అమరావతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి 20 ఎకరాలు
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:39 AM
రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది.
మరిన్ని సంస్థలకూ భూ కేటాయింపులు
కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
గతంలో ఇచ్చిన భూములకు ఓకే
ఆ కేటాయింపులకు గడువు పొడిగింపు
పాత ధరలకే పాత వారికి భూములు
నూతన పాలసీ మేరకు కొత్తగా భూ కేటాయింపులు
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికారులు నేరుగా హాజరవగా.. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, దుర్గేష్, సంధ్యారాణి జూమ్ ద్వారా పాల్గొన్నారు. అమరావతిలో భారీ స్థాయిలో నిర్మించే ఈఎ్‌సఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు కేటాయిస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్‌కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు 15 ఎకరాలు, ఎల్‌అండ్‌టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు 5 ఎకరాలు, బ్రహ్మకుమారీ ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించింది. ఇక టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు పూర్తి అంగీకారం తెలిపింది.
సమావేశం అనంతరం కొల్లు రవీంద్రతో కలసి మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదని మండిపడ్డారు. 2019కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించామన్నారు. వాటికి కాల పరిమితి ముగియడంతో తిరిగి వారి నుంచి రాతపూర్వకంగా అంగీకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ ఉప సంఘం నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. దీంతో పాటు ఆయా సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎంత భూమి కేటాయించారు.. ప్రస్తుతం ఎంత అవసరం అనే దానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్తగా భూ కేటాయింపులు చేసే సంస్థలకు ధరల అంశంలో ఓ పాలసీ తయారు చేస్తామన్నారు. అన్ని సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.
త్వరలో పాత టెండర్లు రద్దు
జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయని నారాయణ చెప్పారు. ఈ డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిమీ ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయన్నారు. గతంలో పనులు నిలిచిపోయిన వాటికి సంబంధించి టెండర్ ఒప్పందాలు రెండు మూడు రోజుల్లో రద్దు చేసి.. ఆ వెంటనే కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. జగన్ రాజధానిపై గందరగోళం సృష్టించడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని కొల్లు రవీంద్ర విమర్శించారు.
Updated Date - Nov 30 , 2024 | 04:39 AM