జేసీబీతో ఇల్లు కూల్చేశారు!
ABN, Publish Date - Oct 20 , 2024 | 04:02 AM
జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, వారి అనుచరులు చేసిన దౌర్జన్యాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ నేతల దాష్టీకాలపై ఫిర్యాదుల వెల్లువ
టీడీపీ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి సుభాశ్
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, వారి అనుచరులు చేసిన దౌర్జన్యాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిష్వత్ అర్జీలు స్వీకరించారు. స్థలం విషయంలో కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా ఉన్నా.. అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు వందమంది తమ ఇంటిపై దాడి చేసి, తమను కొట్టి జేసీబీతో ఇంటిని, కొట్టును ధ్వంసం చేశారని వినుకొండకు చెందిన కామా వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు రాత్రికి రాత్రే దౌర్జన్యంగా తమ పొలంలో వరి పంటను కోసుకుపోయారని కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడేనికి చెందిన వేమూరి రామారావు, వేమూరి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
అప్పట్లోనే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తీసుకోలేదని వాపోయారు. 2019 ఎన్నికల్లో తాను టీడీపీ ఏజెంట్‌గా పోలింగ్ బూత్‌లో కూర్చున్నందుకు.. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తనపై కక్ష గట్టి, ఇబ్బందులకు గురి చేశారని, పోలీసులతో భయపెట్టారని, బిల్లులు రాకుండా అడ్డుకున్నారని కడప జిల్లా చాపాడు మండలం ఎన్.అనంతపురం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి వాపోయారు. తన పొలంలో పంటను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని తెలిపారు.
గత జగన్ ప్రభుత్వం దివ్యాంగులమైన తమను తాడేపల్లిగూడెం హార్టికల్చర్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలకు పిలిచి.. తర్వాత ఏ సమాచారం ఇవ్వలేదని, వైసీపీకి అనుకూలమైనవారికి ఉద్యోగాలు ఇచ్చి.. తమకు తీరని అన్యాయం చేసిందని వాపోతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన దివ్యాంగుడు ఎన్.నరేష్ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కూడా అర్జీ ఇచ్చారు. ఇంకా అనేకమంది అర్జీలు సమర్పించగా, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.
Updated Date - Oct 20 , 2024 | 04:02 AM