Nadendla Manohar : తేమ శాతం 24 ఉన్నా కొనుగోలు చేస్తాం
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:58 AM
తేమ 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
గుడివాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తేమ 24 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశిలిచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పామర్రు, గుడివాడ ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, వెనిగండ్ల రాముతో కలిసి రహదారులపై ఆరబోసిన ధాన్యపు రాసులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటిలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ వాతావరణ మార్పులతో 40 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియ నాలుగు రోజుల్లో చేయాల్సి రావడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రైతులకు నమ్మకం కలిగేలా, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీ ఇబ్బందులు తలెత్తకుండా, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేశామన్నారు. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ వెసులుబాటు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కనీస మద్దతు ధర అందిస్తోందన్నారు. శుక్రవారం సాయంత్రం కల్లా ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 04:00 AM