ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెజవాడ గజగజ

ABN, Publish Date - Sep 02 , 2024 | 05:09 AM

ఊరూ ఏరూ ఏకమయ్యాయి. కనుచూపు మేరా నీరే విస్తరించింది. బుడమేరు కన్నెర్ర చేసింది. ‘బెజవాడ దుఃఖదాయిని’ అనే పేరును చాలా దశాబ్దాల తర్వాత గుర్తు చేసింది.

బుడమేరు బీభత్సం నగరంపై జలఖడ్గం

ఊరూ ఏరూ ఏకమయ్యాయి. కనుచూపు మేరా నీరే విస్తరించింది. బుడమేరు కన్నెర్ర చేసింది. ‘బెజవాడ దుఃఖదాయిని’ అనే పేరును చాలా దశాబ్దాల తర్వాత గుర్తు చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. లక్షలాదిమందిని వరద బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం... ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది.

వాయుగుండ ప్రభావంతో గురువారం రాత్రి నుంచే చిటపట చినుకులు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఏకాధాటిగా కురిసిన కుండపోతకు విజయవాడ జలవాడగా మారింది. శనివారం సాయంత్రానికి వర్షం ఉపశమించడంతో... నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది. అంతలోనే... నేనున్నానంటూ బుడమేరు పొంగి పొర్లింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్నా పెద్ద వాగులను కలుపుకొని పూనకమొచ్చినట్లుగా విరుచుకుపడింది. అప్పటికే కృష్ణమ్మ భారీగా ప్రవహిస్తుండటంతో.. బుడమేరు చానల్‌ నుంచి నదిలోకి నీరు కలిసే అవకాశం లేకపోయింది. పైగా... కృష్ణా నది నీరు కూడా ఎగదన్నింది. దీనికి తోడు.. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారిలేకుండా పోయింది. దీంతో... బుడమేరు కట్టలు తెంచుకున్నట్లుగా చెలరేగిపోయింది. ఆదివారం ఉదయం నుంచే బెజవాడలో మెల్లగా ముంపు మొదలైంది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది.

అజిత్‌సింగ్‌ నగర్‌, పాయకాపురం ప్రాంతాలను 8 అడుగుల మేరకు ముంచెత్తింది. జక్కంపూడి కాలనీ, అయోధ్య నగర్‌, ఓల్డ్‌ రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, చిట్టినగర్‌ తదితర ప్రాంతాలు అయిదు నుంచి 8 అడుగుల మేరకు నీటిలో మునిగిపోయాయి. జక్కంపూడిలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు మొదటి అంతస్తు వరకు మునిగిపోయాయి. బుడమేరు ఈస్థాయిలో దండెత్తడం మాత్రం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఇక... మున్నేరు వాగు పొంగడంతో విజయవాడ - హైదరాబాద్‌ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారి ప్రాంతం ఓ మోస్తరు జలాశయాన్ని తలపిస్తోంది. దీంతో హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను చిల్లకల్లు వద్ద, విజయవాడ వైపు నుంచి వెళ్లే వాహనాలను కీసర వద్ద నిలిపివేశారు. 2009 తర్వాత కృష్ణమ్మ మరోసారి భీకరావతారం దాల్చింది. ఆదివారం రాత్రికే ప్రకాశం బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. తెల్లవారేసరికి ఇది మరింత పెరిగే అవకాశముంది. ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తక్షణ సహాయ చర్యలు తీసుకుంటోంది.

Updated Date - Sep 02 , 2024 | 05:09 AM

Advertising
Advertising