తమ్ముళ్లూ.. ఇది తగదు!
ABN, Publish Date - Oct 08 , 2024 | 05:08 AM
ఐదేళ్లుగా ఆకలితో ఉన్నారు కాబోలు! అధికారంలోకి వచ్చీ రాగానే ‘తినడం’ మొదలుపెట్టారు. ఆదాయ మార్గాలు వెతుక్కుని మరీ దందాలకు దిగుతున్నారు.
దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు
ఐదేళ్లుగా ఆకలితో ఉన్నారు కాబోలు! అధికారంలోకి వచ్చీ రాగానే ‘తినడం’ మొదలుపెట్టారు. ఆదాయ మార్గాలు వెతుక్కుని మరీ దందాలకు దిగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పద్ధతిగానే ఉన్నప్పటికీ... కొందరు మాత్రం ‘వైసీపీకి నకళ్లు’గా మారారు. పనులు జరగాలంటే, పోస్టింగ్‌లు కావాలంటే ముడుపులు, వెంచరు వేయాలంటే వాటాలు... ఇలా రకరకాలుగా మింగేస్తున్నారు.
ప్రతి పనిలోనూ వాటా
వైసీపీకి కంచుకోటలాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ ఎమ్మెల్యే అపహాస్యం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ నీకెంత? నాకెంత? తేల్చాలంటున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు బార్‌లను కూడా ఆ ఎమ్మెల్యే వదలడం లేదు. కడపలో ఓ లిక్కర్ కింగ్‌కు చెందిన రెండు బార్‌లను జూలై నెలలో లాక్కుని... ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటూ ఇద్దరు నేతలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ ఇద్దరు గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇక సదరు నేత తన నియోజకవర్గంలో ఆగమేఘాలపై రేషన్ షాపుల మార్పిడి చేపట్టారు. సొంత కార్యకర్తలు, అనుచరులకు ఆ షాపులు ఇవ్వడానికి 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కడప నగరంలో ఓ భూ వివాదంలో తలదూర్చి 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారట. ఆ ఎమ్మెల్యే నోటికి అడ్డూ అదుపూ లేదు. అధికారులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. గతంలో వైసీపీ నేతలు సంపాదించుకున్నారు.. ఇప్పుడు తాము సంపాదించుకోవాలన్నదే సదరు ప్రజాప్రతినిధి విధానం. ఇది పద్ధతి కాదు కదా అని సన్నిహితులు, సొంత పార్టీ వాళ్లు ప్రశ్నిస్తే... ‘మీదేం పోయింది. మేం సంపాదించుకోవద్దా? మేం బాగుపడొద్దా? మళ్లీ ఎన్నికల ఖర్చులకు డబ్బు ఉండొద్దా?’ అని విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే తీరుతో జనం విస్తుపోతున్నారు.
కమీషన్లు, ముడుపులు, దందాలతో దడ
పోస్టింగ్‌లకు రేటు.. వెంచర్లలో కమీషన్లు
విచ్చలవిడి అవినీతి, అక్రమాలకు వత్తాసు
అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే
కొందరి తీరుపై అప్పుడే జనంలో ఆగ్రహం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటింది! కానీ... కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు. ‘మేం చేసిందే శాసనం. అధికారులు మేం చెప్పినట్లు వినాలి. మా మాట దాటితే వేటు పడుద్ది’.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు, ఆస్తులు, ఉద్యోగుల పోస్టింగ్‌లవంటి అంశాల్లో వేలు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మరీ బరితెగింపు కనిపిస్తోంది. ‘మంచి అవకాశం... మించిన దొరకదు’ అన్నట్లుగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ‘‘వైసీపీ వాళ్లు అడ్డగోలుగా మింగలేదా? మేమూ సంపాదించుకోవద్దా? వచ్చే ఎన్నికల్లో ఖర్చులకు కావొద్దా’ అంటూ తమ దందాలను సమర్థించుకునే వారూ ఉన్నారు.
సకుటుంబ పంజా
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో గొడవలతో రాటుదేలిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ పాలన సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధి, ఆయన భార్య, కొడుకు దందాలు చేస్తున్నారు. తొలుత ఎమ్మెల్యే భార్య అన్నీ తానై వ్యవహరించారు. అధికారులు, ఉద్యోగులను ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలవడం, ఇంటి గేటు బయటే నిలబెట్టి దూషించేవారని ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు, ద్వితీయ, తృతీయశ్రేణి అధికారులను విభాగాల వారీగా పిలిచి మీటింగ్‌లు పెట్టారు. ఏ అధికారికి ఎంత జీతం వస్తుంది? పై ఆదాయం ఎంత వస్తుంది? ఇప్పటిదాకా ఎంత సంపాదించారు? ఎక్కడె క్కడ ఆస్తులున్నాయి? వంటి వివరాలు తెలుసుకున్నారు. ప్రైవేటుగా వచ్చే ఆదాయంలో 50 శాతం ఇవ్వాలని ఒప్పందాలు చేసుకున్నారు. వారిలో రెవెన్యూ, పురపాలక అధికారులే ఎక్కువగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు ఏ పనికి ఎంత ముట్టజెప్పారో తమకు అంతకు రెట్టింపు ఇవ్వాలని, లేదంటే జిల్లా దాటిస్తామని హెచ్చరికలు చేశారు. రెవెన్యూ అధికారులకు నెలవారీ టార్గెట్‌లు పెట్టారు. ఆర్డీఓ, తహసీల్దార్, డీటీ, మండల సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్‌ఓలు నెలవారీ టార్గెట్‌లు పూర్తిచేయాలి. లేదంటే ఎమ్మెల్యే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. బదిలీకి సిఫారసు లేఖను వాట్సప్‌లో పంపిస్తారు. ఇప్పుడు బదిలీల ప్రక్రియ సాగుతుండటంతో రెవెన్యూ ఉద్యోగులకు రేట్లు ఫిక్స్ చేశారు. ప్రతి వీఆర్‌ఓ 5 లక్షలు, ఆర్‌ఐ 10 లక్షలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఆయా పోస్టుల్లో ఉన్నవారే కొనసాగాలంటే ఈ ధర. కొత్తవారు రావాలంటే అంతకు రెట్టింపు సమర్పించుకోవాలి. డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ పోస్టులకు రూ.25 లక్షలు ఫిక్స్ చేశారు. తహసీల్దార్ పోస్టుకు కనీసం కోటిన్నర. కీలక భూములున్న మండలాన్ని బట్టి మూడు కోట్ల వరకు సమర్పించుకునేలా షరతు పెట్టారు. తమ దగ్గర అంత డబ్బు లేదన్న అధికారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముందుగా సగం పేమెంట్ చేయాలి. మిగతాది ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లిస్తానని రాసివ్వాలి. ఇలా ఐదు మండలాల్లోని రెవెన్యూ పోస్టులకు వేలం ప్రక్రియను ముగించేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఏ భూములను కాపాడాలని పోరాటం చేశారో, ఇప్పుడు అవే భూముల్లో జెండాలు పాతారు. గతంలో తన అరాచకాలకు సహకరించలేదన్న కసితో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేయడం, బెదిరింపులకు దిగడం నిత్యకృత్యంగా మారింది. భూ బాధితులు తమ కష్టాన్ని చెప్పుకొంటే, ఆయన వారసుడు ఫలానా అధికారి డబ్బు అడుగుతున్నారంటూ బాధితుల నుంచే దండుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి.
నోటికి అడ్డే లేదు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఓ ఎమ్మెల్యే సీనియర్ నేత కుమారుడు. ఆయన తండ్రికి మంచి పేరుంది. కానీ ఆయన వారసుడిగా వచ్చిన ఈయన పూర్తిగా విరుద్ధం. అధికారులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అన్న తేడా లేకుండా నోరు పారేసుకుంటున్నారు. నోరు తెరిస్తే చాలు బూతులే. తనకు ఎవరూ ఎదురు చెప్పకూడదని, తను చెప్పిందే వేదంగా అమలు చేయాలంటారు. కాదు కూడదంటే గ్రూప్-1 అధికారికి అయినా తిట్లు తప్పవు. సదరు ప్రజాప్రతినిధికి ప్రజాసేవకన్నా డబ్బుమీదే ధ్యాస ఎక్కువ. తనను కలవాలన్నా, ఏదైనా పనిమీద సిఫారసు లేఖ ఇవ్వాలన్నా, లేఖతో పాటు ఫోన్ చేయాలన్నా సొమ్ము సమర్పించుకోవాల్సిందే. ప్రజలైనా, అధికారులైనా ముడుపులు ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యేను కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ ఇవ్వరు. తొలుత ఆయన అనుచరుడిని కలిసి మాట్లాడుకోవాలి. ఆయనకు కొంత సమర్పించుకోవాలి. ఆయన ఒకే అన్న తర్వాతే ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్తారు. ఏదైనా పనిమీద ఎమ్మెల్యే లేఖ రాయడానికి ఒక రేటు ఉంటుంది. లేఖతో పాటు సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఫలానా వారు వస్తారని, పనిచేయాలని చెప్పడానికి డబుల్ రేటు. అంతేగాక ఎమ్మెల్యే ఆ పని మీద ప్రభుత్వ ఆఫీసుకు రావాలంటే అందుకు భారీగానే సమర్పించుకోవాలి. ఇప్పటికే పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సదరు నేత అంటేనే అధికారులు హడలిపోతున్నారు. ఇక బదిలీల్లో రెవెన్యూ ఉద్యోగులను బంతాడుకుంటున్నారు. ఒకే పోస్టుకు నలుగురిని సిఫారసు చేసి, ఆ నలుగురి దగ్గరా వసూలు చేస్తారు. ఆ పోస్టు ఎవ రికి ఇవ్వాలో తెలియక పైఅధికారులు అయోమయంలో పడుతున్నారు.
లిటిగేషన్ మాంగర్
ఏదో మార్పు తెస్తారనే ఆశతో రాయలసీమ ప్రజలు సాధారణ ఎన్నికల ముందు ఓ నాయకుడికి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. ఆయన మాత్రం సొంతంగా ఎదిగేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నారు. కడప జిల్లా పరిధిలోని పరిశ్రమలు, విద్యాసంస్థలు, గనుల లీజులపై నిరంతరం పిటిషన్‌లు వేయడం, యాజమాన్యాలను బెదిరించి సెటిల్‌మెంట్ చేసుకోవడం దినచర్యగా పనిచేస్తున్నారు. దీంతో ఆయన్ను లిటిగేషన్ మాంగర్‌గా పిలుస్తున్నారు. సదరు నేతకు ప్రజలు, వ్యాపారవేత్తలు, పార్టీలు అన్న తేడా ఉండదు. సొంతపార్టీ వారిపై కూడా పిటిషన్లు పెట్టి వేధించడం సర్వసాధారణం. గనుల లీజుదారులు, మైనింగ్ కంపెనీలపై ఇటీవలి కాలంలో వరుసగా పిటిషన్‌లు పెట్టారు. అవి వర్కవుట్ కాకపోవడంతో ఊరు పేరు లేని సంస్థలతో పిటిషన్లు పెట్టించి వేధించడం ప్రారంభించారని తెలిసిన వారు చెబుతున్నారు. ప్రభుత్వానికి వేలకోట్ల ఆదాయం తీసుకొస్తున్న మంగంపేట బెరైటీ్‌సను కూడా ఆయన వదల్లేదు. అక్కడ మైనింగ్, ప్రాసెసింగ్‌లో ఉన్న లీజుదారులు, కంపెనీలపై తరచుగా ప్రభుత్వానికి పిటిషన్‌లు ఇవ్వడం, వాటిని చూపి హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్‌కు పిలవడం నిత్యకృత్యంగా మారిందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ట్రిపుల్ ఐటీ, యోగి వేమన వర్సిటీలపై కూడా పిటిషన్లు పెట్టి డీల్ కుదుర్చుకున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
రియల్ వెంచర్లపై గురి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ ఎమ్మెల్యే సీనియర్. తెలుగుదేశం పార్టీలోనూ సీనియరే. గతంలో అధికార పార్టీ నాయకుడు అక్రమాలకు పాల్పడుతున్నారని, కంపెనీలను బెదిరించి తరిమేస్తున్నారంటూ పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దందాలకు తెరతీశారు. తన బంధుగణాన్ని అనంతపురం శివారు రియల్ వెంచర్లపై దింపారు. ఎన్నికలకు ముందు, తర్వాత వేసిన రియల్ వెంచర్ల యజమానులను పిలిచి సెటిల్ చేసుకోమంటున్నారు. భారీగా వెంచర్లు ఉండటంతో తన కుటుంబీకులను కూడా రంగంలోకి దింపారు. రియల్ వెంచర్ విస్తీర్ణం, బడ్జెట్ ఆధారంగా ఎంత సెటిల్‌మెంట్ చేయాలో ఎమ్మెల్యే కుటుంబం నిర్ణయిస్తుంది. వారు నిర్ణయించిన మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సెటిల్ చేసుకోవాలి. లేదంటే పనులు సాగనివ్వమంటూ హుకుం జారీ చేస్తారు.
మాఫియాకు వత్తాసు
గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రేషన్ మాఫియాతో దోస్తీ కట్టి, వారి దందాకు వత్తాసు పలుకుతున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు నెలకు 5 లక్షల చొప్పున బేటా ముడుతోంది. ఈ డీల్‌ను ఓ రేషన్ మాఫియా వ్యక్తి కుదిర్చారు. సదరు నేత ఎమ్మెల్యే అయిన వెంటనే గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న రేషన్ మాఫియా సభ్యులను సమావేశానికి పిలిచారు. ఎమ్మెల్యేకు వారు ఘనంగా సన్మానం చేసి తమ డిమాండ్‌ను ముందుంచారు. పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అటూ ఇటూ తరలిస్తూ అమ్ముకుంటామని, ఇందుకు తమకు సహకరించాలని మాఫియా కోరింది. వెంటనే ఎమ్మెల్యే ఓకే చెప్పారు. ఆయనకు నెలకు ఐదు లక్షలు ఇచ్చేలా డీల్ సెట్ అయింది. దీంతో గుంటూరు నుంచి రేషన్ మాఫియా యఽఽథేచ్ఛగా పేదల బియ్యాన్ని దారి మళ్లించి సొమ్ము చేసుకుంటోంది. ఇది టీడీపీలో బహిరంగ రహస్యమే.
ఆయన దేన్నీ వదలరు
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన. భూ కబ్జాలు, గొడవలు, దందాలు చేస్తారని పేరుంది. కూటమి ప్రభుత్వం రాగానే విజయవాడలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఇంటికి పిలిపించుకొని బెదిరించారు. పోస్టులో కొనసాగాలంటే 2 కోట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టారు. తాను అంత ఇచ్చుకోలేనని ఆ డాక్టర్ విన్నవించుకున్నారు. దీంతో ఆ డాక్టర్ పెద్ద అవినీతి పరుడని, వెంటనే మార్చాలంటూ తన కార్యకర్తలతో ఆందోళన చేయించి, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయించారు. తనకు ఎన్నికల్లో సహకరించలేదన్న కారణంతో ఓ ప్రైవేటు స్కూల్ యజమాని ఇంటిని కూలగొట్టించారు. ఆ తర్వాత కేసును సెటిల్ చేసుకొని బాధితుడి నుంచే 20 లక్షలు తీసుకున్నారని తెలిసింది. నియోజకవర్గంలోని బార్‌లపై ఆయనదే ఆధిపత్యం. నెలనెలా ఆయనకు ముడుపులు పంపించాల్సిందే. పోలీసులు, రెవెన్యూ అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించేందుకు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు.
అమాత్యా.. పీఏ కథేంటి?
కోస్తా జిల్లాలో ఓ మంత్రివర్యుడి పీఏ కథ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు కుడిచేతిలో చంద్రబాబు, ఎడమ చేతిలో లోకేశ్ ఉన్నారంటూ బహి రంగంగానే వ్యాఖ్యలు చేస్తుంటారు. మంత్రిని కలవడానికి వచ్చే వారిపై నోటి దురుసు ప్రదర్శిస్తారనే విమర్శలున్నాయి. కొద్దిరోజుల కిందట మంత్రి చెప్పిన మాట పీఏ వినలేదట. అక్కరలేదనుకుంటే పీఏను తీసేయచ్చు. కానీ ఆ మంత్రి స్టయిలే వేరు. ఓ అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో పీఏను కారులో నుంచి దించేశారట! అసలే చీకటి. దారీ తెన్నూ తెలియక.. అవస్థలు పడి ఆ పీఏ ఇంటికి చేరారు.
Updated Date - Oct 08 , 2024 | 08:52 AM