AP Highcourt: దళిత యువకుడు శిరోముండనం కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
ABN, Publish Date - Feb 01 , 2024 | 01:36 PM
Andhrapradesh: దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. వరప్రసాద్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
అమరావతి, ఫిబ్రవరి 1: దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు (AP Highcourt) చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ (lawyer Jada Shravan Kumar) వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారనే నెపంతో వరప్రసాద్‌ను కులం పేరుతో దూషించి, రాజకీయ నాయకుల అండదండలతో పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించారని జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. నిందితులకు చట్టం ప్రకారం శిక్ష విధించాలని కోర్టును న్యాయవాది కోరారు. విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని శ్రవణ్ కుమార్ కోరారు. శ్రవణ్ కుమార్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్ట్.. నిందితులందరి క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ తీర్పు వెల్లడించింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత విచారణ కొనసాగించవలసిందిగా పోలీసులకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సుదీర్ఘ విచారణ తర్వాత...
కాగా.. ఈస్ట్ గోదావరిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడనే నెపంతో అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లోనే దళిత యువకుడికి శిరోముండనం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినా వరప్రసాద్‌కు న్యాయం చేయలేదని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. తనకు న్యాయం జరగకపోవడంతో నక్సలైట్‌లో కలిసి పోవడానికి వరప్రసాద్ రాష్ట్రపతినే అభ్యర్థించాడు. నిందితులపై పెట్టిన కేసులో తదుపరి విచారణ జరపకుండా 2020లో రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా నాలుగు సంవత్సరాల క్రితం విచారణపై స్టే విధించింది అనే ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 01 , 2024 | 02:10 PM