Chandrababu : స్వర్ణాంధ్ర సాధనకు12 సూత్రాలు
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:25 AM
‘స్వర్ణాంధ్ర - 2047’ సాధనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 12 సూత్రాలను నిర్దేశించారు.
‘వికసిత్ భారత్’కుసమాంతరంగా ‘విజన్ 2047’
ఏఐ, రోబోటిక్స్ నాలెడ్జ్ సిటీలుగా అమరావతి, తిరుపతి, విశాఖ
నీతి ఆయోగ్ బృందానికి చంద్రబాబు ప్రజెంటేషన్
ప్రజారోగ్యమే ఫస్ట్.. సాంకేతికత, ఉపాధికి ప్రాధాన్యం
డిమాండ్ - సప్లై ఆధారంగా నైపుణ్యాల మెరుగుదల
ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం
18 లక్షల మంది సూచనలతో ‘విజన్’ డాక్యుమెంట్
క్లీన్ ఎనర్జీలో 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి లక్ష్యం.. పాలసీ డాక్యుమెంట్ విడుదల
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర - 2047’ సాధనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 12 సూత్రాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా 2047 నాటికి రాష్ట్ర రూపు రేఖలు మార్చేలా ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై బుధవారం సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో పాటుపలువురు అధికారులు పాల్గొన్నారు. ‘వికసిత్ భారత్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని మోదీ వచ్చేనెల ఆవిష్కరించనున్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు, లక్ష్యాలను గుర్తించడంలో భాగంగా బుధవారం నీతి ఆయోగ్ ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చారు. ‘వికసిత్ భారత్-2047’కు సమాంతరంగా ‘స్వర్ణాంధ్ర’ సాధనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 18 లక్షల మంది ప్రజల నుంచి వచ్చిన సూచనలను క్రోడీకరించి ‘విజన్- 2047’లో చేర్చామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని... అందుకే ప్రజారోగ్యానికి పెద్దపీట వేశామని చెప్పారు. ఏఐ, రోబోటిక్స్ నాలెడ్జ్ సిటీలుగా అమరావతి, తిరుపతి, విశాఖలను తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఇంటికొక ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేసి ప్రజల తలసరి ఆదాయం పెంచామని, ఇప్పుడు అదేబాటలో ఇంటికొక పారిశ్రామికవేత్త ఉండాలని విజన్- 2047 డాక్యుమెంట్‌ను రూపొందించామని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనలో సాంకేతికత... ఇలా ఆయా లక్ష్యాలపై నీతి ఆయోగ్ సభ్యులకు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ లక్ష్యాలు... అందులోని అంశాలు ఇవి..
1. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం
పోషకాహారం, ఆరోగ్యకరజీవనంపై అవగాహన
వ్యాధుల నుంచి విముక్తి కోసం ఏడు హెల్త్ మిషన్లు
ప్రతి పౌరుడికి ఒకేరకమైన వైద్యపరీక్షలు, డిజిటల్ ప్రొఫైల్
అరకు, పశ్చిమ గోదావరిలో ప్రపంచస్థాయి ఆయుష్ ఇనిస్టిట్యూట్లు
యువశక్తి కోసం కుటుంబం ఒక యూనిట్‌గా తీసుకుని జనాభాలో హెచ్చుతగ్గులను నిర్ణయించడం
2. నైపుణ్యాల మెరుగుదల
వివిధ రంగాల్లో డిమాండ్-సప్లై ఆధారంగా నైపుణ్యాల గణన
అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఏఐ రోబోటిక్స్ నాలెడ్జ్ సిటీలుగా మార్చడం
ఏపీ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు
పాఠశాల విద్యలో క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఏర్పాటు
3. సురక్షిత, నాణ్యమైన జీవనం కోసం
పేదరిక నిర్మూలన... ఏపీ మహిళా సాధికారత మండలి ఏర్పాటు
ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాల శిక్షణ సౌకర్యాలతో సంక్షేమ హాస్టళ్లు
సామాజిక భద్రత, ఉపాధి కోసం సీనియర్ సిటిజన్ల స్వయం సహాయక బృందాలు ఏర్పాటు
4. వాతావరణ సంరక్షణ
వాతావరణ సంరక్షణ కోసం రాష్ట్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక
వాతావరణ సవాళ్లపై జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు
మడ అడవుల విస్తీర్ణం పెంచడం
5. అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు
అమరావతి, తిరుపతి, వైజాగ్, కర్నూలు, కాకినాడ, నెల్లూరు నగరాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా నగర పరిధిలో కలపడం
అంతర్జాతీయ స్థాయిలో జీవించడానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాలో రాష్ట్రం నుంచి కనీసం రెండింటినైనా చేర్చడం
6. తూర్పు ప్రాంతానికి లాజిస్టిక్స్ హబ్
రెండు మెగా పోర్టుల నిర్మాణం
తక్కువ ధరలోనే షిప్‌బిల్డింగ్, మరమ్మతులు, రీసైక్లింగ్
రెండు నుంచి మూడు కోస్టల్ ఎకనమిక్ జోన్ల ఏర్పాటు
రాష్ట్రంలో 3 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు, 10 కంటే ఎక్కువ దేశీయ ఎయిర్‌పోర్టుల నిర్మాణం.
వైజాగ్, అనంతపురం, ఓర్వకల్లు, కొప్పర్తిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు.
7. పరిశ్రమలు, పునరుత్పాదక కేంద్రాల ఏర్పాటు
25కి పైగా పారిశ్రామిక జోన్లు. ఇందులో 3 ఎకనమిక్ కారిడార్లు
ఆయా పారిశ్రామిక జోన్లకు దగ్గరగా, నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతు.
8. నెక్ట్స్ జనరేషన్ సర్వీస్ హబ్
ఏఐ, వ్యవసాయ హబ్‌గా అమరావతి, నానోటెక్నాలజీ, డ్రోన్ల హబ్‌గా తిరుపతి, రోబోటిక్స్ హబ్‌గా అనంతపురం - కర్నూలు, మెడ్‌టెక్, ఫిన్‌టెక్ హబ్‌గా వైజాగ్‌లను అభివృద్ధి చేయడం
ఏఐ సదస్సులు, ఏపీ డిజిటల్ ఎక్స్‌పోలు నిర్వహించడం
9. అంతర్జాతీయ వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార కేంద్రంగా ఏపీ
అత్యంత విలువైన 27 పంటలు, ఉత్పత్తులను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేయడం
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల జోన్, ఫుడ్ పార్కులు, వినియోగం అధికంగా ఉన్న ప్రాంతాలకు దగ్గరగా అర్బన్ క్లస్టర్లు
10. పర్యాటక కేంద్రంగా ఏపీ
తిరుపతి, అరకు, శక్తిపీఠాలు, బీచ్‌లు, నదులు ఇతర పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి ప్రాచుర్యం కల్పించడం
పర్యాటక సర్క్యూట్ల ఏర్పాటు
సీప్లేన్లు, హెలీ టూరిజం, గోల్ఫ్ కేంద్రాలు, వెల్‌నెస్ కేంద్రాలు
సేవారంగంలోకి అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆహ్వానించడం
11. డిజిటల్ పరిపాలన
ఏఐ అనుసంధానిత టెక్నాలజీ సేవల ద్వారా ప్రతి పౌరుడికి వ్యక్తిగతంగా సేవలందించడం
సముద్ర ఆధారిత ఉత్పాదక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
అన్ని శాఖల లక్ష్యాలు, వాటి సాధన నమోదుకోసం ఒక కామన్ ప్లాట్‌ఫాం
12. సమర్థవంతమైన ఆర్థిక విధానాలు
ఏఐ, బ్లాక్‌చైన్, భూవిలువ ఆధారిత విధానాలతో సంప్రదాయిక ఆదాయ మార్గాలను బలోపేతం చేసుకోవడం
దీర్ఘకాలిక కాలపరిమితితో, తక్కువ వడ్డీకే డబ్బు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ను బలోపేతం చేయడం
అంతర్జాతీయ వెల్త్‌ఫండ్స్, డెవల్‌పమెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయి మౌలికసదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం.
Updated Date - Oct 31 , 2024 | 05:26 AM