AP Cabinet Ministers : అమాత్యుల తొలి పలుకులు
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:32 AM
సంపద సృష్టి పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు ప్రకటించిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో చేస్తామని, సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకువస్తామని చెప్పారు.
పన్నుల బాదుడు ఉండదు
ఆదాయం పెంపునకు వినూత్న మార్గాలు
చంద్రబాబు అనుభవంతో ఆర్థిక సమస్యలకు చెక్
జగన్ సభకు రావాలని కోరుకొంటున్నాం
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): సంపద సృష్టి పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. మంత్రులకు శాఖలు ప్రకటించిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో చేస్తామని, సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర ఖజానా ఎలా ఉందో తామింకా చూడాలేదని, నిధుల మళ్లింపు, భవిష్యత్ ఆదాయాలు తాకట్టు పెట్టడం లాంటి అనేక అవకతవకలు జగన్ హయాంలో జరిగాయని ఆరోపించారు. కాగ్ కూడా తన నివేదికలో వీటిని ధ్రువీకరించినట్టు పయ్యావుల గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉన్నా సీఎం చంద్రబాబు అనుభవం, దూరదృష్టితో ఆ సమస్యలను అధిగమిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు. ‘అప్పులు 11లక్షల కోట్లకు చేరాయని వింటున్నాం. కార్పొరేషన్ల పేరుతో ఇష్టానుసారం అప్పులు తెచ్చి, ఎడాపెడా దారి మళ్లించి ఖర్చు చేశారు. శాసనసభకు చెప్పాల్సినవి కూడా చెప్పలేదు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యవస్ధలను ఛిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం గతంలో మరొకటి లేదు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతు తెలియని గొయ్యని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల ఫలితంగా కేంద్రం అనేక కొత్త మార్గదర్శక సూత్రాలు జారీ చేయాల్సి వచ్చింది. చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని విశ్వసిస్తున్నాం. ఇప్పటికే ఆ వాతావరణం కనిపిస్తోంది. సామాన్యులపై భారం మోపకుండా వినూత్న విధానాలతో ఆదాయం పెంచుకొనే మార్గాలు అన్వేషిస్తాం’ అని పయ్యావుల చెప్పారు. ప్రతిపక్ష హోదాకు చాలినన్ని సీట్లు రాకపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ శాసనసభకు రావాలని తాము కోరుకొంటున్నామని పేర్కొన్నారు. సభలో ప్రతిపక్షం ఉండాలన్నదే తమ అభిప్రాయమని తెలిపారు.
ఆడపిల్లల భద్రతకు ప్రాధాన్యం
తప్పుడు ఆలోచనలతో వారివైపు కన్నెత్తి చూసినా కఠిన చర్యలు
శాంతి భద్రతలు టీడీపీ బ్రాండ్
దానిని ఆచరణలో నిరూపిస్తాం
పోలీసు వ్యవస్థలో మార్పును ఆశిస్తున్నాం
హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ‘ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదు. తప్పుడు ఆలోచనలతో వారివైపు కన్నెత్తి చూసినా కఠినంగా వ్యవహరిస్తాం. గంజాయి, డ్రగ్స్ వాడినా, అమ్మినా ఊరుకొనేది లేదు’ అని అని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలు భద్రంగా ఉండగలిగే పరిస్థితులు నెలకొనేలా చేస్తామని హామీ ఇచ్చారు. ‘మంచి శాంతి భద్రతలు టీడీపీ బ్రాండ్. దానిని నిరూపిస్తాం. ఆచరణలో చూపిస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీయే కూటమి మార్క్ ఉండేలా పనిచేస్తాం. మచ్చలేని పాలనను అందించడానికి కృషి చేస్తాం’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఏం తప్పు చేశామని మాపై పరమ నీచంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారు? ఒక రాజకీయ పార్టీలో ఉండి ప్రజల సమస్యలపై పనిచేస్తే వేధిస్తారా? విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డు మీద కొట్టి పిచ్చివాడిగా ముద్ర వేసి చనిపోయేలా చేశారు. ఆయనకు మద్దతుగా పోరాడినందుకు భయంకరమైన ట్రోల్స్. వాటిలో పచ్చిబూతులు. యూట్యూబ్‌లో వచ్చే నా వార్తల కింద కామెంట్లు చదవొద్దని నా పిల్లలను కూర్చోబెట్టి చెప్పాల్సి వచ్చేది. ఒక తల్లిగా నాకు ఇదేం పరిస్థితి? అరవై ఏళ్లు పైబడిన రంగనాయకమ్మను తెచ్చి సీఐడీ ఆఫీసులో కూర్చోబెట్టి వేధించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో నిండు సభలో అమానుషంగా దూషించారు. చంద్రబాబుపై కేసేమిటో తెలియకుండానే అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయనకు కనీసం వెస్ట్రన్ టాయిలెట్, వేడినీళ్లు కూడా ఇవ్వలేదు. పల్నాడులో ఒక టీడీపీ కార్యకర్తను ‘జై జగన్’ అనలేదని గొంతు కోసి చంపారు. అరెస్టులు, వేధింపులపై డీజీపీని కలవాలని వెళ్తే ఎన్నోసార్లు రోడ్డు మీద ఆపారు. కనీసం ఎవరో ఒక ఐపీఎస్ అధికారికి వినతిపత్రం ఇస్తామంటే కార్యాలయం లోపలికి తీసుకువెళ్లి ఒక హెడ్ కానిస్టేబుల్‌ను చూపించి అతనికి ఇమ్మని చెప్పారు. కోపంతో ఆ వినతిపత్రం చించేసి వచ్చేశాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే ప్రొటోకాల్ ఇచ్చి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్తారని ఆ రోజే చెప్పాను. ఇప్పుడు హోంమంత్రిగా వాళ్లే నన్ను తీసుకువెళ్ళాల్సిన పరిస్ధితి వచ్చింది’ అని ఆమె అన్నారు. తమకు కక్ష సాధించే ఉద్దేశం లేదని... అయితే తప్పు చేసినవారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ‘ప్రజలకు మంచిచేసే విషయంలో పోలీస్ వ్యవస్థ సానుకూల ధోరణితో వ్యవహరిస్తే ఇబ్బంది లేదు. ఇంకా మాలో ఆ రక్తమే ఉందంటూ పాత పద్ధతిలో ఉంటే మేం మా రక్తాన్ని మేం తెచ్చుకొంటాం. తప్పు చేసినవారి పట్ల కఠినంగా ఉండాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. అందులో మేం రాజీ పడం. శాంతి భద్రతలు బాగుంటే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. గత ప్రభుత్వంలో ఉన్నవి పోయాయి. ఆ పరిస్థితులు పునరావృతం కానివ్వం’ అని హోమంత్రి పేర్కొన్నారు.
సమ్మిళిత అభివృద్ధి సాధిస్తాం
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే నాయకత్వం, ఉమ్మడి కృషితో సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా తనను అభినందించిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, ఇతర మంత్రివర్గ సహచరులతో కలసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మనమందరం ముందుకు నడుద్దామని పవన్ సంఘీభావం ప్రకటించారు.
మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి
మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాబోయే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని, మాస్టర్ ప్లాన్‌లో ఉన్న నిర్మాణాలన్నీ త్వరితగతిన పూర్తిచేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పట్టణాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రతి పట్టణ పౌరుడికి సురక్షితమైన తాగునీటి కోసం ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తామని, డ్రైన్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ఘన, ద్రవవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు.పెంపొందించేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
మిగులు నుంచి కొనే స్థాయికి తెచ్చారు
ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2014- 19 మధ్యకాలంలో మిగులు విద్యుత్తు స్థాయి నుంచి ప్రస్తుతం డిమాండ్‌ను తట్టుకోవాలంటే బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన స్థాయికి తీసుకొచ్చారని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆక్షేపించారు. ఈ దుస్థితికి కారణాలపై లోతైన అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆదాయం పెరగాలంటే చార్జీలను పెంచడం ఒక్కటే మార్గంగా వైసీపీ సర్కారు ఎంచుకుందని అన్నారు. ఇంధనశాఖ స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే శాఖాపరమైన సమీక్షను చేపడతానని, ఆ తర్వాతే పూర్తి వివరాలను అందజేస్తానని తెలిపారు.
ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ
ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేశ్
అమరావతి(ఆంధ్రజ్యోతి), మంగళగిరి, జూన్ 14: పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామని రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ర్టానికి ఐటీ, ఎలక్ర్టానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్దఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చగలిగానని, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖా మంత్రిగా అనేక కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని గుర్తుచేశారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో మరింత సమర్థవంతంగా పనిచేస్తానన్నారు. యువగళం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తానని హామీ ఇచ్చానన్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న తనకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తానని లోకేశ్ స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల రహితంగా ఏపీ
ప్రతి జిల్లాలోనూ స్టేడియాల నిర్మాణం
రవాణా, క్రీడాశాఖా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, భద్రతా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని, అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుని.. రాష్ట్రాన్ని రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడమే తన లక్ష్యమని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్ది అన్నారు. ఫిటెనెస్ లేకుండా రోడ్డుపైకి వచ్చే కాలం చెల్లిన లారీలు, స్కూల్ బస్సులు, కార్లు, ఇతర వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కార్యక్రమంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా వంద శాతం విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ స్టేడియాల ఏర్పాటు, క్రీడాశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెప్పించి క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల వసతులను అందించేందుకు కృషి చేస్తామని వివరించారు. అన్ని పాఠశాలల్లో రోజుకు ఒక గంట స్పోర్ట్స్ క్లాస్ నిర్వహిస్తామని, ఫిట్‌నె్‌సపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజా పంపిణీని మెరుగుపరుస్తాం
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. పేద ప్రజలకు, రైతులకు చిత్తశుద్ధితో సేవలందించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని, ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గుజరాత్ తరహాలో పారిశ్రామిక ప్రగతి
పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు, జూన్ 14(ఆంధ్రజ్యోతి): గుజరాత్ తరహా మోడల్‌గా ఏపీలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తానని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్వతహగా పారిశ్రామికవేత్తనైన తనకు రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలో అవగాహన ఉందని తెలిపారు. రాయితీలు ఇవ్వడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తేనే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని, ఈ పరిస్థితుల్లో వారికి ధైర్యం, ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి రూట్ మ్యాప్ తయారు చేస్తానని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ఎంతో కీలకమైనదని, కోస్తాంధ్రలో ఆక్వా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తానని భరత్ తెలిపారు.
హౌసింగ్‌లో అవకతవకలపై విచారణ
గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ఐదేళ్లలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరిగినా, లబ్ధిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లినా లోతుగా దర్యాప్తు చేయించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్‌లోని గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చాంబర్‌లో గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సతీసమేతంగా పూజలు నిర్వహించారు. తనకు అప్పగించిన శాఖలను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పేదలకు చక్కటి గూడు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ‘గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిపివేసిన దాదాపు 13.80లక్షల గృహాలను పూర్తి చేస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని హౌసింగ్ కాలనీల్లో అమృత్, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకాల కింద పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా’నని మంత్రి పేర్కొన్నారు.
కార్మికులకు అండగా ఉంటాం
8మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి(ఆంధ్రజ్యోతి)/ రామచంద్రపురం (ద్రాక్షారామ), జూన్ 14: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కార్మికుల సంక్షేమానికి అమలు చేసిన అన్ని పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పునరుద్ధరణకు కృషి చేస్తానని కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో కార్మికుల సంక్షేమం మూలనపడింది. ముఖ్యంగా భవన నిర్మాణరంగ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు నిలిపివేసింది. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వారు కీలకపాత్ర పోషించారు. గతంలో చంద్రన్న బీమాతో కుటుంబా లకు భరోసా కల్పించాం సాధారణ మరణానికి 30 వేలు, రోడ్డు ప్రమాదంలో మరణాలకు రూ.5లక్షల వరకూ బీమా సౌకర్యం ఉండేది. ఆ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది’ అని సుభాష్ మండిపడ్డారు. ఈఎస్‌ఐను అభివృద్ధి చేసి, కార్మికుల కోసం మరిన్ని ఆస్పత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు కార్మికులకు అండగా ఉంటామన్నారు.
రైతుల ఆదాయం పెంపునకు కృషి
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపొందించడం ద్వారా ఏపీ వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు చెప్పారు. అత్యంత కీలకమైన వ్యవసాయశాఖ మంత్రిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు. నాకు అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహించి, ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి పాటుపడతా. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయశాఖను భ్రష్టు పట్టించింది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడతా. విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలబడతాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన సబ్సిడీ యంత్రాలు, యంత్రపరికరాలు, మైక్రో ఇరిగేషన్ వంటి అన్ని పథకాలు పునరుద్ధరిస్తాం’ అని అచ్చెన్నాయుడు ప్రకటించారు.
టూరిజం హబ్‌గా ఏపీ
పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, జూన్14(ఆంధ్రజ్యోతి): ‘వైజాగ్ అందమైన లొకేషన్. అక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. మా పార్టీ అధ్యక్షుడు పవన్ ఎలాగూ పెద్ద స్టార్. వారి అభిప్రాయాలు తీసుకుని అభివృద్ధి చేస్తాం’ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల పరీవాహక ప్రాంతాలు, కోనసీమ వంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ వనరులు లేని గుజరాత్, రాజస్థాన్ వంటివి టూరిజం హబ్‌గా తయారయ్యాయి. మనం దృష్టిపెడితే ఆంధ్ర అన్నిటికంటే మంచి టూరిజం హబ్ అవుతుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా గత పుష్కరాల సమయంలో అఖండ గోదావరి ప్రాజెక్టును చంద్రబాబు అమల్లోకి తెచ్చారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రణాళిక రూపొందించి 2027లో వచ్చే పుష్కరాల నాటికి ఓ రూపం తెస్తాం’ అని దుర్గేష్ పేర్కొన్నారు.
ప్రతి పేదవాడికి సర్కారీ వైద్యం
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి సత్యకుమార్
అనంతపురం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వైద్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యశాఖలకు అంకితభావంతో సేవ చేస్తానని ఆ శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగు పరచడానికి కృషి చేస్తానని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, ఆస్పత్రుల్లో లోటుపాట్లను సరిదిద్ది, ప్రతి పేదవాడికి సర్కారీ వైద్యం అందేలా చేయడమే కర్తవ్యంగా పేర్కొన్నారు.
నాసిరకం మద్యం లేకుండా చేస్తా
ఎక్సైజ్, మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ(భవానీపురం), జూన్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి కీలక శాఖలు అప్పగించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని, రాష్ట్రంలో నూత న ఎక్సైజ్ పాలసీతో నాసిరకం మద్యం లేకుండా చేస్తానని ఎక్సైజ్, మైనింగ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక మాఫియాలు దోచుకున్నాయని చెప్పారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. గంజాయిని కూడా విచ్చలవిడిగా రవాణా చేయించారని ధ్వజమెత్తారు. ఇసుక నిలిపివేసి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని, లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టారని, ఇసుక దోపిడీతో కోట్లు దోచుకుని ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని తెలిపారు. వారి అవినీతి, అక్రమాలకు సహరించిన అధికారులపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో నూతన మద్యం పాలసీ నాసిరకం మద్యం లేకుండా చేస్తామన్నారు.
మరింత నిబద్ధతతో పనిచేస్తా
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా
ఒంగోలు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక శాఖను కేటాయించారని, శాఖల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అందుకే వెంటనే ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. ప్రజలు, పార్టీ, ప్రజా సమస్యల పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తామో ఇప్పటికే నిరూపించుకొని వరుస విజయాలు సాధించానని గుర్తుచేశారు. అంతకన్నా ఎక్కువగా పనిచేసి సీఎం నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్ర ప్రజల మద్దతు పొందుతానని తెలిపారు.
చేనేతకు పూర్వవైభవం తీసుకొస్తా
బీసీ సంక్షేమం, చేనేత, టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి సవిత
ధర్మవరం/పెనుకొండ టౌన్, జూన్ 14: వైసీపీ పాలనలో కుదేలైన చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తానని బీసీ సంక్షేమం, చేనేత, టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి సవిత అన్నారు. బీసీలను గౌరవించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. రాష్ట్రంలో 50శాతం ఉన్న బీసీలకు వైసీపీ పాలనలో జగన్ మొండిచేయి చూపారని విమర్శించారు. బీసీ వర్గాల విద్య, వ్యాపార, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బీసీలకు ప్రత్యేక చట్టం త్వరలోనే కార్యాచరణ దాల్చుతుందని, జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధి, ఉన్నత చదువులకు చేదోడుగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రాంతాలవారీగా చేనేతల సమస్యలు తెలుసుకుని, వారికి పథకాలు వర్తింపజేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
రోడ్ల బాగుకు నెలలో రూట్ మ్యాప్
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ రోడ్లన్నీ ఇప్పుడు బాగు చేయాలి. స్పష్టమైన ప్రణాళికతో ముందుకువెళ్తాం. అందుకోసం నెల రోజుల్లో రూట్‌మ్యాప్ ప్లాన్ చేస్తాం’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని చెప్పారు. పోర్టుల అభివృద్ధికి కృషి చేసి పెట్టుబడులను విరివిగా తీసుకొస్తామని, అందుకోసం ప్రత్యేకమైన ప్రణాళికను నెలరోజుల్లో రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రహదారులకు ఉండాల్సిన బడ్జెట్‌ను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
మైనారిటీలకు న్యాయం చేస్తా
మైనారిటీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు నాపై నమ్మకం ఉంచి మైనారిటీ శాఖ కేటాయించినందుకు ఆనందంగా ఉంది. గతంలో కూడా మైనారిటీ శాఖ మంత్రిగా చేశాను. దీనిపై పూర్తి అవగాహన ఉంది. టీడీపీ హామీ ఇచ్చిన విధంగానే వారి సంక్షేమం కోసం పాటుపడతాను. మా అధినేత చెప్పిన విధంగానే 4 శాతం రిజర్వేషన్ గురించి కూడా కృషి చేస్తాం. బీజేపీతో పొత్తు ఉన్నా, మైనారిటీలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాం. ఇక న్యాయశాఖపై పూర్తి అవగాహన లేదు. వాటికి సంబంధించిన అంశాలను క్షుణ్నంగా తెలుసుకుంటాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, అవసరమైన మేర న్యాయం చేసేందుకు సహకరిస్తాం’ అని మైనారిటీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం
ఎంఎ్‌సఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
మంత్రిగా అవకాశం కల్పించి నాకు అప్పగించిన శాఖల ద్వారా ప్రజలకు న్యాయం చేస్తా. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తా. నాకు కేటాయించిన మంత్రి పదవిపై సంతృప్తిగా ఉంది. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తాం.
కార్మికులకు అండగా ఉంటాం
మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి(ఆంధ్రజ్యోతి)/ రామచంద్రపురం (ద్రాక్షారామ), జూన్ 14: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కార్మికుల సంక్షేమానికి అమలు చేసిన అన్ని పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పునరుద్ధరణకు కృషి చేస్తానని కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో కార్మికుల సంక్షేమం మూలనపడింది. ముఖ్యంగా భవన నిర్మాణరంగ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు నిలిపివేసింది. అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వారు కీలకపాత్ర పోషించారు. గతంలో చంద్రన్న బీమాతో కుటుంబా లకు భరోసా కల్పించాం సాధారణ మరణానికి 30 వేలు, రోడ్డు ప్రమాదంలో మరణాలకు రూ.5లక్షల వరకూ బీమా సౌకర్యం ఉండేది. ఆ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది’ అని సుభాష్ మండిపడ్డారు. ఈఎస్‌ఐను అభివృద్ధి చేసి, కార్మికుల కోసం మరిన్ని ఆస్పత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు కార్మికులకు అండగా ఉంటామన్నారు.
Updated Date - Jun 15 , 2024 | 06:20 AM