రాడ్లు, కొడవళ్లతో వైసీపీ మూకల దాడి
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:00 AM
వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలీసుల ఎదుటే టీడీపీ నాయకులపై రాడ్లు, కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశాయి. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు టీడీపీ నాయకులకు గాయాలు
ఒకరి పరిస్థితి విషమం.. పోలీసుల ప్రేక్షకపాత్ర
అనంతపురం జిల్లాలో ఘటన
బత్తలపల్లి, సెప్టెంబరు 15: వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలీసుల ఎదుటే టీడీపీ నాయకులపై రాడ్లు, కొడవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశాయి. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటగారిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణ, వైసీపీ వర్గీయుడు శ్రీనివాసులుకు మధ్య పశువుల దొడ్డికి సంబంధించిన స్థల వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం లక్ష్మీనారాయణ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా శ్రీనివాసులు దాడి చేశాడు. అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం లక్ష్మీనారాయణ స్థలంలో శుభ్రం చేసేందుకు ఎక్స్‌కవేటర్‌ను తెప్పించాడు. శ్రీనివాసులు, అతని తమ్ముడు, వైద్యశాఖ ఉద్యోగి అయిన హరి, వెంకటరాముడు, అప్పస్వామి..మరికొందరు రాడ్లు, కొడవళ్లతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా వచ్చారు. అయినా లక్ష్మీనారాయణపై వైసీపీ నాయకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. అడ్డుగా వెళ్లిన అతడి కుమారుడు అభిలాష్, సుధాకర్‌పైనా దాడి చేశారు. దీంతో వారు కూడా గాయపడ్డారు. వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మీనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
Updated Date - Sep 16 , 2024 | 03:00 AM