Chandrababu : కిక్కు లెక్క తేలుస్తాం
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:30 AM
జగన్ హయాంలో మద్యం అమ్మకాల్లో భయంకరమైన అవినీతి జరిగిందని ప్రభుత్వం పేర్కొంది.
ముడుపుల కిందే 3,113 కోట్లు నొక్కేశారు
ఖజానాకు మరో 18,860 వేల కోట్ల నష్టం
జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం
ఏడు కంపెనీలకే దాదాపు అన్ని ఆర్డర్లు
వైసీపీ హయాంలో 38 కొత్త బ్రాండ్లు
డిస్టిలరీలను కబ్జా చేసి దందా
తయారీ, అమ్మకం అంతా వాళ్ల చేతిలోనే
పక్క రాష్ర్టాల మద్యంతోనూ దోపిడీ
ధరలు పెంచి పేదల జేబులు లూటీ
నాసిరకంతో అనారోగ్య సమస్యలు
అక్రమాలపై సీఐడీతో విచారణ
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
వేల కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే ఎలా: పవన్
ముడుపులు 3 వేల కోట్లు కావు..
30 వేల కోట్లు: బీజేపీ
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో మద్యం అమ్మకాల్లో భయంకరమైన అవినీతి జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం కమీషన్ల రూపంలోనే రూ.3113 కోట్ల దోపిడీ జరిగిందని స్పష్టంచేసింది. ఇవి వైసీపీ పెద్దలకు ముడుపులుగా చేరాయని తెలిపింది. వీటితో పాటు గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. ఫలితంగా పక్క రాష్ర్టాలకు మద్యం ఆదాయం పెరిగిందని, మనకు ఏర్పడిన నష్టంలో ఎవరి వాటా ఎంతనేది తేలాల్సి ఉందని తెలిపింది. మొత్తంగా గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ మద్యంషాపుల్లో నగదు రూపంలో నాడు లావాదేవీలను అనుమతించడాన్ని అవసరమైతే ఈడీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టంచేసింది. 2019-24 మధ్య కాలంలో అమలైన మద్యం పాలసీలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈసారి శాసనసభ వేదికగా శ్వేతపత్రాన్ని ప్రకటించి, ఎమ్మెల్యేలను చర్చలో భాగస్వాములను చేశారు. ఎమ్మెల్యేల సూచన మేరకు దీనిపై సీఐడీ విచారణ చేయిస్తామని ప్రకటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
దోపిడీకి మద్యం పాలసీ
‘‘మద్యపాన నిషేధం చేస్తామని 2019 ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే కొత్తగా 458 మద్యం షాపులను పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. 840 బార్లలో ఒక్క దాన్ని కూడా తగ్గించలేదు. దోపిడీ కోసం ప్రత్యేకంగా మద్యం పాలసీ రూపొందించారు. ధరలు పెంచితే తాగేవారు తగ్గుతారని చెప్పి ఒకేసారి 75శాతం రేట్లు పెంచారు. అక్రమాలను అరికడతామని ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ ఏర్పాటుచేశారు. కానీ అసాధారణ స్థాయిలో ధరలు పెంచడం వల్ల పక్క రాష్ర్టాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌డీపీఎల్) వస్తోందని సెబ్ అధికారులే రిపోర్టు ఇచ్చారు. గత ఐదేళ్లలో 1.78కోట్ల అక్రమ మద్యం పట్టుబడింది. ఎన్‌డీపీఎల్ 66శాతం, మద్యం నేరాలు 64శాతం పెరిగాయి. వైసీపీ విధానాల వల్ల రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ర్టాలకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో ఆదాయం తగ్గడం వల్ల ఎవరికి మేలు జరిగింది, ఎవరి జేబులు నిండాయో తేలాల్సి ఉంది. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఏపీకి మద్యంపై ఆదాయం రూ.4186కోట్లు తగ్గింది. అదే 2019-24 మధ్య కాలంలో ఏకంగా రూ.42762 కోట్లు తగ్గిపోయింది. మొత్తంగా ఐదేళ్లలో ఏపీ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో రూ.18860 కోట్ల నష్టం వచ్చింది. ఫలితంగా తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో ఆదాయం పెరిగింది’’
మొత్తం వారి చేతుల్లోకి....
‘‘లిక్కర్ సప్లై చెయిన్ మొత్తాన్ని వైసీపీ నేతలు తీసుకున్నారు. అంటే, ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు అన్నీ వారి చేతుల్లోకి వెళ్లాయి. ప్రైవేటు కంపెనీ కంటే అన్యాయంగా చేశారు. ప్రత్యేకంగా ఐఆర్‌టీఎస్ అధికారిని తీసుకొచ్చి ఏపీఎ్‌సబీసీఎల్ ఎండీగా చేసి మరీ, వారికి కావాల్సిన పనులు చేసుకున్నారు. బెదిరించి డిస్టిలరీలు లాక్కున్నారు. మద్యంలో ఎంఎన్‌సీ కంపెనీలను తరిమేశారు. గతంలో ఆన్‌లైన్‌లో కంపెనీలకు ఆర్డర్లు ఇస్తే, దాన్ని మాన్యువల్ చేసి సొంత వాళ్లకు ఇచ్చుకున్నారు. చివరికి ఎంఎన్‌సీ బ్రాండ్లు మాయం చేసి లోకల్ బ్రాండ్లు తెచ్చారు. చీప్ లిక్కర్ అమ్మకాలను 99.97శాతం తగ్గించి, పేదలు రోజంతా కష్టపడి సంపాదించింది తాగుడుకే పెట్టేలా చేశారు’’
కొత్త కంపెనీలకే ఆర్డర్లు
‘‘60శాతం డిస్టిలరీలను లాక్కున్నారు. విశాఖ, పీఎంకే, ఎస్‌పీవై డిస్టిలరీల్లో అదాన్, సన్‌రేస్, లీలా, ఎన్‌వీ డిస్టిలరీలకు సంబంధించిన బ్రాండ్లు ఉత్పత్తి చేసుకున్నారు. పెరల్, ఎస్వీఆర్ డిస్టిలరీలను బలవంతంగా ఆర్డర్లు లేకుండా అణచివేశారు. వైసీపీ హయాంలో 28 లిక్కర్ బ్రాండ్లు, 10 బీరు బ్రాండ్లు కొత్తగా వచ్చాయి. ఎస్‌ఎన్‌జే, అదాన్, లీలా, ఎన్‌వీ, బీ9, సోనా, మూనక్... ఈ ఏడు కంపెనీలకు రూ.15,843 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఎమ్మార్పీ రూ.150ఉన్న మద్యం ఆర్డర్లు 2020-21లో 63శాతం అదాన్, ఎస్‌ఎన్‌జే కంపెనీలకే వెళ్లాయి. మార్కెట్‌లో టాప్-5 బ్రాండ్లకు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? అసలు వ్యాపారం లేని కొత్త బ్రాండ్లకు భారీగా ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు? పైగా బూమ్ బూమ్ పేరుతో విచిత్రమైన బ్రాండ్లు తెచ్చారు. గత ప్రభుత్వంలో ప్రధానంగా రెండు రకాలుగా దోపిడీ జరిగింది. ఎన్‌డీపీఎల్‌ను తీసుకొచ్చి షాపుల్లో పెట్టి తద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి వెళ్లకుండా తీసుకున్నారు. అందుకే ఐదేళ్లలో రూ.99,413 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే అందులో కేవలం రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు చేశారు. డిజిటల్ లావాదేవీలు తీసుకోలేదు. మద్యం ఉత్పత్తి వ్యయం 16శాతం మాత్రమే. మిగిలిన 84శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. అదే ఉత్పత్తి చేసిన మద్యాన్ని పన్నులు వేయకుండా ఎన్‌డీపీఎల్ రూపంలో విక్రయిస్తే ఆ 84శాతం ఆదాయం ఎటు పోయింది? ఇది ఎంత శాతం జరిగిందనేది తేలాలి. ఏపీఎ్‌సబీసీఎల్‌పై విపరీతంగా అప్పులు చేశారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి, భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఫణంగా పెట్టి రూ.16,446 కోట్ల అప్పులు చేశారు. అలాగే వడ్డీ ఎక్కువ వస్తుందనే పేరుతో పది శాఖల డబ్బులు తీసుకొచ్చి బేవరేజెస్ కార్పొరేషన్‌లో పెట్టారు. ఇందుకోసం ఎస్ర్కో ఖాతాలు తెరిచి మరీ అప్పులు చేశారు. ఒకవైపు ఈ అప్పులు తీరుస్తూనే ఆదాయం పెంచుకోవాలి. విధ్వంసానికి గురైన ఎక్సైజ్ శాఖను పునర్‌వ్యవస్థీకరించాలి. మొత్తం ఒకే గొడుగు కింద ఉండేలా చూడాలి. మద్యం షాపులు, బార్లకు కొత్త పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
తలసరి తాగుడు పెరిగింది
‘‘తాగుడు తగ్గిస్తామని చెప్పి చివరికి తలసరి మద్యం వినియోగాన్ని పెంచారు. 2019-20లో తలసరి మద్యం వినియోగం 5.55లీటర్లుగా ఉంటే 2023-24 నాటికి అది 6.23లీటర్లకు పెరిగింది. సెబ్‌ను ఏర్పాటుచేసినా గంజాయి వినియోగం పెరిగింది. గత ఐదేళ్లలో గంజాయి స్వాధీనం 27శాతం పెరిగింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం చూస్తే మద్యం సంబంధిత నేరాలు రాష్ట్రంలో పెరిగాయి. 2022లో మద్యం, డ్రగ్స్ వల్ల వంద శాతం ఆత్మహత్యలు పెరిగాయి. 52శాతం లివర్ సమస్యలు, 54శాతం కిడ్నీ సమస్యలు పెరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లోని డీఅడిక్షన్ సెంటర్‌లో కేసులు 1300 శాతం పెరిగాయి’’
నగదే ఎందుకు?: ఎమ్మెల్యేలు
మద్యంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడిన ఎమ్మెల్యేలు నాటి జగన్ అక్రమాలను ఎండగట్టారు. దాదాపు లక్ష కోట్ల వ్యాపారంలో మొత్తం నగదు లావాదేవీలే చేయడం వెనుక ఆంతర్యం ఏంటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం భారీగా పెరిగిందని మాధవి రెడ్డి అన్నారు. మద్యం వ్యాపారంలో అత్యధికంగా లాభపడిన వ్యక్తి జగన్ ఒక్కరేనని బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో అమ్మిన మద్యం వల్ల వితంతువులు పెరిగారని బుచ్చయ్య చౌదరి అన్నారు.
అక్రమార్కులకు శిక్ష పడాలి: పవన్ కల్యాణ్
మద్యంలో ఆదాయ నష్టం ఎందుకు వచ్చిందనే దానిపై లోతుగా విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. రూ.20వేలు లంచం తీసుకుంటే ఉద్యోగులపై ఏసీబీ విచారణలు చేస్తామని, రోడ్డుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పు చేస్తే ప్రశ్నిస్తామని, అలాంటిది ఇన్ని వేల కోట్లు నష్టం చేస్తే శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అనేది కష్టమని, అయితే నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టంలో కొంత శాతాన్ని డీ-అడిక్షన్ కేంద్రాలకు కేటాయించాలని సూచించారు. ఈ చర్చలో ప్రతిపక్షం కూడా ఉంటే బాగుండేదని, కానీ సభ నుంచి పారిపోయారని ఆరోపించారు. ఎక్కడికి పోయినా తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. ఈ నేరాలకు శిక్ష విధించకపోతే చిన్నవారినే శిక్షిస్తాం, పెద్దవాళ్లను వదిలేస్తాం అనే చెడ్డపేరు వస్తుందని తెలిపారు.
Updated Date - Jul 25 , 2024 | 04:30 AM