Chandrababu : చుక్కల భూములకు చెక్
ABN, Publish Date - Aug 08 , 2024 | 02:39 AM
నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చీకటి దందా తేలేదాకా ‘22ఏ’ భూముల రిజిస్ట్రేషన్లు బంద్
రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం
గ్రామాలవారీగా రెవెన్యూ సభలు
అక్కడే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ.. 3 నెలల్లో పరిశీలన
డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో విచారణ కమిటీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించిన భూముల రిజిస్ట్రేషన్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కారు హయాంలో అక్రమంగా, నిబంధ నలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి భూములను తొలగించి చేసుకున్న రిజిస్ట్రేషన్ల వ్యవహారం తేల్చేదాకా 22ఏ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని మంత్రివర్గం బుధవారం తీర్మానించింది. గత ఐదేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపైనా విచారణ జరపాలని నిర్ణయించింది. తమ భూములు బలవంతంగా లాక్కున్నారని, రికార్డులు తారుమారు చేశారని, భూకబ్జాలు చేశారని పేదలు, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని గ్రామాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించాలని.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని.. అప్పటివరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిశ్చయించింది. గత ప్రభుత్వంలో 22ఏ భూములను ఫ్రీ హోల్డ్ చేసి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందులో 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. భూ కబ్జాలను, తప్పుడు రిజిస్ట్రేషన్లన్నింటినీ బయటపెట్టాలని.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 25 వేల ఎకరాలపైనా విచారణ జరపాలని కేబినెట్ ఇప్పుడు నిశ్చయించింది. అక్రమ ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అసైన్డ్, చుక్కల భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, రీ సర్వే అంశాలపై చర్చ జరిగింది. 36 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు గాను ఇప్పటి వరకు 13 లక్షల ఎకరాలను 20 ఏళ్ల కాలపరిమితి నిబంధన కింద నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించారని రెవెన్యూ శాఖ ఈ సందర్భంగా నివేదించింది. ముందుగానే పేదల నుంచి లాక్కుని, బెదిరించి దౌర్జన్యంగా తీసుకున్న భూములను ఫ్రీ హోల్డ్ కింద 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ కేసులను పునఃపరిశీలించాలని మంత్రివర్గాన్ని కోరింది. 25 వేల ఎకరాల అసైన్డ్ భూములను గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారని, దీనికి కేవలం ఒక శాతం రిజిస్ట్రేషన్ చార్జీ పడిందని.. ఇది కూడా పెద్ద గోల్‌మాల్ వ్యవహారమేనని తెలిపింది. వీటన్నిటినీ పునఃసమీక్షించి విచారణ చేపట్టాలని కోరింది. వీటిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. విచారణ చేపడతామని చెప్పారు. పేదల నుంచి ఫిర్యాదులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి తేల్చేయాలన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. భూముల అక్రమాలపై పరిశీలనను మూడు నెలల్లో పూర్తిచేయాలని.. అప్పటిదాకా అసైన్డ్, చుక్కల భూములను 22ఏ నుంచి తొలగించరాదని.. ఇప్పటికే తొలగించిన వాటిని రిజిస్టర్ చేయకుండా నిలిపివేయాలని స్పష్టం చేశారు.
మళ్లీ రెవెన్యూ సదస్సుల్లోనే పరిష్కారం..
తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు భూమి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించేది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగం పాల్గొనేవారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని పరిష్కరించేవారు. జగన్ సర్కారు వచ్చాక వాటిని పక్కనపెట్టారు. ఇప్పుడు మళ్లీ గ్రామాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖను ఆదేశించారు. ‘వైసీపీ నేతలు తమ భూములు దౌర్జన్యంగా లాక్కున్నారని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రజలు అమరావతికి భారీగా తరలివస్తున్నారు. ఇక్కడిదాకా రావడం వారికి ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి రెవెన్యూ శాఖే ప్రజల వద్దకు వెళ్లాలి. గ్రామగ్రామానా సదస్సులు నిర్వహించండి. వైసీపీ నేతల దౌర్జన్యాల వల్ల భూములు, ఆస్తులు కోల్పోయిన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోండి. అందులోని అంశాలను అక్కడే పరిశీలించి సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలి. ప్రజల వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులు, ఇప్పుడు మార్చిన రికార్డులను సరిపోల్చండి. తప్పులు ఎక్కడున్నాయో, దానికి బాధ్యులెవరో కనిపెట్టండి.. అక్రమార్కులపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలి’ అని తేల్చిచెప్పారు. మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో 22ఏ భూముల ఫైళ్లను తగులబెట్టిన నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఫ్రీహోల్డ్ అనంతరం భారీగా అసైన్డ్, చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అందులో సింహభాగం వైసీపీ నేతలు చేజిక్కించుకున్నవే. వీటిపైన, ఇతర భూ అక్రమాలపైన విచారణకు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే ఉత్తర్వులు ఇవ్వనుంది.
Updated Date - Aug 08 , 2024 | 07:17 AM