ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mangalagiri Police : నందిగం సురేశ్‌ అరెస్టు

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:10 AM

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఆయనను గురువారం హైదరాబాద్‌లో వెంబడించి మంగళగిరి రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు.

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి

  • అరెస్టు సమయంలో హైడ్రామా

  • పారిపోయేందుకు సురేశ్‌ విఫలయత్నం

  • ఔటరు రింగ్‌ రోడ్‌లో చేజ్‌ చేసి పట్టుకున్న పోలీస్‌

  • హైదరాబాద్‌లో పట్టుకుని మంగళగిరికి తరలింపు

  • 2 వారాల రిమాండ్‌.. గుంటూరు జైలుకు

  • ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరి అరెస్టు

  • అప్పిరెడ్డి, అవినాశ్‌, తలశిల సహా

  • 12 మంది కోసం ముమ్మర వేట

  • అప్పిరెడ్డి అరెస్టుపై రోజంతా డైలామా

  • బెంగళూరులో అరెస్టు అంటూ వైసీపీ ప్రచారం

  • ఆ వదంతుల్ని తోసిపుచ్చిన పోలీసు వర్గాలు

మంగళగిరి సిటీ, సెప్టెంబరు 5: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఆయనను గురువారం హైదరాబాద్‌లో వెంబడించి మంగళగిరి రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌తోపాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇదే కేసులో సురేశ్‌ను అరెస్టు చేశారు. మరో వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారని, ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారని ఉదయం నుంచి వైసీపీ వర్గాలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. కానీ, అప్పిరెడ్డి అరెస్టు వార్త నిజం కాదని, తమ పోలీసులు బెంగళూరుకే వెళ్లలేదని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు.

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ నందిగం సురేశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌, తలశిల రఘురాం సహా 14 మంది వేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసిన వెంటనే, వారందరి అరెస్టుల కోసం పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వేట ప్రారంభించారు. ఈ క్రమంలో సురేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు రాజధానిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసానికి పోలీ సులు వెళ్లారు. అక్కడే కొద్దిసేపు వేచి ఉన్న పోలీసులు సురేశ్‌ అక్కడ లేరని ధ్రువీకరించుకుని వెనుదిరిగారు.

అరెస్టు భయంతో సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారు. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆయన పారిపోయేందుకు యత్నిస్తున్నారనే పక్కా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సురేశ్‌ను పట్టుకునేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ పర్యవేక్షణలో 12 బృందాలు రంగంలోకి దిగాయి. సురేశ్‌ వాహనాన్ని వెంబడించి హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు శివారులో బుధవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సురేశ్‌ను గురువారం ఉదయం మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు.


స్టేషన్‌లో పోలీసులు సురేశ్‌ను కొద్దిసేపు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను కూడా వెళ్లానని, అయితే అది సరైన విధానంకాదని భావించి వెనక్కి వచ్చేశానని సురేశ్‌ తెలిపినట్టుగా పోలీసులు వెల్లడించారు. అంతకు మించి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని, సంబంధిత పత్రాలపై సంతకాలు చేసేందుకు కూడా నిరాకరించారని పోలీసులు తెలిపారు.

కాగా, నందిగం సురేశ్‌ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని హడావుడి చేశారు. దీంతో అక్కడి మంగళగిరి తాలూకా ప్రాంగణ ప్రధానద్వారాన్ని పోలీసులు మూసివేశారు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు నేతలు సురేశ్‌ను పరామర్శించేందుకు వచ్చారు. గురువారం సాయంత్రం సురేశ్‌ను మంగళగిరి కోర్టులో హాజరు పర్చగా, న్యాయమూర్తి 2వారాలపాటు రిమాండు విధించారు. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా కేసుకు తరలించారు. ఈ కేసులో విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిను ఇప్పటికే అరెస్టు చేశారు.

  • ఆ 14 మంది వీరే....

1)లేళ్ల అప్పిరెడ్డి 2)నందిగం సురేశ్‌ 3) తలశిల రఘురాం 4) దేవినేని అవినాశ్‌ 5)కార్పొరేటర్‌ గేదెల రమేశ్‌ 6)ఒగ్గు గవాస్కర్‌ 7)చింతాబత్తిని వినోద్‌ 8)రబ్బాని 9)చింతాబత్తిని వినోద్‌ 10) ఎన్‌ జగదీశ్‌ 11) అవుతు శ్రీనివాసరెడ్డి 12) బండారు ఆంజనేయులు 13) శనగశెట్టి హరిబాబు 14) షేక్‌ అమితాబ్‌.

  • మరో 68 మంది బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు

ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 68 మంది గుంటూరు జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ ఇప్పటికే పూర్తయింది. శుక్రవారం జిల్లా కోర్టులో వారి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Updated Date - Sep 06 , 2024 | 04:10 AM

Advertising
Advertising