‘ఎనీవేర్’.. భూముల చోర్!
ABN, Publish Date - Jul 31 , 2024 | 03:04 AM
ఎనీవేర్ రిజిస్ర్టేషన్ విధానాన్ని గత ఐదేళ్లూ అడ్డదిడ్డంగా వాడేశారు. జనాల భూములకు చెందిన 2 లక్షల డాక్యుమెంట్లకు నాటి ప్రభుత్వ పెద్దలు 8 నెలల్లో అక్రమంగా రిజిస్ర్టేషన్లు చేసేసుకున్నారు.
అటు చుక్కల భూములు.. ఇటు జనం ఆస్తులు
వారికి తెలీకుండానే అడ్డగోలుగా కొట్టేసిన వైసీపీ
ఎనీవేర్ రిజిస్ర్టేషన్ ముసుగులో భారీ భూదందా
ఎనీవేర్ రిజిస్ర్టేషన్! ఒక ప్రాంతంలో ఉన్న ఆస్తిని మరో ప్రాంతంలోని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలో రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విధానం! కానీ, ప్రజల చేతుల్లోని భూములను వైసీపీ పెద్దలు, ఆ పార్టీ స్థానిక నాయకులు తమ పేర్ల మీదకు బదలాయించుకునేందుకు ఈ విధానాన్ని యథేచ్ఛగా వాడేశారు. నిషేధ జాబితాలోని ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, దేవదాయ భూములనే గత ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారని అనుకున్నారు. కానీ, జనం భూములు, ఆస్తులు సైతం ‘ఎనీవేర్’ ముసుగులో కొల్లగొట్టారని ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దీంతో జనం ఎక్కడికక్కడ రిజిస్ర్టేషన్ కార్యాలయాలపై దండెత్తుతున్నారు.
నాడు 8 నెలల్లోనే 2 లక్షల డాక్యుమెంట్ల
రిజిస్ర్టేషన్.. ఇవన్నీ జనం భూములే
చంద్రబాబు హయాంలో ‘ఎనీవేర్’ ఏర్పాటు
ఒకచోట భూమికి మరోచోట రిజిస్ర్టేషన్‌కు వీలు
అభ్యంతరాల వెల్లడికి నాడు 48 గంటల సమయం
ఆ టైం గంటకు తగ్గించి ‘ఎనీవేర్’కు జగన్ తూట్లు
వేల ఎకరాలను యథేచ్ఛగా దోచేసిన వైసీపీ పెద్దలు
ప్రభుత్వం మారగానే ఒక్కొక్క బాగోతం బయటకు
విశాఖ, విజయవాడ, తూర్పుగోదావరి నుంచి
పుంఖానుపుంఖాలుగా జనం నుంచి ఫిర్యాదులు
మాజీ సీఎస్ జవహర్‌రెడ్డిపై విచారణకు డిమాండ్
అక్రమాలు సరిదిద్దకపోతే అరాచక వాతావరణమే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఎనీవేర్ రిజిస్ర్టేషన్ విధానాన్ని గత ఐదేళ్లూ అడ్డదిడ్డంగా వాడేశారు. జనాల భూములకు చెందిన 2 లక్షల డాక్యుమెంట్లకు నాటి ప్రభుత్వ పెద్దలు 8 నెలల్లో అక్రమంగా రిజిస్ర్టేషన్లు చేసేసుకున్నారు. ఇవన్నీ ఎనీవేర్‌ను ఉపయోగించుకుని చేసిన అక్రమాలే. ఇప్పుడిప్పుడే తమ భూమి తమకు తెలీకుండా వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలుసుకున్న బాఽధితులు.... రిజిస్ర్టేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. దూరంగా ఉన్న వారు మెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా రిజిస్ర్టేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టిసారించి అక్రమాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. ఎనీవేర్ రిజిస్ర్టేషన్ విధానాన్ని 2015లో చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ విధానంలో విజయవాడలోని గుణదల పరిధిలో ఉన్న ఆస్తిని ఒంగోలు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒంగోలు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి తాలూకు డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఇరుపార్టీలకు చెందిన ఇతర సర్టిఫికేట్లన్నింటినీ గుణదల సబ్‌రిజిస్ర్టార్‌కు పంపుతారు.
ఆ వివరాలు సరైనవో, కావోనని చెప్పడానికి 48 గంటల సమయం ఇస్తారు. సరైనవే అయితే ఒంగోలులో రిజిస్ర్టేషన్ జరిగిపోతుంది. ఒకవేళ ఏవైనా వివాదాలుంటే దాన్ని పెండింగ్‌లో పెడతారు. కానీ, జగన్ ఏం చేశారంటే, డాక్యుమెంట్ల పరిశీలన వ్యవధిని కేవలం ఒక గంటకు తగ్గించారు. పైగా ఆ ఆస్తి ఉన్న ప్రాంతం సబ్‌రిజిస్ర్టార్‌కు డాక్యుమెంట్లు పంపరు. ఏ ప్రాంతంలోని భూమి, సర్వే నెంబర్ లాంటి కొన్ని వివరాలను ఒక ఫారంలో నింపి పంపుతారు. అసైన్డ్, నిషేధిత జాబితాలోని భూములైతే ఈ విధానంలో తెలుసుకోవచ్చు. కానీ, గ్రామకంఠాలకు రికార్డులుండవు. ఈ విధానంలో కేవలం ఒక గంటలో వాటిని గుర్తించడం అసాధ్యం. లింకు డాక్యుమెంట్లు, ఇతర సంబంధిత సర్టిఫికెట్లు ఏవీ ఉండకపోవడంతో ఎవరి భూమి ఎవరు రిజిస్ర్టేషన్ చేయించుకుంటున్నారన్న విషయం కూడా సబ్‌రిజిస్ర్టార్లకు తెలీదు. పైగా గంటలో ఓకే చేయాలి. ఓకే చేయకపోతే ఆ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోతాయి. ప్రజలు సబ్‌రిజిస్ర్టార్లపై ఒత్తిడి పెంచుతారు. దీంతో ఏ వివరాలు తెలియకపోయినా సరే తప్పనిసరిగా ఆ ఎనీవేర్ ప్రతిపాదనలకు సబ్‌రిజిస్ర్టార్లు ఓకే చేయాల్సిన తప్పనిపరిస్థితిలోని జగన్ నెట్టేశారు.
48 గంటలు.. తప్పేముంది?
ఎనీవేర్ రిజిస్ర్టేషన్‌లో రిజిస్ర్టేషన్ జరిగేది ఒక ప్రాంతంలో అయితే ఆస్తి మరో ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల వెరిఫికేషన్‌కి సమయం పడుతుంది. అందుకే చంద్రబాబు హయాంలో 48 గంటల వ్యవధి ఇచ్చారు. రెండ్రోజుల తర్వాత రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ తీసుకోవడం వల్ల నష్టం జరగదు కదా! ఒక సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలో ఆస్తి ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సదరు వ్యక్తికి అనుకూలమైన ఏ సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో అయినా రిజిస్ర్టేషన్ చేయించుకోవచ్చు. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న ప్రాంతం సమీపంలోని సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ సిబ్బంది వెళ్లి రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దూరంలో ఉన్న వ్యక్తి ఇతరులకు పవర్ అటార్నీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
జవహర్ రెడ్డిని విచారించాలి!
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖను తన వద్దే ఉంచుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ, జగన్ హయాంలో సీఎ్‌సగా పనిచేసిన జవహర్‌రెడ్డి మా త్రం ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. అప్పటి ఆ శాఖ ఐజీ వి.రామకృష్ణ సీఎస్ కార్యాలయంలో ఒక సీటు వేసుకుని కూర్చునేవారు. ఎనీవేర్ ముసుగులో విశాఖ, తూర్పుగోదావరి, విజయవాడల్లో వేల ఎకరాలు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను, 22ఏ భూములను కొట్టేయడానికి ప్రత్యేక మాడ్యూల్ తయారుచేసుకుని దోచేశారు. ధనుంజయ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జవహర్ రెడ్డి కలిసి విశాఖ, విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్తులతోపాటు జనాల ఆస్తులు కూడా సొంత బీరువాలో పెట్టుకున్నారు. ఈ అక్రమాల గుట్టు బయటపడాలంటే జవహర్ రెడ్డిని, ఐజీ రామకృష్ణను విచారించాల్సిందేన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Updated Date - Jul 31 , 2024 | 03:04 AM