Chandrababu : జగన్‌కు ఓటేస్తే ఉరితాడే!
ABN, Publish Date - May 11 , 2024 | 05:20 AM
మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ భూమి మీది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. జగన్‌కు ఇంకోసారి ఓటేస్తే ఉరి తాడేనన్నారు.
నాయకుడి మాట కోసం...
మాచర్లలో సభ మొబైల్‌లో బాబు ప్రసంగం
వాతావరణం అనుకూలించలేదు. హెలికాప్టర్ ఎగరలేదు! వస్తానన్న నాయకుడు రాలేకపోయారు. అయినా సరే... అభిమాన జన సందోహం కట్టుకదల్లేదు! ఆయన మాట కోసం ఎదురు చూశారు! ఇది... పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటన! శుక్రవారం సాయంత్రం మాచర్ల సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. 60వేల మందికిపైగా జనం గుమికూడారు. కానీ... వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు హెలికాప్టర్‌లో అక్కడికి రాలేకపోయారు. అయినా సరే... పెద్దసంఖ్యలో జనం అక్కడి నుంచి కట్టకదలకుండా నిలిచారు. దీంతో... ఒంగోలులో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణ దేవరాయలు మొబైల్ ఫోన్‌కు వీడియో కాల్ చేసి లైవ్ ద్వారా మాచర్ల సభను ఉద్దేశించి ప్రసంగించారు.
మీ బిడ్డనంటూ మీ భూమి కొట్టేస్తాడు: చంద్రబాబు
ఆయన మళ్లీ వస్తే.. మీ ఆస్తి మీది కాదు!.. భూరికార్డులు ప్రైవేటు ఏజెంటు వద్ద పెడతారట
టైటిలింగ్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్‌ను ఆయనే నామినేట్ చేస్తాడట.. కోర్టుకు వెళ్లకూడదట..!
జగన్ ప్రైవేటుగా పెట్టుకున్న వ్యక్తికి ప్రజల ఆస్తులపై పెత్తనమేంటి?
మన భూమి మన బిడ్డలకు దక్కాలంటే ఈ దొంగ బిడ్డను ఇంటికి తరలించాలి
నేటి సాయంత్రం 4 గంటలకు ఆ చట్టం ప్రతులను చించి చెత్తబుట్టలో పారేయండి
నా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపైనే.. రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు ఇస్తా
ప్రజాసంక్షేమం కోసం పనిచేసే బాధ్యత నాది, పవన్‌ది: బాబు
మచిలీపట్నం/గన్నవరం/భీమవరం/మాచర్ల/ఒంగోలు, మే 10 (ఆంధ్రజ్యోతి): మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ భూమి మీది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. జగన్‌కు ఇంకోసారి ఓటేస్తే ఉరి తాడేనన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. మండుటెండలో ఉండిలో, భారీవర్షంలోనూ గన్నవరంలో, ఒంగోలు నుంచి మాచర్ల ప్రజలతో వర్చువల్‌గా, ఒంగోలులో రోడ్‌షో నిర్వహించి భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. గత ఎన్నికల ముందు జగన్ ముద్దులుపెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని.. ప్రజల భూములు, ఆస్తుల కబ్జాకు ఏకంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టమే తెచ్చారని విరుచుకుపడ్డారు. ‘భూమి మీదా, జగన్‌దా? మీ భూమిపై ఆయన ఫొటో ఏంటి..? మీ భూమిని మీకు ఎవరిచ్చారు? ఈ జగన్ ఇచ్చాడా.. వాళ్ల తాత ఇచ్చాడా.. నాన్న ఇచ్చాడా? జగన్ ఇచ్చే భూమి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలను చించిచెత్తబుట్టలో వేయాలి. ఆయన మళ్లీ వస్తే మీ ఆస్తులు కొట్టేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్‌ను ఆయనే నామినేట్ చేస్తాడట.. రిజిస్ర్టేషన్ చేయాలంటే ఆయన చెప్పిందే ఫైనల్ అట.. కోర్టుకు కూడా వెళ్లకూడదట.. జగన్ ప్రైవేటుగా పెట్టుకున్న వ్యక్తికి ప్రజల ఆస్తులపై పెత్తనమేంటి? వీటికి జగన్ సమాధానం చెప్పాలి. ప్రస్తుతం భూమికి సంబంధించి 10వన్, అడంగళ్ రికార్డులు ఉన్నా కొన్ని చోట్ల వైసీపీ నాయకులు భూమిని కాజేశారు. కొత్తచట్టంలో ఎంఆర్‌వో ఉండడు, ఆర్డీవో ఉండడట!! అందుకే హామీ ఇస్తున్నా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపైనే. పట్టాదార్ పాస్‌పుస్తకంపై రాజముద్ర వేసి భూమిపై మీకు సర్వహక్కులు కల్పిస్తా. మంచి భవిష్యత్ కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాపీలను చించి చెత్తబుట్టలో పారేద్దాం. సమయం లేదు మిత్రమా.. ఈ చట్టాన్ని మేం ఆమోదించబోమంటూ శనివారం సాయంత్రం 4 గంటలకు దాని ప్రతులను చించి చెత్తబుట్టలో పారేయండి’ అని పిలుపిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో దొంగలు పడి భూములను కబ్జా చేశారు.. రికార్డులు మార్చేశారని తెలిపారు. వైసీపీని గెలిపించేందుకు కృషి చేస్తే మీ ఆస్తులూ ఉండవని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్‌పై మాట్లాడడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..
జగన్ నవమోసాలు..
జగన్ నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే బాధ్యత నేను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకుని ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తాం. మేమొచ్చాక గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. దేశంలో నాలుగు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. వృద్ధులకు ఏప్రిల్ నుంచే రూ.4 వేలు పింఛన్ ఇంటికే ఇస్తాం. జూలైలో మొత్తం ఏడు వేలు ఇస్తాం. బీసీ డిక్లరేషన్‌లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. ఓటుకు వైసీపీ 5 వేలు నుంచి 10 వేలు ఇస్తుంది. కానీ ఆ పార్టీకి ఓటు వేయొద్దు. రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ర్టాన్ని పురోభివృద్థి బాటలో నడపాలనే లక్ష్యంతోనే 3 పార్టీలం కలిసి వచ్చాం.
పిల్ల సైకోను ఓడించండి
గన్నవరంలో పిల్ల సైకో (ఎమ్మెల్యే వల్లభనేని వంశీ) ఉన్నాడు. మాతో పెట్టుకుంటే తోక కత్తిరిస్తా. ఆయన్ను ఈసారి చిత్తు చిత్తుగా ఓడించాలి. శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. గన్నవరం టీడీపీ కార్యాలయాలన్ని తగులబెట్టిన ఈ పిల్ల సైకోపై టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వీరోచిత పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తా. అత్యధిక మెజారిటీతో ఆయన్ను, మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలి. శ్రమజీవి తాగే మద్యం రూ.60 నుంచి రూ.200కు పెంచేశాడు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఉరివేయాలి.. ఫ్యాన్ తిరగకూడదు. లేకపోతే మీ మెడకు ఉరితాడు వేస్తారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పిస్తాం.
పవన్ త్యాగం మరువలేం..
రాష్ట్రం కోసం పోరాడుతున్న నాయకుడు పవన్ కల్యాణ్ త్యాగం మరిచిపోలేనిది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ధ్యేయంతో.. పొత్తుతో గెలవాలని ప్రతిపాదించి అందరినీ ఒప్పించారు. రాష్ర్టాన్ని కాపాడాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకొచ్చింది. సైకిల్ గుర్తుపై ఓటేసి.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. మేం జట్టు కట్టింది ప్రజల కోసం. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించిందే తెలుగుదేశం. దేశంలోని మత పెద్దలంతా టీడీపీ మద్దతివ్వడం సంతోషకరం. ఈ ఎన్నికల్లో జగన్ సాగిస్తున్న అరాచక పాలనకు ప్రజానీకం ముగింపు పలకాలి.
గన్నవరం నుంచి ఒంగోలుకు
చంద్రబాబు గన్నవరం సభలో పాల్గొ న్న అనంతరం మాచర్ల సభకు హాజరై అక్కడి నుంచి ఒంగోలు చేరి రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే గన్నవరం సభ అనంతరం మాచర్ల వెళ్లేందుకు వాతావరణం అనుకూలంగా లేక నేరుగా ఒంగోలు వచ్చారు.
ఎండగా ఉందని ఇంట్లో పడుకుంటే.. ఎన్నికలయ్యాక ప్రతి ఇంటికీ గొడ్డలి వస్తుంది. అందుకే ఉదయం ఏడు గంటలకే అంతా ఓటు వేయాలి. పోలింగ్ కేంద్రాలు దద్దరిల్లిపోవాలి.
పవన్ కల్యాణ్ నిజ జీవితంలోనూ హీరోయే. నన్ను జైలుకు పంపినప్పుడు స్వచ్ఛందంగా వచ్చి మద్దతిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని.. కూటమి ఏర్పడాలని ఆ రోజే ఆయన చెప్పారు.
మన భూమి మన బిడ్డలకు దక్కాలంటే ఈ దొంగ బిడ్డను ఇంటికి తరలించాలి. జీవితాంతం కష్టబడి సంపాదించిన ఆస్తిని మెడపై కత్తి పెట్టి రాయించుకుంటున్నారు.
- చంద్రబాబు
90% పోస్టల్ బ్యాలెట్లు మాకే!
పోస్టల్ బ్యాలెట్‌లో ఉద్యోగులతో పాటు పోలీసులు.. నూటికి 90 మంది కూటమికే ఓట్లు వేశారు. ఓట్లు వన్‌సైడ్ పడ్డాయి. పరిస్థితి ఏమిటో వైసీపీకి ఈపాటికే అర్థమైంది. ఉద్యోగులకు ఓటుకు ఐదు వేలు ఇవ్వబోతే మాకు నీతి ఉందని చెప్పి.. మీరిచ్చే అవినీతి డబ్బులు వద్దని తిరస్కరించారు. ఉద్యోగులు చరిత్రను తిరగరాస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో సత్తా చూపారు. పోలీసులు సైతం బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. అలాంటి ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి పనిచేస్తా. మళ్లీ జగన్ వస్తే ఉద్యోగుల జీతాలు తగ్గించేందుకు రివర్స్ పీఆర్సీ వేస్తాడన్న విషయం గుర్తుంచుకోవాలి.
చిత్తూరులో చివరి సభ.. చంద్రబాబు సెంటిమెంట్
చిత్తూరు, తిరుమల, మే 10(ఆంధ్రజ్యోతి): చంద్రబాబుకు చిత్తూరు సెంటిమెంట్ ఉంది. శనివారం ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఆయన వరుసగా మూడు సభల్లో... నంద్యాల, హిందూపురం, చిత్తూరులో పాల్గొంటారు. 2014 ఎన్నికల్లో ఆయన చిత్తూరులోనే చివరి ప్రచార సభను నిర్వహించారు. అప్పుడు ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. అదే సెంటిమెంటును ఇప్పుడూ కొనసాగిస్తూ చిత్తూరు సభతో తన ప్రచారానికి ముగింపు పలకనున్నారు. కాగా, చంద్రబాబు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చిత్తూరులో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికి సాయంత్రం 6.30 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకుంటారు. అర్ధగంట తర్వాత కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు.
Updated Date - May 11 , 2024 | 05:46 AM