RBK Staff: పని ఇక్కడ.. వేతనం అక్కడ!
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:21 AM
రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం, విధుల కేటాయింపు, నియంత్రణ వంటి అంశాలలో వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంది. దీంతో విధి నిర్వహణలో గందరగోళం చోటు చేసుకుంటోంది. సచివాలయ సిబ్బందితోపాటు ఆర్బీకే సిబ్బందిని డిసి్ట్రక్ట్ సెలెక్షన కమిటీ (డీఎస్సీ) ద్వారా నియమించారు. కానీ ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో కాగా, వారిని నియంత్రించే శాఖ మరొకటి కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవులు మంజూరు ...
ఆర్బీకే సిబ్బంది విధులలో గందరగోళం
వ్యవసాయ, ఉద్యాన,పట్టు పరిశ్రమలో విధులు
పీఆర్ పరిధిలో సెలవులు, వేతనాల మంజూరు
సిబ్బందికి పనిభారం.. అధికారులకు నియంత్రణ సమస్య
వైసీపీ ప్రభుత్వ తప్పిదాన్ని సరిదిద్దాలని సిబ్బంది వినతి
అనంతపురం అర్బన, జూలై 12: రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం, విధుల కేటాయింపు, నియంత్రణ వంటి అంశాలలో వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంది. దీంతో విధి నిర్వహణలో గందరగోళం చోటు చేసుకుంటోంది. సచివాలయ సిబ్బందితోపాటు ఆర్బీకే సిబ్బందిని డిసి్ట్రక్ట్ సెలెక్షన కమిటీ (డీఎస్సీ) ద్వారా నియమించారు. కానీ ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో కాగా, వారిని నియంత్రించే శాఖ మరొకటి కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవులు మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీకి అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల పరిధిలో చేయిస్తున్నారు. పనులు నిర్వర్తించే శాఖల అధికారులకు ఆర్బీకే సిబ్బందిపై నియంత్రణ ఉండటం లేదు. దీంతో విఽధుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వేతనాలు, సెలవులు మంజూరు చేస్తున్న కారణంగా ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ ఇతర పనులు అప్పగించినా ఆర్బీకే
సిబ్బంది చేయాల్సి వస్తోంది. మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులు పనుల నిమిత్తం ఫోన చేస్తే.. తాము సెలవులో ఉన్నామని ఆర్బీకే సిబ్బంది చెబుతున్నారు. పంచాయతీ సెక్రటరీల ద్వారా ఆర్బీకే సిబ్బంది సెలవు అనుమతి పొందుతున్న విషయం తెలియక.. పనులు అప్పగించాల్సిన మూడు శాఖల అధికారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అత్యవసరంగా ఏవైనా పనులు చేయించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు వాపోతున్నారు. తమకు సంబంధం లేకపోయినా.. ఎంపీడీఓ, సెక్రటరీలు చెప్పే పనులు చేయాల్సి వస్తోందని ఆర్బీకే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే తమకు జీతాలు, సెలవుల విషయంలో సమస్యలు ఎదురవుతాయని వాపోతున్నారు. ఒకే సమయంలో రెండు రకాల పనులు చేయాల్సి వస్తే ఏం చేయాలో తోచడం లేదని, పనిభారంతో సతమతమౌతున్నామని అంటున్నారు.
వేతనం ఇక్కడ.. పనులు అక్కడ..
వైపీపీ హయాంలో జిల్లాలో 451 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 244 మంది ఆర్బీకే సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో వ్యవసాయ శాఖ తరఫున 128 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఉద్యాన శాఖ తరపున 108 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, పట్టుపరిశ్రమ శాఖ తరఫున ఎనిమిది మంది విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. మిగిలిన స్థానాల్లో ఎంపీఈఓలు పనిచేస్తున్నారు. ఒక్కో ఆర్బీకేలో ఒక్కో ఉద్యోగిని నియమించారు. వీరు విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. జీతాలు తీసుకునేది మరో శాఖలో కావడం సమస్యలకు తావిస్తోంది. ఆర్బీకే సిబ్బంది వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖలకు సంబంధించిన పనులు చేస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లల్లో ఈ-క్రాపింగ్, విత్తన పంపిణీ, ఎరువులు, క్రిమిసంహారక మందుల పంపిణీ, రైతు భరోసా, పీఎం కిసాన, ఇనపుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స జాబితా వెరిఫికేషనతోపాటు క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఇలా మూడు శాఖల పరిధిలో పనులు చేస్తున్న ఆర్బీకే సిబ్బందికి వేతనాలు, సెలవులు మంజూరు చేసే బాధ్యతలను పంచాయతీ సెక్రటరీకి అప్పగించారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా అందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏ శాఖ పనులు చేసే ఆర్బీకే సిబ్బందిని ఆ శాఖలకు కేటాయించాలని కోరుతున్నారు. డీడీఓ (డ్రాయింగ్ డ్రాఫ్ట్ ఆఫీసర్) బాధ్యతలను కూడా వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల అధికారులకు అప్పగించాలని, వేతనాలు, సెలవులు మంజూరు అధికారాన్ని కూడా ఆయా శాఖల అధికారులకే అప్పగించేలా మార్పులు చేయాలని కోరుతున్నారు.
ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
ఆర్బీకే సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా వేతనాలు అందజేస్తున్నారు. పనులేమో వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో చేయిస్తున్నారు. ఎస్‌ఆర్‌లు మాత్రమే వ్యవసాయ శాఖ ఏడీఏ, ఉద్యాన అధికారి వద్ద ఉంచారు. సిబ్బందికి వేతనాల బిల్లులు పెట్టడం, సెలవులు మంజూరు చేయడం వంటి అధికారాలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. దీంతో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు ఆర్బీకే సిబ్బందిపై పూర్తి స్థాయి నియంత్రణ ఉండటం లేదు. వేతనాలు మంజూరు చేస్తున్న శాఖ అధికారుల మాటలలే సిబ్బంది వినాల్సి వస్తోంది. గతంలో అనేక సార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. ఇప్పటికైనా ఆర్బీకే సిబ్బందిని పనిచేసే శాఖలకు కేటాయించాలి. అప్పుడే పాలన గాడిలో పడుతుంది.
-లక్ష్మీనారాయణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
పనిచేసే శాఖలకు కేటాయించాలి..
వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖలకు ఆర్బీకే సిబ్బంది బాధ్యతలను పూర్తిగా కేటాయించాలి. వేతనాలు, సెలవులు, విధుల కేటాయింపు తదితర అధికారాలను ఆయా శాఖల అధికారులకే అప్పగించాలి. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి దాకా పనులు ఒక శాఖలో చేస్తూ... వేతనం, సెలవులు మరో శాఖ ద్వారా తీసుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొత్త ప్రభుత్వం ఆర్బీకే వ్యవస్థ నిర్వహణలో మార్పులు చేయాలి. పాలనను గాడిలో పెట్టాలి.
-నరసింహ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
పేరు మారదా..!
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జిల్లాలో అమలు కావడం లేదు. గత నెల 29న ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 451 ఆర్బీకేల పేర్లను రైతు సేవా కేంద్రాలుగా తక్షణమే మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడా పేరు మారలేదు. ఇప్పటికీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం పేరు, మాజీ సీఎం జగన ఫొటో అలాగే ఉన్నాయి. ఆర్బీకేల్లోని కియోస్క్‌లు, యాప్‌లలోని నవరత్నాల లోగో నుంచి జగన ఫొటోలను తొలగించారు. కానీ సీఎం చంద్రబాబు ఫొటోలను అప్‌లోడ్ చేయలేదు. జిల్లా వ్యవసాయ సలహా బోర్డు, మండల స్థాయి వ్యవసాయ సలహా బోర్డుల కమిటీలను రద్దు చేసినట్లు చైర్మన్లు, సభ్యులకు సమాచారం అందించారు. కానీ రైతు భరోసా కేంద్రం పేరు మార్చేందుకు నిధుల కొరత ఉన్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఆర్బీకేలకు వైసీపీ రంగులు వేయించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కోడ్ కారణంగా ఆ రంగులు మార్చేందుకు వ్యవసాయ శాఖ అధికారులు నానా తంటాలు పడ్డారు. నిధులు లేకపోవడంతో వ్యవసాయ అధికారులు, సిబ్బంది సొంత డబ్బులు వెచ్చించి రంగులు మార్చారు. ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు రావాల్సి ఉంది. ఆర్బీకేల పేర్లు మార్చాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఒక్కొక్కటిగా సాఫ్ట్‌వేర్‌ను మార్చి, సీఎం చంద్రబాబు ఫొటోలను అప్‌లోడ్ చేస్తామని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 13 , 2024 | 12:21 AM