పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్’
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:25 AM
రేణిగుంట ఎయిర్‌పోర్టు పక్కనే 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు కొలువుతీరాయి. ఆ భూమి మధ్యలో 20.5 ఎకరాల అసైన్డ్ పొలం ఉంది.
భార్య స్వర్ణలత పేరిట 20 ఎకరాలు రేణిగుంట ఎయిర్‌పోర్టు పక్కనే కొనుగోలు
మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే
2022 సెప్టెంబరులో వ్యవహారం
చుట్టూ 100 ఎకరాల ప్రభుత్వ భూములు
దాని మధ్యలోనే అసైన్డ్ భూమి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రేణిగుంట ఎయిర్‌పోర్టు పక్కనే 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు కొలువుతీరాయి. ఆ భూమి మధ్యలో 20.5 ఎకరాల అసైన్డ్ పొలం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట ఇప్పుడు ఆ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటే. రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేశారు. ఇప్పుడు దాని గురించి తమకు ఏమీ తెలియదంటున్నారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలో 20 ఎకరాల అసైన్డ్ భూమి ఎలా వచ్చి చేరింది? అది పెద్దిరెడ్డి ఇంటి పేరిట ఎలా మారింది? అంతా పరమ రహస్యం. నాటి తిరుపతి జిల్లా కలెక్టర్ కు, జిల్లా రెవెన్యూ అధికారులకే తెలిసిన రహస్యం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పేడు మండలంలో వికృతమాల గ్రామం ఉంది. ఇది రేణిగుంట ఎయిర్‌పోర్టు పక్కనే ఉంది. ఎయిర్‌పోర్టు భూములు, వికృతమాల భూములు పక్కపక్కనే ఉన్నాయి. వికృతమాల గ్రామ పరిధిలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలకు భూములు కేటాయించారు. అక్కడ కంపెనీల ఆఫీసులు ఏర్పాటయ్యాయి. దానిపక్కనే 524-1 సర్వే నంబరులో 2.5 ఎకరాల భూమిని 2022లో పెద్దిరెడ్డి స్వర్ణలత కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక 2022 సెప్టెంబరులో ఆ భూమి మ్యుటేషన్ చేశారు. 533, 534, 535, 536, 537 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో అనూహ్యంగా అసైన్డ్ భూమి పుట్టుకొచ్చింది. 533 సర్వే నంబర్‌లో 5 ఎకరాలు (2007)లో, 534లో 5 ఎకరాలు 2005లో అసైన్ చేసినట్లుగా రికార్డులు తెరమీదకు తీసుకొచ్చారు. ఈ రెండు సర్వే నంబర్లలోని 10 ఎకరాల భూమి 2022 సెప్టెంబరులోనే స్వర్ణలత పేరిట మ్యుటేషన్ చేశారు. ఆ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 535 నంబర్‌లో 5.1 ఎకరాల ప్రైవేటు భూమి ఉన్నట్లుగా, దాన్ని కూడా పెద్దిరెడ్డి కొనుగోలు చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి. చుట్టూ ప్రభుత్వ భూమి, దాని మధ్యలో ప్రైవేటు భూమి ఉంది. ఇది ఎలా వచ్చిందో ఇక్కడ మిస్ అయిన లాజిక్. అయినా సరే పెద్దిరెడ్డి కొన్నారు.
ఆయన భార్య స్వర్ణలత పేరిట రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేశారు. ఆ వెంటనే మరో మూడు సర్వే నంబర్లలో 536-1లో 2.86 ఎకరాలు, 537లో 5.1 ఎకరాలు, 537-1లో 2.14 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు తెరమీదకు తీసుకొచ్చారు. ఆ మూడు సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని 2022 సెప్టెంబరులో పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట మ్యుటేషన్ చే శారు. అంటే... వికృతమాలలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్వే నంబరును మార్చి సబ్ డివిజన్ చేసి బిట్లుబిట్లుగా చేశారు. ప్రైవేటు, అసైన్డ్ భూములకు ఖాతా నంబరు (2414) ఒక్కటే. కానీ సర్వే నంబర్లు వేరుచేశారు. మొత్తం 27.7 ఎకరాల భూమి మ్యుటేషన్ చేశారు. ఇందులో 524-1 అనేది ప్రైవేటు భూమి అనుకున్నా, మిగతావన్నీ ప్రభుత్వం సేకరించి రిజర్వ్ చేసుకున్న భూములు. 533 సర్వే నంబర్‌లో అసైన్డ్ భూమిని చూపించడమే పెద్ద ట్విస్ట్. ఇదెలా సాధ్యపడింది? పైగా అసైన్డ్ భూముల మధ్య మరో 5.1 ఎక రాల భూమి ప్రైవేటుదని చూపించారు. ఇదెలా సాధ్యమైంది? మొత్తం 100 ఎకరాలు రిజర్వ్ చేసుకున్న దాంట్లో 20 ఎకరాలు అసైన్డ్ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి పేరిట అసైన్డ్ చేశారో రెవెన్యూ శాఖ హడావుడిగా ఏవో కొన్ని రికార్డులు తెరమీదకు తీసుకొచ్చింది. అంతే.. ఆ మొత్తం భూమి కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక పెద్దిరెడ్డి హస్తగతమయ్యాయి. నాటి తిరుపతి కలెక్టర్ ఆ భూములను 22(ఏ) నుంచి తొలగించడం, వెంటనే రెవెన్యూ అధికారులు వాటికి మ్యుటేషన్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ భూమిని పెద్దిరెడ్డి కోరుకున్నారని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో అసైన్డ్ భూమిని పుట్టించారా? లేక అధికార బలంతో ఆ భూములను దక్కించుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఇంతకుముందు ఇదే వికృతమాల గ్రామంలో ఇనాం భూమి పేరిట 120 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పెద్దలు ప్రయత్నించగా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు భూమి చేతులు మారిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.
పెద్దిరెడ్డి ఎన్నిక రద్దు చేయండి
హైకోర్టులో బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్
ఆయన భార్యకు 142 ఆస్తులున్నాయి
అఫిడవిట్‌లో వాటిని ప్రస్తావించలేదు
టీడీపీ అభ్యర్థిని కూడా ప్రతివాదిగా చేర్చాలని న్యాయమూర్తి ఆదేశం
విచారణ ఈ నెల 31కి వాయిదా
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణికి సంబంధించిన 142 ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదని తెలిపారు. బుధవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని ప్రతివాదుల జాబితాలో చేర్చకపోవడంపై అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ఆయనకు ఉందని.. ఆయన్ను ప్రతివాదిగా చేర్చాలని సూచించారు. మరోవైపు పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తన సతీమణికి చెందిన 142 ఆస్తులు వివరాలను ప్రకటించలేదన్న వాదనను ధ్రువీకరిస్తూ.. సివిల్ ప్రొసీజర్ కోడ్‌కు అనుగుణంగా ఆస్తుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
Updated Date - Jul 25 , 2024 | 04:25 AM