH CERTIFICATE : పుట్టిన తేదీతో... పుట్టెడు కష్టాలు..!
ABN, Publish Date - Dec 07 , 2024 | 12:15 AM
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అపార్ కార్డు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఆరువారాలుగా పాఠశాల, గ్రామసచివాలయాలు, తహసీల్దార్, కార్యాలయాలు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావాడం లేదు.
ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ
పట్టించుకోని అధికారులు
గుత్తి రూరల్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అపార్ కార్డు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఆరువారాలుగా పాఠశాల, గ్రామసచివాలయాలు, తహసీల్దార్, కార్యాలయాలు, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావాడం లేదు. పాఠశాల రికార్డుల్లోనూ, ఆధార్‌కార్డులోనూ, ఒకేవిధంగా వివరాలుంటేనే అపార్ కార్డు జనరేట్ అవుతోంది. ఈ రెండు చోట్ల వివరాలు ఒకే విధంగా మార్పు చేయడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లకపోవడంతో వారి చదువులు వెనకబడుతున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిళ్లు తెస్తుండటంతో వారు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడుతున్నారు. అపార్ కార్డు జనరేట్ కావాలంటే పాఠశాల రికార్డుల్లోనూ, ఆధార్‌కార్డులోనూ ఇంటి పేరు ఒకేరకంగా ఉండాలి. సాధారణంగా పాఠశాలలో ఇంటిపేరుతో పాటు విద్యార్థి పేరు ఉంటుంది. కానీ ఆధార్‌కార్డులో వచ్చేపాటికి ఆ సమయంలో ఎక్కువ మంది ఇంటిపేరు పూర్తిగా కాకుండా మొదటి అక్షరం ఇన్షియల్ మాత్రమే పెట్టి నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం అపార్ కార్డు జనరేట్ కావాలంటే ఈ రెండు ఒకేరంగా ఉండాలి. చాలా మందికి రెండు చోట్ల ఒకే రకంగా పేరు ఉండకపోవడంతో అపార్ కార్డులు జనరేట్ కావడం లేదు. ఇంటిపేరు మార్చుకోవాలంటే మొదట జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ పత్రం కోసం సచివాలయంలో వివరాలు రాసిస్తే వారు తహసీల్దార్‌కు పంపుతారు. అక్కడ నమోదై ఉంటే ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఒకవేళ విద్యార్థి పుట్టినపుడు ఎక్కడా నమోదు చేయకపోతే నాన అవైలబుల్ అనే సర్టిఫికెట్‌ను ఆర్డీఓ జారీ చేస్తారు. అక్కడి నుంచి తిరిగి సచివాలయం, తహసీల్దార్ కార్యాలయానికి పంపితే అక్కడ జనన ధ్రువీకరణ పత్రం ఇంటిపేరుతో ఇస్తారు. ఈతంతంగం పూర్తి కావాలంటే కనీసం 15 నుంచి 20 రోజులు పడుతోందని విద్యార్ధుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇబ్బందులు పడతున్నాం
ఇంటిపేరు ఆధార్‌కార్డులో తప్పు ఉండడంతో సరిచేసేందుకు రెండు రోజులుగా ఆధార్ కేంద్రం వద్దకు వస్తున్నా బర్త్ సర్టిఫికెట్ కోసం గుత్తి మున్సిపాలిటీలో ఇవ్వడంతో ఇంటిపేరు కుడా ఇక్కడే మార్చుకోవాలని ఆధార్ సెంటర్‌వారు చెబుతున్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో పనికావడంలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
- పెద్దక్క, గుత్తి అనంతపురం
నాలుగుసార్లు తిరిగినా పని కావడంలేదు
నాకుమారుడు ఇక్కడే పుట్టాడు. అప్పట్లో నల్లదాసరిపల్లి అని కొట్టకుండా కొజ్జేపల్లి అని జనన ధ్రువీకరణ పత్రంలో ముద్రించారు. ఇప్పటికీ గుంతకల్లు నుంచి నాలుగుసార్లు తిరిగినా పనికావడం లేదు. ఎప్పుడు వచ్చినా చూస్తామంటారు కానీ పని మాత్రం చేయలేదు. పనులు వదులుకొని తిరుగతుఉన్నాం.
- ప్రసాద్, నల్లదాసరిపల్లి
Updated Date - Dec 07 , 2024 | 12:15 AM