బీసీజీ టీకా సురక్షితం
ABN, Publish Date - Jun 13 , 2024 | 11:31 PM
క్షయ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ టీబీ ముక్త్‌భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సంబేపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారి మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సంబేపల్లె వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్‌రెడ్డి
సంబేపల్లె, జూన్ 13: క్షయ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ టీబీ ముక్త్‌భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సంబేపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారి మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ వయోజనుల బీసీజీ టీకా సురక్షితమని, ఎటువంటి అపోహలు లేవని, ప్రతిఒక్కరూ తప్పకుండా టీకా వేయించుకుని క్షయవ్యాధి నుంచి విముక్తి పొందాలని ఆయన పేర్కొన్నారు. క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా వయోజనులకు బీసీజీ టీకా కార్యక్రమం ప్రతి గురువారం అన్ని సబ్ సెంటర్లలోనూ, విలేజ్ క్లీనిక్‌లో వేస్తారని ఆయన తెలిపారు. ఈ టీకాపైన ఎటువంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదన్నారు.
ఈ లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా వేయించుకోవాలి
కింది లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ బీసీజీ టీకాలు వేయించుకోవాలని టీబీ యూనిట్ సూపర్‌వైజర్ నాగేశ్వర తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో టీబీ వచ్చి తగ్గిపోయిన వాళ్లు తప్పకుండా టీకాలు వేయించుకోవాలన్నారు. అదే విధంగా 18 ఏళ్లు నిండిన వారు, పొగతాగేవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, శరీర ద్రవ్యరాశి సూచిక 18 కన్నా తక్కువ ఉన్న వారు, టీబీ రోగులతో సన్నిహితంగా ఉండేవారు ఈ బీసీజీ టీకాలను తప్పకుండా వేయించుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు సమ్మతి పత్రం చదివి వినిపించి వారి సంతకం తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేసిన చోట బొబ్బ గానీ, మచ్చగానీ ఏర్పడినా.. భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
ఈ ప్రమాణాలు పాటించే వారికి టీకా వద్దు
టీబీ వ్యాధి ఉండి టీబీ ముందులు వాడుతున్న వాళ్లు ఈ బీసీజీ టీకాను వేయించుకోరాదని వైద్యాధికారి తెలిపారు. అంతేగాకుండా గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు, హెచ్‌ఐవీ రోగులు, ఎయిడ్స్ రోగులు ఈ టీకాను తీసుకోవద్దని తెలిపారు. వ్యాక్సిన్ వేసినప్పుడు రియాక్షన్స్ వచ్చిన వాళ్లు, కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుని మందులు వాడుతున్న వాళ్లు ఈ టీకాకు దూరంగా ఉండాలన్నారు. అంతేగాకుండా 18 సంవత్సరాలు నిండని వారు, రక్తదానం చేసిన మూడు నెలల వరకు ఈ టీకా జోలికి వెళ్లరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబేపల్లె పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
క్షయ వ్యాధి అనగా
క్షయ మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే అంటువ్యాధి. ఈ వ్యాధి స్త్రీ, పురుషులకు వయస్సులతో సంబంధం లేకుండా వస్తుంది. ఈ వ్యాధి శరీరంలోని ఏ అవయవానికి అయినా రావచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి ఊపిరితిత్తులకు ఎక్కువుగా సోకుతుంది. క్షయ వ్యాధి రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్షయ క్రిములు గాలిలో తుంపర్లుగా వెళ్తాయి. ఈ తుంప్లను ఆరోగ్యవంతుడు పీల్చినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి నివారణకు పుట్టిన పసిబిడ్డలకు బీసీజీ టీకాలు ఇప్పించాలి. క్షయ రోగి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయరాదు. క్షయ రోగులు మందులు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ మందులు ఆపకూడదు.
క్షయ వ్యాధితో అప్రమత్తంగా ఉండాలి
- మధుసూదన్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి
క్షయవ్యాధితో అప్ర మత్తంగా ఉండాలి, దీనికి చిన్న, పెద్ద, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. క్షయ వ్యాధి వలన ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. ఇతర వ్యాధుల మాదిరిగా సీజనల్ వ్యాధి కాదు. ఈ వ్యాధి అంత ర్జాతీయ విపత్తుగా మారింది. క్షయవ్యాధి అదుపు చేసేందుకు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
Updated Date - Jun 13 , 2024 | 11:31 PM