Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు... ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు
ABN, Publish Date - Jul 03 , 2024 | 09:36 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు చేరుకున్న ఆయన.. ఏపీ ఎన్డీఏ ఎంపీలతో విందులో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు చేరుకున్న ఆయన.. ఏపీ ఎన్డీఏ ఎంపీలతో విందులో పాల్గొన్నారు. కాగా షెడ్యూల్‌లో భాగంగా రేపు (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటి కానున్నారు.
ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమవనున్నారు. ఆ తర్వాత రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలవనున్నారు. ఇక ఎల్లుండి (శుక్రవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన కలవనున్నట్లు సమాచారం.
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ, సంబంధిత శాఖల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నారని సమాచారం. ఇక విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు.
Updated Date - Jul 03 , 2024 | 09:37 PM