ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: అమరావతే రాజధాని

ABN, Publish Date - Dec 12 , 2024 | 03:51 AM

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేశారు.

మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు

హైకోర్టు త్రిసభ్య బెంచ్‌ తీర్పును అమలుచేస్తాం

రైతులకు ఇచ్చిన చట్టబద్ధ హామీలను నెరవేరుస్తాం

మూడేళ్లలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం

ఈ అంశాలు పరిగణించి ఎస్‌ఎల్‌పీని పరిష్కరించండి

ప్రభుత్వం తరఫున సుప్రీంలో సీఎస్‌ అఫిడవిట్‌

అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుందని రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగంచేసిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ‘‘మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్నట్లు అమరావతి అభివృద్ధికి తోడ్పడే విధంగా నవ నగరాలతో (ఫైనాన్షియల్‌ సిటీ, గవర్నమెంట్‌ సిటీ, జస్టిస్‌ సిటీ, నాలెడ్జ్‌ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, హెల్త్‌ సిటీ, ఎలకా్ట్రనిక్‌ సిటీ, టూరిజమ్‌ సిటీలు) అమరావతిని అభివృద్ధి చేస్తాం. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు వారికిచ్చిన అన్ని చట్టబద్ధమైన హామీలను నెరవేరుస్తాం. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి ఇచ్చిన తరువాత ఏపీసీఆర్డీయే వద్ద ఉన్న భూమిలో నవ నగరాల అభివృద్ధి చేసేందుకు వీలుగా.....పెట్టుబడులను ఆకర్షిస్తాం. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తాం. ఉద్యోగావకాశాలు, మౌలిక వసతులు కల్పిస్తాం. హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్‌, రాష్ట్ర సచివాలయం కోసం శాశ్వత భవనాలు సిద్ధమైన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాలను ఇతర అవసరాల కోసం వినియోగిస్తాం. హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అఖిలభారత సర్వీస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం 2018-19లోనే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి’’ అని సీఎస్‌ తెలిపారు.


కోర్టు ఏం చెప్పిందంటే..

2019 సాధారణ ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పనులను పూర్తిగా పక్కన పెట్టేసిందని సీఎస్‌ తన కౌంటరులో వెల్లడించారు. ‘‘2020లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా సీఆర్డీయే చట్టాన్ని అప్పటి ప్రభుత్వం సవరించింది. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా ప్రభుత్వం రాజధాని అమరావతిని అభివృద్ధి చేపట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ రైతులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన హైకోర్టు 2022 మార్చి 3న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అనుసరించి.. భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు అమరావతి రాజధాని నగరాన్నీ, రాజధాని ప్రాంతాన్నీ ఆరునెలల్లో నిర్మించాలి.. అభివృద్ధి చేయాలి.. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్‌ 58 ప్రకారం అమరావతి రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను తీర్పు ఇచ్చిన తేదీ నాటి నుంచి నెలరోజుల్లో పూర్తి చేయాలి. సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ప్లానింగ్‌ స్కీమ్‌ల కింద నవ నగరాలను పూర్తి చేయాలి.

భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇచ్చే పునర్నిర్మించిన ప్లాట్లు...నివాసానికి సరిపోయే విధంగా అప్రోచ్‌ రోడ్లు, తాగునీరు, ప్రతి ఫ్లాట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలి. తీర్పు ఇచ్చిన తేదీ నాటి నుంచి మూడు నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను భూములు ఇచ్చిన రైతులకు అప్పగించాలి. భూసమీకరణ పథకం ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూమిని రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధికి మినహా, ఇతరులకు అన్యాక్రాంతం/తనఖాపెట్టడంకానీ, థర్డ్‌ పార్టీకి హక్కులు కల్పించవద్దని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏను ఆ తీర్పులో హైకోర్టు ఆదేశించింది’’ అని సీఎస్‌ తెలిపారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసిందని పేర్కొన్నారు. ‘‘మారిన పరిస్థితుల నేపఽథ్యంలో హైకోర్టు నిర్దేశించిన కాలపరిమితి లోపు పనులు పూర్తి చేయడం సాంకేతికంగా సాధ్యం కాదు. ఈ నేపధ్యంలో వచ్చే మూడేళ్లలోపు హైకోర్టు నిర్దేశించిన వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తాం. వీటి అన్నింటితోపాటుగా కోర్టు ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తాం. అందులోభాగంగా.. ఫామ్‌ 9.14 మేరకు రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఆర్డీయే చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలన్నీ అమరావతిలోనే ఉంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎస్‌ఎల్‌పీని పరిష్కరించండి’’ అని సీఎస్‌ తన కౌంటర్‌లో కోరారు.

Updated Date - Dec 12 , 2024 | 03:51 AM