ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu : పేదింటికి పండగొచ్చింది

ABN, Publish Date - Jul 02 , 2024 | 03:50 AM

పింఛన్ల చరిత్రలోనే తొలిసారి ఒకేనెల రూ.ఏడువేలు చేతికి అందుకున్న ఆనందం.. ఇక అందదు అనుకున్న లబ్ధి చేతికి రావడంతో ఉద్వేగం..

పెనుమాకలో గిరిజనుడి పూరింటికి సీఎం.. ఉబ్బితబ్బిబ్బయిన రాములు నాయక్‌ కుటుంబం

కుక్కిమంచంలో కూర్చుని యోగక్షేమాలు విచారించిన చంద్రబాబు

నాయక్‌కు వృద్ధాప్య పింఛను పంపిణీ.. ఆయన భార్యకు వ్యవసాయ కూలీ పెన్షన్‌

కుమార్తెకు వితంతు పింఛను.. స్వయంగా అందజేసిన సీఎం

ఇల్లు కూడా మంజూరు చేస్తూ అక్కడికక్కడే పత్రాలు అందజేత

ఆహా... ఒకటో తారీఖు!

అమ్మో... ఒకటో తారీఖు కాదు! ఇది... ఆహా ఒకటో తారీఖు! అవ్వా తాతల మోములో ‘పెంచిన పింఛను’ వెలుగులు నింపిన రోజు! సోమవారం తెలతెలవారగానే ప్రత్యక్షమైన సచివాలయ సిబ్బంది... తలుపుతట్టి మరీ పింఛను అందించారు. మూడు నెలల బకాయి రూ.3వేలు, ఈ నెల పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు చేతికిచ్చారు. ఉదయం నుంచి రాత్రి దాకా నిరాటంకంగా పెన్షన్‌ పంపిణీ ప్రక్రియ సాగింది. ఇక... ఉద్యోగపర్వంలోనూ కొత్త అధ్యాయం మొదలైంది. నాలుగున్నరేళ్లుగా పదో తేదీ దాటినా పడని జీతాలు నేడు ఒకటో తేదీనే బ్యాంకు ఖాతాల్లో పడిపోవడం... మొబైల్‌ ఫోన్లో ‘క్రెడిటెడ్‌’ మెసేజ్‌లు టింగుటింగుమని మోగడంతో ఉద్యోగులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలోని అత్యధిక శాతం ఉద్యోగులకు సోమవారమే జీతాలు పడ్డాయి. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లూ పడటం మొదలైంది. ఉపాధ్యాయులకు, మిగిలిన వారికీ మంగళవారం జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. సుమారు 62 లక్షల మందికి సామాజిక పింఛన్లు, దాదాపు 10 లక్షలమందికిపైగా ఉద్యోగులకు వేతనాలు! వెరసి... ఈ ఒకటో తారీఖు లక్షల కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.

ఇంటి గడపలోకే సంక్షేమం సొమ్ము

పెన్షన్ల చరిత్రలోనే తొలిసారి 7వేలు చేతికి...

యజ్ఞంలా ‘ఎన్టీఆర్‌ భరోసా’ కార్యక్రమం

ఉదయం 5.30కల్లా కదిలిన సచివాలయాల ఉద్యోగులు

రాత్రి 8 గంటల కల్లా 94.75 శాతం మందికి..

వలంటీర్లు లేకున్నా సాఫీగా కార్యక్రమం

ఉద్యోగులపై జగన్‌వి అబద్ధాలని తేలిపోయిన వైనం

పెనుమాకలో బాబు, పిఠాపురంలో పవన్‌ పంపిణీ

నియోజకవర్గాల్లో మంత్రులు, నేతలు నేరుగా హాజరు

పింఛన్ల చరిత్రలోనే తొలిసారి ఒకేనెల రూ.ఏడువేలు చేతికి అందుకున్న ఆనందం.. ఇక అందదు అనుకున్న లబ్ధి చేతికి రావడంతో ఉద్వేగం... ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా ఇంటి గడప తొక్కి ‘ఇందా సొమ్ము’ అని అందిస్తుంటే పట్టలేనంత సంబరం... వెరసి రాష్ట్రమంతా పింఛన్ల పండగ మహాసంరంభంగా సాగింది. సంక్షేమపథంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి అడుగులోనే సూపర్‌ హిట్‌ కొట్టింది. పింఛను డబ్బులు తీసుకున్న లబ్ధిదారుల మోముల్లో ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలూ కళగట్టాయి. మరోవైపు పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగులతో వీలు కాదు.. వలంటీర్లతోనే అది సాధ్యమవుతుందంటూ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేసిన వాదనలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పటాపంచలు చేశారు. ‘బ్యాంకులకు వెళ్లి పింఛను డబ్బులు డ్రా చేసుకుని వచ్చేది మేం.. మాకు వాటిని పంపిణీ చేయడం చేతకాదా’ అని అప్పట్లో తేల్చిచెప్పిన ఈ ఉద్యోగులు, అన్నట్టుగానే ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీని దాదాపు పూర్తి చేశారు. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సోమవారం ఉదయం 5.30 గంటలనుంచే ప్రారంభమైంది. రాత్రి 8 గంటల సమయానికి 94.75 శాతం పంపిణీ పూర్తి అయింది. ఇందులో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 96.93 శాతంమందికి, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 91.27 శాతం మందికి పింఛన్‌ సొమ్ములు అందాయి. రాష్ట్రంలో పింఛన్లు అందుకుంటున్న వారు 64 లక్షలమంది ఉండగా, వారిలో 61 లక్షలమంది చేతికి సొమ్ము చేరిపోయింది. రాజధానిలోని పెనుమాకలో జరిగిన పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పాల్గొంటే, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పింఛను సొమ్ము పేదల చేతికి అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.


పరుగు వేగంతో పూర్తి...

రాష్ట్రంలో 1.2 లక్షలమంది సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్యావంతులు కావడం, సాంకేతిక నైపుణ్యం తెలిసినవారు కావడంతో వీరు పెన్షన్ల పంపిణీలో తమకిచ్చిన టార్గెట్‌ను అందుకోగలిగారు. బయోమెట్రిక్‌ మెషిన్ల ద్వారా వేగంగా ప్రక్రియను ముగించారు. నిజానికి, గతంలో కూడా వలంటీర్లు....సచివాలయ ఉద్యోగుల సహకారం లేకుండా పెన్షన్లు పంపిణీ చేయలేదు. డబ్బులు బ్యాంకుల నుంచి డ్రా చేసి వలంటీర్లకు అందించడంతోపాటు సాంకేతిక సహకారం అందించేవారు. ఇప్పుడు వారే రంగంలోకి దిగడంతో పంపిణీ తేలికైంది. విధి నిర్వహణలో వీరి పట్టుదలను ముఖ్యమంత్రి అభినందించారు.

పండగలా పంపిణీ

పవన్‌కల్యాణ్‌ తన నియోజకవర్గం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రవాణాశాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అప్పుఘర్‌ వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, ఇన్‌చార్జి కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, తదితరులు పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేశారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీలో, దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పింఛన్లు అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఉదయం ఆరు గంటలకే తొలి పింఛన్‌ను లబ్ధిదారులకు అందించారు. రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ నంద్యాల పట్టణంతో పాటు, మండలంలో లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్లను అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణంతోపాటు పలుగ్రామాల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి .. అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి వంగలపూడి అనిత, అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, కూటమి నేతలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టూరిజం మంత్రి కందుల దుర్గేశ్‌, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలుు ఉత్సాహంగా పెన్షన్‌ పంపిణీలో పాల్గొన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బాపట్ల జిల్లా రేపల్లెరూరల్‌ మండలం పేటేరులో పింఛన్లను లబ్ధిదారులకు అందించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖ జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని వడ్లపూడిలో.. సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో మంత్రి అచ్చెన్నాయుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, పెనుకొండలో మంత్రి సవిత.. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో సమాచారశాఖ మంత్రి పార్థసారథి పింఛను పంపిణీ నిర్వహించారు. పెంచిన పింఛన్‌పై అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఎన్టీఆర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. - ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

ఇప్పుడేమంటారో..?

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు వలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలిచ్చింది. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది. అయితే అది సాధ్యం కాదని జగన్‌ ప్రభుత్వం లేఖ రాసింది. అప్పటి సీఎస్‌ జవహర్‌రెడ్డి కోర్టుకు సైతం ఇదే చెప్పారు. ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించి.... పెన్షన్లను సచివాలయాల వద్దకు వచ్చి తీసుకోవాలని మార్గదర్శకాలిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలో సచివాలయాలకు వచ్చిన పండుటాకులు వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు. సుమారు 33 మంది మృత్యువాత పడ్డారు. ఎన్నికల కోడ్‌ సమయంలో కూడా అధికారులు అలానే వ్యవహరించారు. ఈసారి పెన్షన్‌ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, ఉన్న అకౌంట్లు ఆధార్‌తో లింక్‌ కాకపోవడం, కొందరికి పనిచేయని బ్యాంక్‌ ఖాతాల్లో జమ కావడంతో పింఛనుదారులు నరకం చూశారు. ఇలా ఎన్నికల సమయంలో వైసీపీ సర్కారు... పెన్షన్‌దారులతో ఆటాడుకుంది. వలంటీర్లతోనే సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమని గట్టిగా ప్రచారం చేసుకున్నారు. పైగా టీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్లను తొలగిస్తారని, పెన్షన్లు తమలా ప్రతి నెలా ఇంటింటికీ అందించబోరని ప్రచారం చేశారు.

Updated Date - Jul 02 , 2024 | 03:51 AM

Advertising
Advertising