నేవీ చేతికి మరో అణ్వాస్త్రం!
ABN, Publish Date - Oct 23 , 2024 | 04:41 AM
ఇటీవలే స్వదేశీ అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను అట్టహాసంగా ప్రారంభించిన భారత్..
అమ్ముల పొదిలో మూడో స్వదేశీ అణు జలాంతర్గామి
2 నెలల వ్యవధిలో రెండో సబ్‌మెరైన్ ప్రారంభం
విశాఖలో సైలెంట్‌గా ఎస్-4స్టార్ జలప్రవేశం
16న షిప్ బిల్డింగ్ సెంటర్ నుంచి ప్రారంభం
అరిధమన్‌గా నామకరణం చేసే అవకాశం
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవలే స్వదేశీ అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను అట్టహాసంగా ప్రారంభించిన భారత్.. రెండు నెలల వ్యవధిలోనే మరో న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను జల ప్రవేశం చేయించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. హిందూ-పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర కార్యకలా పాలు పెచ్చుమీరుతున్న తరుణంలో.. భారత్ తన సముద్ర అణ్వాయుధ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో అణు జలాంతర్గామిని రంగంలోకి దిం చింది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ) నుంచి ఈ నెల 16నే తన నాలుగో అణు జలాంతర్గామి ఎస్4స్టార్‌ను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించింది. విశాఖపట్నం కేంద్రంగా అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి వ్యవహారాలన్నీ నేరుగా ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 29న ఇదే ఎస్‌బీసీ నుంచి కొత్త అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇది జరిగి రెండు నెల లైనా కాకముందే మరో శక్తిమంతమైన, అంతకంటే మెరుగైన అణు జలాంతర్గామిని సిద్ధం చేయడంపై ప్ర పంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఇది 75శాతానికి పైగా దేశీయంగా తయారైనది కావడం విశేషం.
దేశీయంగా మూడోది.. మొత్తంగా నాలుగోది
భారత నౌకాదళం తొలుత రష్యా నుంచి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ చక్రను లీజుకు తీసుకుంది. అది విశాఖపట్నం కేంద్రంగానే పనిచేస్తోంది. ఆ తర్వాత విశాఖలోని తూర్పు నౌకాదళాన్ని నేవీ సబ్‌మెరైన్ల కేంద్రంగా ప్రకటించి, ఇక్కడే అణు జలాంతర్గాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్ (ఏటీవీ) ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నాలుగు అణు జలాంతర్గాములు నిర్మించాలని నిర్ణయించారు. తొలుత ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను నిర్మించారు. ఇది 2009లో సముద్ర పరీక్షలకు వెళ్లి 2016 నుంచి నేవీకి సేవలందించడం ప్రారంభించింది. దానికి పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఐఎన్‌ఎస్ అరిఘాత్ నిర్మాణం ప్రారంభించారు. ఇది 2017 నుంచి సీ ట్రయల్స్‌కు వెళుతూ రెండు నెలల క్రితమే నేవీలో చేరింది. తాజాగా వారం రోజుల క్రితం ఎస్‌బీసీ నుంచి మూడో అణు జలాంతర్గామి ఎస్4స్టార్ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. దీనికి ఐఎన్‌ఎస్ అరిధమన్‌గా పేరు పెడతారని విశ్వసనీయ సమాచారం.
అరిహంత్ క్లాసులోనే భారీ తేడా
ఏటీవీ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న సబ్‌మెరైన్లను అరిహంత్ క్లాస్‌గా వ్యవహరిస్తున్నారు. అరిహంత్ సబ్‌మెరైన్ నుంచి కె-15 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించగలుగుతున్నారు. ఇవి 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తాయి. అరిఘాత్ విషయానికి వస్తే 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే కే-4 మిస్సైళ్లను ప్రయోగించేలా తీర్చిదిద్దారు. ఇది సముద్రం లోపల గంటకు 44కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రెండింటిలో నాలుగు మిస్సైల్ ట్యూబులు ఉన్నాయి. కాగా, వీటిక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రూపొందించిన ఎస్-4స్టార్‌లో ఎనిమిది మిస్సైల్ ట్యూబులు ఉంటాయి. దీని నుంచి మిస్సైళ్లను నిట్టనిలువుగా కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ఇవి కూడా 3,500 కి.మీ. దూరం లోని లక్ష్యాలను అల వోకగా ఛేది స్తాయి. ఈ అణు జలాంతర్గాములు సముద్రంలో ఎంత దూరమైనా ప్రయాణించగలవు. వీటికి పరిమితి లేదు. వాటికి అవసరమైన ఇంధనం, సమయానుసారం నిర్వహణ, లోపల ఉండే సిబ్బందికి అవసరమైన ఆహారం, ఆరోగ్య సహకారం అందించగలిగితే సముద్రంలో ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. అరిహంత్, అరిఘాత్ రెండూ ప్రస్తుతం భారత జలాల సరిహద్దు పరిరక్షణకు పహారా కాస్తున్నాయి.
ఎస్-1 నుంచి ఎస్-4 వరకు
అణు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీటిని స్ట్రాటజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్‌మెరైన్లు (ఎస్‌ఎస్‌బీఎన్)గా వ్యవహరిస్తున్నారు. రష్యా నుంచి లీజుకు తీసుకున్న ఐఎన్‌ఎస్ చక్రను ఎస్-1గా, అరిహంత్‌ను ఎస్-2గా, అరిఘాత్‌ను ఎస్-3గా, తాజాగా జలప్రవేశం చేసిన దానిని ఎస్-4స్టార్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఎస్‌బీసీలో ఇప్పటివరకూ నిర్మితమైవని మూడు మాత్రమే.
Updated Date - Oct 23 , 2024 | 04:42 AM